
జాతీయ రహదారి దిగ్బంధం
రెండు నెలలుగా పడుతున్న ఆకలి బాధలను తట్టుకోలేక పోయిన కార్మికులు రోడ్డెక్కారు. సమ్మెలో ఉన్న మండలంలోని ఎస్‌ఎంఎస్ కార్మికులు పూసపాటిరేగ జాతీయరహదారిని
పూసపాటిరేగ : రెండు నెలలుగా పడుతున్న ఆకలి బాధలను తట్టుకోలేక పోయిన కార్మికులు రోడ్డెక్కారు. సమ్మెలో ఉన్న మండలంలోని ఎస్‌ఎంఎస్ కార్మికులు పూసపాటిరేగ జాతీయరహదారిని ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దిగ్బంధించారు. దీంతో సుమారు 2గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండువైపులా 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలతో మండల కేంద్రం దద్దరిల్లింది. ఏం జరుగుతోందో తెలియని విధంగా వాతావరణం గంభీరంగా మారింది. దీంతో సీఐ ఎ.ఎస్ చక్రవర్తి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో విసిగిపోయి ఉన్న ప్రయాణికులు రహదారిని దిగ్బంధించిన చోటకు చేరుకుని, సీఐ చక్రవర్తితో వాగ్వాదానికి దిగారు.
చంటిపిల్లలతో ఉన్నవారు,ఫ్లైట్, ట్రైన్‌లకు వెళ్లేవారు సమయం దాటిపోతోంద ని వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు డౌన్‌డౌన్ అంటూ ప్రయాణికులు నినాదాలు చేశారు. రోగులతో ఉన్న అంబులెన్సులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ తరువాత 12 గంటల సమయంలో సీఐ చక్రవర్తి.. కార్మికనాయకుడు తమ్మినేని సూర్యనారాయణతో చర్చలు జరిపి ట్రాఫిక్ పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం వహిస్తున్న నిరంకుశ ధోరణి వల్ల అంతా ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 50 రోజులుగా ఆకలి మంటలతో కార్మికులు అల్లాడుతున్నారని, అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, రమణతో పాటు అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.