
మెసేజ్ చూసి షేర్లు కొంటారా?
♦ బ్రోకరేజీ సంస్థల పేరిట నకిలీ మెసేజ్‌లు
♦ చెత్త షేర్లను కొనాలంటూ సిఫారసులు
♦ నిజమేనని నమ్ముతూ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
♦ అందరూ కొన్నాక ట్రేడ్ మాఫియా అమ్మకాలు
♦ అధిక ధర వద్ద కొని ఇరుక్కుంటున్న రిటైలర్లు
♦ ఈ మెసేజ్‌లు వద్దని టెలికంలకు సెబీ వార్నింగ్
అజయ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు. కొన్ని మంచి షేర్లను ఎంచుకుని దీర్ఘకాలానికి పెట్టుబడి పెడుతుంటాడు. అనుకున్న లాభాలు వచ్చాక వాటిని విక్రయించేసి... వేరే షేర్లు కొంటుంటాడు. కాకపోతే అజయ్‌కి ఈ మధ్య ఎస్‌ఎంఎస్‌ల తాకిడి ఎక్కువయింది. బ్రోకరేజీ సంస్థలుగా పేరున్న కార్వీ, మోతీలాల్, ఓస్వాల్, షేర్‌ఖాన్, ఏంజిల్ బ్రోకింగ్, ఇండియా ఇన్ఫోలైన్... ఒకటేమిటి!! పేరున్న ప్రతి బ్రోకరేజీ సంస్థా పంపినట్లుగా వాటి షార్ట్‌కట్ పేర్లతో జంక్ మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిలో కొన్ని షేర్ల పేర్లు చెబుతూ... అది నెలరోజుల్లో రెట్టింపుకన్నా ఎక్కువ పెరగబోతోందని, కనీసం 5000 షేర్లు కొనాలని రికమెండేషన్లు. నిజానికి అవేవీ ఖరీదైన షేర్లు కావు. పెన్నీ షేర్లు. అంటే రూ.50 లోపే ఉండే షేర్లు. కొన్నయితే రూ.10, రూ.5కు కూడా దొరుకుతాయి. ఇవి చూసి అజయ్‌కి నిజమో, అబద్ధమో అర్థం కావటం లేదు. ఎందుకంటే మెసేజ్‌లు వస్తున్నవి పేరున్న బ్రోకరేజీ సంస్థల పేరిట. నిజానికి ఆ బ్రోకరేజీ సంస్థలకు ఈ జంక్ మెసేజీలతో సంబంధం ఉందో లేదో కూడా అజయ్‌కి తెలియదు.
మరో ఉదాహరణ చూద్దాం. ఇంట్రాడేతో పాటు డెలివరీ ఆధారిత ట్రేడింగ్ చేసే హరిప్రసాద్‌కు కూడా ఈ మధ్య ఇలాంటి మెసేజ్‌ల తాకిడి పెరిగింది. క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ (సీటీఎల్) షేర్లు కనీసం 10వేలు కొనాలని, దానికి స్టాప్‌లాస్ కూడా పెట్టుకోవద్దని, ప్రస్తుతం రూ.15గా ఉన్న షేరు నెల తిరిగేసరికి రూ.40 అయిపోతుందని తెగ మెసేజ్‌లు వచ్చాయి. ఆ మెసేజ్‌లన్నీ పెద్ద పెద్ద బ్రోకరేజీ సంస్థలిస్తున్నట్లుగా ఉండటంతో... చివరికి హరి రూ.14 దగ్గర 1,000 సీటీఎల్ షేర్లు కొన్నాడు. కాకపోతే కొనే ముందు ఆ కంపెనీ గురించి ఏమాత్రం రీసెర్చ్ చేయలేదు. పలు బ్రోకరేజీ సంస్థలు ఒకే కంపెనీని రికమెండ్ చేశాయికదా... అనే ధోరణిలో కొనేశాడు. తరవాతి రోజు అది రూపాయి తగ్గింది. అప్పటికే వెయ్యి రూపాయలు నష్టం రావటంతో మళ్లీ పెరుగుతుందిలే అని వేచి చూడటం మొదలెట్టాడు. మర్నాటి నుంచి అది తగ్గుతూనే వచ్చింది. ప్రస్తుతం రూ.9 దగ్గర ఉంది. ఇక్కడ అమ్మేద్దామనుకుంటే రూ.5వేలు నష్టం. ఇంకా ఉంచుకుంటే ఎంతకు పోతుందో తెలియదు... అదీ కథ.
అజయ్... హరి... ఇవన్నీ ఒకటిరెండు ఉదాహరణలే. స్టాక్ మార్కెట్ మంచి జోరుమీదుండటంతో ఈ మధ్య ఇలాంటి మెసేజ్‌ల తాకిడి ఇన్వెస్టర్లందరికీ ఎక్కువయింది. రకరకాల బ్రోకరేజీ సంస్థలు ఇస్తున్నట్లుగా వస్తున్న ఈ మెసేజ్‌లు నిజానికి నకిలీవేనని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి జంక్ మెసేజ్‌లు ఇస్తే సదరు టెలికం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కూడా ఇటీవల సెబీ హెచ్చరించింది. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లకూ సూచనలిస్తోంది. అయినా సరే టెలికం సంస్థలు వీటిని అనుమతిస్తుండటంతో ఇన్వెస్టర్లకు ఈ తరహా మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. వాటి బారిన పడుతూనే ఉన్నారు.
అమ్ముకుని బయటపడటానికే...!
ఈ మధ్య తరచూ మెసేజ్‌లు వస్తున్న సంస్థల్లో నార్త్ ఈస్టర్న్ క్యారీయింగ్ కార్పొరేషన్ (ఎన్‌ఈసీసీ), ఎస్‌ఎఫ్‌ఎల్ ఇంటర్నేషనల్, క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ (సీటీఎల్), సింబియాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ తదితర కంపెనీలుంటున్నాయి. ఈ మెసేజ్‌లు పంపించే ట్రేడింగ్ మాఫియా ముఠాల లక్ష్యం ఒక్కటే. వారు అప్పటికే దాన్ని పైస్థాయిలో కొని ఉంటే... అందరూ కొంటున్న సమయంలో దాన్ని విక్రయించి బయటపడటం. అంటే అలాంటి షేర్లను పైస్థాయిలో కొనుక్కుని ఇరుక్కుపోయిన పెద్ద ఇన్వెస్టర్లో, లేకపోతే ప్రమోటర్లో ఈ మాఫియాను ఆశ్రయిస్తారు. వీరికి కొంత చెల్లిస్తారు. దీంతో ఈ మాఫియా కొన్ని పేరున్న బిజినెస్ వెబ్‌సైట్లలో యూజర్లుగా మెసేజ్‌లు పోస్ట్ చేయటం మొదలుపెడుతుంది.
దాన్ని కొనుగోలు చేయమని సదరు యూజర్లు సిఫారసు చేస్తుంటారు. దాంతో పాటు అందరికీ బల్క్ మెసేజ్‌లు కూడా వెళుతుంటాయి. కొందరైనా కొనుగోలు చేస్తారు కనక... అప్పుడు షేరు ధర పెరిగితే... అప్పటికే పైస్థాయిలో కొనుక్కున్న వారు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకుని బయటపడతారు. దాంతో దాని ధర ఇంకా పడిపోతుంది. చేసేదేమీ లేక ఈ చిన్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలం వేచి చూడటమో, లేక నష్టానికి విక్రయించి బయటపడటమో చేస్తుంటారు. నిజానికి ఇలాంటి షేర్లలో దీర్ఘకాలం వేచిచూసినా లాభాలొస్తాయన్న గ్యారంటీ ఉండదు. చివరికి ఇవి రూపాయి... 10 పైసలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు.
ఉదాహరణకు నార్త్ ఈస్టర్న్ క్యారీయింగ్ కార్పొరేషన్‌నే తీసుకుంటే... గతేడాది చివరి నుంచి దీనికి సంబంధించిన మెసేజ్‌లు రావటం మొదలయ్యాయి. చివరికి ఈ షేరును కొనుక్కుంటూ కొనుక్కుంటూ ఏకంగా రూ.111 కు తీసుకెళ్లిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.111.30కి చేరిన ఎన్‌ఈసీసీ... ఆ తరవాత సరిగ్గా 20 రోజులు గడిచేసరికి మళ్లీ 50 రూపాయలకొచ్చేసింది. అంటే ట్రేడింగ్ మాఫియా అక్కడ విక్రయాలు మొదలెట్టిందన్న మాట. ఆ తరవాత ఇంకా కిందికి జారుతూ వచ్చిన ఈ షేరు... ప్రస్తుతం రూ.46 వద్ద ఉంది. ఇదంతా ఎందుకంటే... ఇలాంటి మెసేజ్‌లను ఏమాత్రం నమ్మవద్దని సెబీ నుంచి నిపుణుల దాకా అందరూ చెబుతూనే ఉన్నా ఇంకా కొందరు వీటిని నమ్మి కొనుగోళ్లు చేస్తున్నారనేది బయటపడుతూనే ఉంది. వివిధ వెబ్‌సైట్ల మెసేజింగ్ బోర్డుల్లో చూసినపుడు... తాము మెసేజ్‌లను నమ్మి ఫలానా షేరును కొని ఇరుక్కుపోయామని, తిరిగి పెరుగుతుందో లేదో చెప్పాలని సహ బోర్డర్లను అడిగేవారు పెద్ద సంఖ్యలో కనిపిస్తూనే ఉన్నారు కనక. నిజానికి బ్రోకరేజీ సంస్థలు తమ కస్టమర్లకు మాత్రమే మెసేజ్‌లు పంపిస్తూ ఉంటాయి. ఇలా అందరికీ గంపగుత్తగా పంపవు.