
ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు స్మార్ట్ ఫోన్లతో బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు
బనశంకరి: నగరంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే సమయంలో జరిమానా వసూలు చేయడానికి క్యాష్‌లెస్ విధానం అనుసరిస్తున్న బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు ఇకనుంచి పేపర్‌లెస్‌కు మారాలని నిర్ణయించారు. వాహనదారులకు జరిమానా రాసేటప్పుడు, లేదా సిగ్నల్ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా వారి చిరునామాలకు పోస్టులు పంపడానికి పెద్దమొత్తంలో పేపర్ ఖర్చవుతోంది. రసీదు రోల్, ఇంక్, ప్రింటర్ నిర్వహణకు ఏటా లక్షలాదిరూపాయలు ఖర్చుచేయాలి. దీనికి బదులు వారి మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపిస్తే పేపర్ ఖర్చు మిగిలిపోతుందని నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర తెలిపారు. కొన్ని సందర్భాల్లో 50 సార్లు నిబంధనలు ఉల్లంఘన కేసులకు మీటర్లు మేర రసీదు అందించిన పరిస్ధితులు ఉన్నాయన్నారు.
ముమ్మరంగా కసరత్తు
ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు, వాహనాల సంఖ్య, తేదీ, సమయం, స్థలం, జరిమానా విధించే అధికారి పేరు, పోలీస్ స్టేషన్ పేరు, ఆన్‌లైన్ జనరేట్ సంఖ్యతో కూడిన పూర్తి సమాచారంతో రసీదు ప్రింట్ చేస్తున్నారు. ఇకముందు వాహనదారు మొబైల్ నెంబరు తీసుకుని పూర్తి వివరాలతో కూడిన ఎస్‌ఎంఎస్ పంపిస్తామని హితేంద్ర తెలిపారు. బీ ట్రాక్ పథకం కింద ఎస్‌ఎంఎస్ రసీదు పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారు. దీనికోసం ఎస్‌ఎంఎస్ పంపడానికి ప్రైవేటు టెలికాం సంస్థలతో చర్చలు కూడా జరిపారు. త్వరలో కొన్ని పోలీస్‌స్టేషన్లలో సిబ్బందికి శిక్షణనిచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు, తరువాత నగరమంతటా విస్తరిస్తారు.
నోటీస్‌లకు బదులు చిరుసందేశమే: హితేంద్ర
సీసీ కెమెరాలు గుర్తించిన ట్రాఫిక్ కేసుల్లో బండి నంబర్ ఆధారంగా వాహనదారుల ఇళ్లకు పోస్టు ద్వారా నోటీస్ పంపించేవారు. దీనికి ఒక్క రూపాయి వరకు ఖర్చవుతుతోంది. అయితే పోస్టల్ సిబ్బంది కొన్నిసార్లు గేట్ వద్దే పడేసి వెళతారు. ఎస్‌ఎంఎస్‌తో ఈ సమస్య ఉండదు, ఖర్చు కూడా 10 పైసలే అవుతుంది. అలాగే జరిమానా వసూలు చేశాక రసీదుగా ఇవ్వడానికి బదులుగా ఎస్‌ఎంఎస్‌నే పంపించాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలు నిర్భయంగా సలహాలు సూచనలు ఇవ్వవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment