ఎస్‌ఎంసీ చైర్మన్లకూ చెక్‌పవర్
Published Tue, Aug 16 2016 8:53 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
బాలాజీచెరువు (కాకినాడ) :
పాఠశాలల్లో వివిధ పనుల నిమిత్తం నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయుడితోపాటు ఇటీవల ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్లకు కూడా సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తూ సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ) ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 4,412 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఇటీవల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. పాఠశాల అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, విద్యార్థుల చదువులపై శ్రద్ధ, డ్రాపౌట్ల గుర్తింపు, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం తనిఖీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలను పర్యవేక్షించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. ఇటీవలి వరకూ స్కూల్ కమిటీలు లేకపోవడంతో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవోలు సంయుక్తంగా నిధులను వినియోగించేవారు. కొత్త కమిటీలు ఏర్పడటంతో ప్రధానోపాధ్యాయుడితోపాటు ఎస్‌ఎంసీ చైర్మన్‌కు జాయింట్‌గా ఖాతాలు ఏర్పాటు చేసి చెక్ పవర్ కల్పిస్తూ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఎంఈవోలకు పంపి ఆయా పాఠశాల చైర్మన్, ప్రధానోపాధ్యాయులతో కొత్త ఖాతా ప్రారంభించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఇంకా పెండింగ్‌లో ఉన్న 52 పాఠశాలలకు వచ్చే వారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌ఏ పీవో శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. కొత్త చైర్మన్లకు వారి అధికారాలు, విధులపై త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement