ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయం
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాల పునర్విభజన జరిగి ఈ దసరా పండుగ నాటికి సరిగ్గా మూడేళ్లు పూర్తి కానుంది. నాలుగు జిల్లాల్లో కొత్త జిల్లా పరిషత్‌లు, కొత్త మండల పరిషత్‌ల ఏర్పాటు జరిగి ఏడు నెలలు దాటింది. గత నాలుగు నెలల క్రితం ఆయా జెడ్పీ పరిధిలోనే ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు గెలుపొంది బాధ్యతలు కూడా చేపట్టారు. కానీ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల, జిల్లా పరిషత్‌లకు మాత్రం ఇంత వరకు నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జెడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే.. కొత్త మండలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఏ పని చేపట్టినా.. ఖర్చు చేయాల్సి రావడంతో కొత్త మండల పరిషత్‌లు అభివృద్ధి బాట పట్టలేకపోతున్నాయి.
ఇదిలా ఉండగా, పరిషత్ విజభన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జెడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్‌లకు ఉద్యోగులను, ఫర్నిచర్‌ను, సిబ్బందిని కేటాయించారు. ఈ లెక్కన పాత మండలాల నుంచి కొత్త మండలాలకు కేటాయించింది. కొత్త పరిషత్‌ల ఏర్పాటు సమయంలో ఆదిలాబాద్ జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ ఆదిలాబాద్ జెడ్పీ నుంచే నెలనెలా జీతాలు చెల్లిస్తున్నారు. కాగా, అటు మండలాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాత మండలాల నుంచి కొత్త మండలాలకు వెళ్లిన ఉద్యోగులు ఇప్పటికీ పాత మండలాల నుంచే వేతనాలు పొందుతున్నారు.
చెక్‌పవర్ లేక.. ఖర్చు చేయలేక..
కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జెడ్పీలో సభలు, సమావేశాలు జరిగాయి. ఆ సమయాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల అభివృద్ధికి పనులు, యూనిట్లు మంజూరు చేయించుకున్నారు. పాత జెడ్పీ నుంచే అభివృద్ధి పనులు మంజూరు చేయడం, వాటికి సంబంధించి నిధులు విడుదల చేయడం లాంటివి జరిగేవి. ప్రస్తుతం కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటైనందున ఇక వాటి పరిధిలోనే చేపట్టాలి. కానీ గతంలో మంజూరైన కొన్ని పనులు నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటికీ కొనసాగుతుండగా, కొన్ని పూర్తయ్యాయి. అయితే అప్పట్లో మంజూరైన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పాత జెడ్పీ ఖాతాలో జమ చేసింది. ఈ నిధులతోపాటు ఏటా తలసరి ఆదాయం (జనరల్ ఫండ్), రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్‌ఎఫ్‌సీ) ఉమ్మడి జెడ్పీ ఖాతాలో జమయ్యాయి.
ఇలా ప్రస్తుతం ఆదిలాబాద్ జెడ్పీ ఖాతాలో రూ.3.50 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో.. ఆ జిల్లాకు అధిక నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు రూ.87 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వస్తాయి. ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే డ్రాయింగ్ పవర్ (చెక్ పవర్) అవసరముంటుంది. ఆ నిధులను డ్రా చేసి ఇతర జిల్లాలకు అప్పగించాలి. కానీ పరిషత్‌లో ఏ అధికారికి ‘డ్రాయింగ్ పవర్ లేకపోవడంతో నిధులు అందుబాటులో ఉన్నా.. వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్పా.. ఆ నిధులు ఖర్చు కాదు కదా.. పైసా కూడా కదలడానికి వీలు లేకుండా ఉంది. దీంతో కొత్త జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపు సమస్యగా మారింది.
జెడ్పీ నిధులు ఖర్చు చేస్తారిలా..
జిల్లా పరిషత్‌కు పలు ఆదాయ మార్గాలున్నాయి. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం నుంచి జెడ్పీ ఖాతాలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్‌ఎఫ్‌సీ) జమవుతాయి. జనరల్ ఫండ్ (సీనరేజి–స్టాంప్ డ్యూటీ కలిపి) ఏటా వస్తుంది. తలసరి ఆదాయం మూడు రకాలుగా ఉంటుంది. జనరల్ కాంపోనెంట్, ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ (ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినవి). అయితే జనరల్ ఫండ్స్ నుంచి వివిధ పనుల నిమిత్తం ఇలా ఖర్చు చేస్తారు. 16 శాతం నిధులను కార్యాలయ ఖర్చుల (కాంటిజెన్సీ ఫండ్) నిమిత్తం వినియోగిస్తారు. 30 శాతం నిధులను అత్యవసరాలతోపాటు అన్ని పనులకు ఖర్చు చేస్తారు. 15 శాతం ఎస్సీ, 15 శాతం ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. 15 శాతం మహిళా, స్త్రీశిశు సంక్షేమం కోసం, 14 శాతం తాగునీటి కోసం వినియోగిస్తారు.
చెక్‌పవర్‌పై సందిగ్ధత..
జిల్లా పరిషత్ అభివృద్ది నిధులను డ్రాచేసే అధికారం ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. జిల్లా పరిషత్ సీఈవోలకు ‘చెక్‌పవర్’ అధికారం కల్పిస్తున్నట్లు గత నెల క్రితం సర్కారు నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రెండు రోజులకే సీఈవోలకు చెక్‌పవర్ నిలిపేస్తూ మరో జీవో జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డ్రాయింగ్ పవర్ ఎవరికి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికల ముందు వరకు జెడ్పీ డిప్యూటీ సీఈవోలకు చెక్‌పవర్ ఉండేది. గత నెలలో (అకౌంట్ అధికారి/ డిప్యూటీ సీఈవో)గా పరిషత్ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఈవోలకు పవర్ ఇస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుని విరమించుకుంది. అయితే కొత్త జిల్లా పరిషత్‌లకు కేవలం సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు మాత్రమే కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న డిప్యూటీ సీఈవోకే మళ్లీ పవర్ ఇస్తారా.. లేక సీఈవోలకు అవకాశం కల్పిస్తారా.. అనే విషయంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది.
ఆదేశాలు వస్తేనే నిధుల కేటాయింపు
కొత్త జిల్లా పరిషత్‌లకు అభివృద్ధి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే విభజన చేయగలం. ఈ విషయం ప్రభుత్వం పరిధిలో ఉండడంతో వేచి చూస్తున్నాం. మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించేందుకు అన్ని సిద్ధం చేశాం. చెక్‌పవర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధుల బదలాయింపుపై స్పష్టత రానుంది. – కిషన్, జిల్లా పరిషత్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment