check power
-
కొత్త జెడ్పీ.. నిధుల బదిలీ ఎలా?
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాల పునర్విభజన జరిగి ఈ దసరా పండుగ నాటికి సరిగ్గా మూడేళ్లు పూర్తి కానుంది. నాలుగు జిల్లాల్లో కొత్త జిల్లా పరిషత్‌లు, కొత్త మండల పరిషత్‌ల ఏర్పాటు జరిగి ఏడు నెలలు దాటింది. గత నాలుగు నెలల క్రితం ఆయా జెడ్పీ పరిధిలోనే ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు గెలుపొంది బాధ్యతలు కూడా చేపట్టారు. కానీ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల, జిల్లా పరిషత్‌లకు మాత్రం ఇంత వరకు నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జెడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే.. కొత్త మండలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఏ పని చేపట్టినా.. ఖర్చు చేయాల్సి రావడంతో కొత్త మండల పరిషత్‌లు అభివృద్ధి బాట పట్టలేకపోతున్నాయి. ఇదిలా ఉండగా, పరిషత్ విజభన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జెడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్‌లకు ఉద్యోగులను, ఫర్నిచర్‌ను, సిబ్బందిని కేటాయించారు. ఈ లెక్కన పాత మండలాల నుంచి కొత్త మండలాలకు కేటాయించింది. కొత్త పరిషత్‌ల ఏర్పాటు సమయంలో ఆదిలాబాద్ జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ ఆదిలాబాద్ జెడ్పీ నుంచే నెలనెలా జీతాలు చెల్లిస్తున్నారు. కాగా, అటు మండలాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాత మండలాల నుంచి కొత్త మండలాలకు వెళ్లిన ఉద్యోగులు ఇప్పటికీ పాత మండలాల నుంచే వేతనాలు పొందుతున్నారు. చెక్‌పవర్ లేక.. ఖర్చు చేయలేక.. కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జెడ్పీలో సభలు, సమావేశాలు జరిగాయి. ఆ సమయాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల అభివృద్ధికి పనులు, యూనిట్లు మంజూరు చేయించుకున్నారు. పాత జెడ్పీ నుంచే అభివృద్ధి పనులు మంజూరు చేయడం, వాటికి సంబంధించి నిధులు విడుదల చేయడం లాంటివి జరిగేవి. ప్రస్తుతం కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటైనందున ఇక వాటి పరిధిలోనే చేపట్టాలి. కానీ గతంలో మంజూరైన కొన్ని పనులు నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటికీ కొనసాగుతుండగా, కొన్ని పూర్తయ్యాయి. అయితే అప్పట్లో మంజూరైన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పాత జెడ్పీ ఖాతాలో జమ చేసింది. ఈ నిధులతోపాటు ఏటా తలసరి ఆదాయం (జనరల్ ఫండ్), రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్ఎఫ్సీ) ఉమ్మడి జెడ్పీ ఖాతాలో జమయ్యాయి. ఇలా ప్రస్తుతం ఆదిలాబాద్ జెడ్పీ ఖాతాలో రూ.3.50 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో.. ఆ జిల్లాకు అధిక నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు రూ.87 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వస్తాయి. ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే డ్రాయింగ్ పవర్ (చెక్ పవర్) అవసరముంటుంది. ఆ నిధులను డ్రా చేసి ఇతర జిల్లాలకు అప్పగించాలి. కానీ పరిషత్‌లో ఏ అధికారికి ‘డ్రాయింగ్ పవర్ లేకపోవడంతో నిధులు అందుబాటులో ఉన్నా.. వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్పా.. ఆ నిధులు ఖర్చు కాదు కదా.. పైసా కూడా కదలడానికి వీలు లేకుండా ఉంది. దీంతో కొత్త జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపు సమస్యగా మారింది. జెడ్పీ నిధులు ఖర్చు చేస్తారిలా.. జిల్లా పరిషత్‌కు పలు ఆదాయ మార్గాలున్నాయి. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం నుంచి జెడ్పీ ఖాతాలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్ఎఫ్సీ) జమవుతాయి. జనరల్ ఫండ్ (సీనరేజి–స్టాంప్ డ్యూటీ కలిపి) ఏటా వస్తుంది. తలసరి ఆదాయం మూడు రకాలుగా ఉంటుంది. జనరల్ కాంపోనెంట్, ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ (ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినవి). అయితే జనరల్ ఫండ్స్ నుంచి వివిధ పనుల నిమిత్తం ఇలా ఖర్చు చేస్తారు. 16 శాతం నిధులను కార్యాలయ ఖర్చుల (కాంటిజెన్సీ ఫండ్) నిమిత్తం వినియోగిస్తారు. 30 శాతం నిధులను అత్యవసరాలతోపాటు అన్ని పనులకు ఖర్చు చేస్తారు. 15 శాతం ఎస్సీ, 15 శాతం ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. 15 శాతం మహిళా, స్త్రీశిశు సంక్షేమం కోసం, 14 శాతం తాగునీటి కోసం వినియోగిస్తారు. చెక్‌పవర్‌పై సందిగ్ధత.. జిల్లా పరిషత్ అభివృద్ది నిధులను డ్రాచేసే అధికారం ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. జిల్లా పరిషత్ సీఈవోలకు ‘చెక్‌పవర్’ అధికారం కల్పిస్తున్నట్లు గత నెల క్రితం సర్కారు నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రెండు రోజులకే సీఈవోలకు చెక్‌పవర్ నిలిపేస్తూ మరో జీవో జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డ్రాయింగ్ పవర్ ఎవరికి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికల ముందు వరకు జెడ్పీ డిప్యూటీ సీఈవోలకు చెక్‌పవర్ ఉండేది. గత నెలలో (అకౌంట్ అధికారి/ డిప్యూటీ సీఈవో)గా పరిషత్ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఈవోలకు పవర్ ఇస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుని విరమించుకుంది. అయితే కొత్త జిల్లా పరిషత్‌లకు కేవలం సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు మాత్రమే కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న డిప్యూటీ సీఈవోకే మళ్లీ పవర్ ఇస్తారా.. లేక సీఈవోలకు అవకాశం కల్పిస్తారా.. అనే విషయంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. ఆదేశాలు వస్తేనే నిధుల కేటాయింపు కొత్త జిల్లా పరిషత్‌లకు అభివృద్ధి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే విభజన చేయగలం. ఈ విషయం ప్రభుత్వం పరిధిలో ఉండడంతో వేచి చూస్తున్నాం. మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించేందుకు అన్ని సిద్ధం చేశాం. చెక్‌పవర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధుల బదలాయింపుపై స్పష్టత రానుంది. – కిషన్, జిల్లా పరిషత్ సీఈవో -
‘డిజిటల్’ కిరికిరి!
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్) : గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వారు అయోమయానికి గురవుతున్నారు. చెక్‌పవర్ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచులకు తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీలో చేసిన పనులకు సంబంధించి వివరాలన్నీ యాప్‌లోనే అప్లోడ్ చేయాలన్న నిబంధన పెట్టారు. అలా అప్లోడ్ చేశాకే ఆన్లైన్లోనే డిజిటల్ చెక్కులు పొందేలా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామపంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం చెక్‌పవర్ ఇచ్చినా, డిజిటల్ యాప్ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 467 గ్రామపంచాయతీలు ఉన్నా యి. అందులో 465 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్‌పవర్ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. చెక్‌పవర్‌పై తర్జనభర్జనలు పంచాయతీ పాలనకు తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్ చెక్‌పవర్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తి కాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు. గతంలో మాదిరిగా సర్పంచుకు కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచుకు కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్ పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేకపోయాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచులు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా ప్రభుత్వం చెక్‌పవర్ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. గత నెల 22న తేలిన చెక్‌పవర్ గత నెల 22న ప్రభుత్వం చెక్‌పవర్ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్‌పవర్‌పై ప్రొసీడింగ్స్‌ను గత నెల 27న ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 18 మండలాల ఎంపీడీఓలకు చెక్‌పవర్ ప్రొసీడింగ్స్‌ను పంపించారు. చెక్‌పవర్ వచ్చినా.. డిజిటల్ కిరికిరి ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్‌ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్‌పవర్ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్లైన్లో మీసేవా కేంద్రం నుంచి అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామపంచాయతీకి సంబంధించిన కోడ్‌ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటికి వస్తుంది. ఆ చెక్ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్ సెల్‌ఫోన్ నంబర్లకు ఓటీపీ నంబర్ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్టీఓకు లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎస్టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్టీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్ మొబైళ్లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్‌ను తీసుకొని దానిపై ఎస్టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఇరువురూ రెండేసి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తిస్థాయిలో బిల్లు కోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్టీఓ ఆ బిల్లును పాస్ చేస్తాడు. ప్రస్తుతం చెక్‌పవర్ విషయంలో ఇప్పటికే డీపీఓ, ఎస్టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్ల ఆధారంగా అన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్ చెక్ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్‌పవర్ ఇచ్చినా.. ఈ డిజిటల్ యాప్ రాని కారణంగా చెక్‌పవర్ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానంతో సర్పంచులకు డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు. -
ఎట్టకేలకు చెక్ పవర్!
సాక్షి,యాచారం(రంగారెడ్డి) : సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం సాయంత్రం కలెక్టర్ లోకేష్‌కుమార్ నుంచి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఉత్తర్వులు అందాయి. జనవరి 25న పంచాయతీ ఎన్నికలు జరగగా.. చెక్‌పవర్ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం జరిగింది. ఐదు నెలల అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాయింట్ చెక్ పవర్ ఉత్తర్వును సబ్‌ట్రెజరీలకు, అన్ని బ్యాంకుల మేనేజర్లకు పంపించి ఇచ్చి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సంతకాలు చేసిన మిగతా 2వ పేజీలో u uమొదటి పేజీ తరువాయి చెక్కులను అనుమతించాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రికార్డుల సంరక్షణ బాధ్యత కార్యదర్శిదే.. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించిన ప్రభుత్వం రికార్డుల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పెట్టింది. పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలలో సెక్షన్ 43 ప్రకారం గ్రామ పంచాయతీ నిధిని, పంచాయతీచే స్వీకరించబడిన ఇతర నిధులను సంరక్షించడానికి పంచాయతీ కార్యదర్శిని సంరక్షుడిగా నియమించింది. చెక్కులు జారీ చేసే ముందు నిధుల ఖర్చుకు సంబంధించి రికార్డులను నమోదు చేసి, అన్ని రకాల ఎంట్రీలను పూర్తి చేసిన తర్వాతే చెక్కులు రాసి సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో చెక్కుపై సంతకం తీసుకుని జారీ చేయాల్సి ఉంటుంది. రికార్డులు సక్రమంగా లేకుండా, అవకతవకలతో చెక్కులు జారీ చేస్తే పంచాయతీ కార్యదర్శినే బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీడీఓల ఎదుట సర్పంచ్, ఉప సర్పంచుల సంతకాలు.. జాయింట్ చెక్ పవర్ కల్పించే విషయంలో ప్రతి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులు ఎంపీడీఓల ఎదుట సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. జాయింట్ సంతకాలను ధ్రువీకరించిన ఎంపీడీఓలు సంబందిత బ్యాంకుకు, సబ్‌ట్రెజరీకి, గ్రామ పంచాయతీకి జాయింట్ సంతకాలతో కూడిన పత్రాలను పంపిస్తారు. ఆయా కార్యాలయాల్లో వారి పేర్ల మీద ప్రత్యేక ఖాతాలను తెరుస్తారు. అప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకాలతో కూడిన చెక్కును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సర్పంచ్‌లుగా గెలిచి ఐదు నెలలవుతున్నా చెక్ పవర్ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుబడ్డాయి. పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించలేకపోయారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశారు. కొందరు సర్పంచ్‌లు ఇందుకు అప్పులు చేశారు. -
సర్పంచ్ల చేతికొచ్చిన ‘పవర్’
దమ్మపేట: గ్రామపంచాయతీల్లో ఏడాదిన్నర కాలంగా ఖర్చు కాకుండా ఉన్న నిధులను వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పండింది. ప్రభుత్వం వారం రోజుల క్రితమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చింది. వివిధ పథకాల కింద పంచాయతీలకు మంజూరవుతున్న నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం నిబంధనలు సూచించింది. అందులో భాగంగా సర్పంచులకు నిధుల వ్యయం, పనుల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్ అమలులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామాల్లో ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించింది. ఇప్పటికైనా సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు తగిన చొరవ చూపాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ఆయా పంచాయతీల సర్పంచులు బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాల్లో అత్యవసరమైన సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో వ్యయం చేశారు. అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు నెలకొంటున్నా ఒక సొంతంగా నిధులను భరించలేమని చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పండింది. నిధుల వ్యయంపై దృష్టి.. గతంలో సర్పంచి, గ్రామ కార్యదర్శికి ఉమ్మడి చెక్‌పవర్ ఉండటంతో అవసరమైన నిధులు డ్రా చేయడం అంత సులువుగా జరిగేది కాదు. ప్రతి ఏటా నిర్వహించే ఆడిట్ సమయలో గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాల్సి వస్తుందన్న కారణంతో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకునే వారు. ఎంబీ రికార్డుల ఆధారంగా నిధులు డ్రా చేసేవారు. ప్రస్తుతం సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్ రావడంతో నిధుల వ్యయంపై కార్యదర్శులకు బాధ్యత తప్పింది. ఇదే సమయంలో ఇద్దరికి ఇవ్వడం వల్ల కూడా ఇష్టానుసారంగా నిధులను డ్రా చేసే పరిస్థితి ఉండదు. గ్రామసభల్లోనూ నిధుల అందుబాటు, వ్యయం వివరాలు చర్చకు వస్తుండటంతో పారదర్శకతకు అవకాశం ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం.. కొత్త చట్టంలో గ్రామసభలకు హాజరయ్యే ప్రజల సంఖ్యపై కచ్చితమైన నిబంధనలను ప్రభుత్వం పేర్కొంది. దీంతో గ్రామపంచాయతీలో ఏం జరుగుతోంది? పాలన ఎలా ఉంది? నిధుల వ్యయం పరిశీలన, ఎలాంటి పనులను చేపడతారు? అనే విషయాలు అందరికీ తెలిసే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామ జనాభా ఆధారంగా గ్రామసభకు ఎంత మంది హాజరు అవ్వాల్సి ఉందన్న దానిపై స్పష్టత ఇచ్చింది. గ్రామంలో 500 మంది జనాభా ఉంటే 50 మంది, వెయ్యి మంది ఉంటే 75 మంది, 3 వేలు మంది ఉంటే 150, 5 వేలు ఉంటే 200, 10 వేల జనాభా ఉంటే 300 మంది హాజరు కావాలి. ఇలా కాకుండా హాజరైన సంఖ్య తగ్గితే కోరం లేనట్లుగానే పరిగణిస్తారు. ఈ నిబంధనలతో పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతగా నడుచుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. హాజరు అంతంత మాత్రమే.. ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు పరిశీలిస్తే ప్రజలు ఎక్కడా ఆశించిన స్థాయిలో హాజరైన సందర్భాలు లేవు. గ్రామసభలు నిర్వహించే సమయాన్ని కూడా పంచాయతీలు కొన్ని సందర్భాల్లో ప్రజలకు తెలపని సంఘటనలున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మరో వైపు కోరం నిబంధనతో సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
ఎట్టకేలకు చెక్ పవర్
మోర్తాడ్/ధర్పల్లి/నిజామాబాద్‌అర్బన్: నాలుగున్నర నెలల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెర పడింది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇద్దరికి కలిపి చెక్‌పవర్ అప్పగించింది. బాధ్యతలను స్వీకరించిన తర్వాత నాలుగున్నర నెలల పాటు నిధుల వినియోగానికి అవకాశం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. కొంత మంది సర్పంచ్‌లు మాత్రం సొంత నిధులు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పిస్తూ వచ్చారు. అయితే, ఎట్టకేలకు చెక్ పవర్ రానుండడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జూలై 17 నుంచి పంచాయతీల్లో చెక్ పవర్ అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం జీవో నెం.30 జారీ చేసింది. నాలుగున్నర నెలులుగా ఖాళీగానే.. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతుండటంతో కోడ్ అమలు ఉన్నందున పంచాయతీలకు చెక్ పవర్‌పై జాప్యం ఏర్పడింది. గత జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి రెండో తేదీన సర్పంచ్‌లకు పదవీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే చెక్ పవర్‌ను కల్పించాల్సి ఉన్నా తీవ్ర కాలయాపన చేసిందనే విమర్శలను ప్రభుత్వం మూటగట్టుకుంది. చెక్ పవర్ విషయంలో జాప్యం చేయడంపై సర్పంచ్‌లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు సర్పంచ్‌లు భిక్షాటన చేసి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఎట్టకేలకు చెక్ పవర్‌ను కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ లభించనుంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు కూడా ఇదే విధానం వర్తించనుంది. కొత్త చట్టంతో ఉప సర్పంచ్‌లకు.. గతంలో సర్పంచ్‌లకే చెక్ పవర్ ఉండేది. కేంద్రం ఇచ్చే నిధుల వినియోగం కోసం ఎంపిక చేసిన వార్డు సభ్యుడితో జాయింట్ చెక్ పవర్ విధానం అమలైంది. అయితే సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ ఉండటంతో పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం సర్పంచ్‌లకు, కార్యదర్శులకు కలిపి జాయింట్ చెక్ పవర్‌ను కల్పించింది. అయితే, ప్రభుత్వం 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చింది. సర్పంచ్, కార్యదర్శి జాయింట్ చెక్ పవర్ విధానానికి స్వస్తి పలుకుతూ, సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌లకు ఈ అధికారం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు సంబంధించి అన్ని రకాల నిధులను వినియోగించడానికి ప్రభుత్వం ఇరువురికి అధికారం అప్పగించింది. అయితే, నిధుల వినియోగం ఆడిట్‌కు సంబంధించిన బాధ్యత మాత్రం సర్పంచ్, కార్యదర్శులకు ఉంది. దీంతో ఉప సర్పంచ్ కేవలం జాయింట్ చెక్ పవర్‌కు మాత్రమే అర్హత లభించినట్లయింది. నిధుల వినియోగం, అందుకు సంబంధించిన లెక్కల బాధ్యత అంతా సర్పంచ్, కార్యదర్శులే మోయాల్సి ఉంది. ఉప సర్పంచ్‌ల్లో ఆనందం.. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఉంటుందని ప్రభుత్వం అప్పట్లోనే జీవో జారీ చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధం లేకుండానే ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవచ్చని వార్డు సభ్యుల్లో ఉత్సాహం నిండింది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేసి పదవిని దక్కించుకున్నారు. కానీ చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయక పోవటంతో వారు ఆందోళన చెందారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్‌ను ఇస్తున్నారని లీకులు రావటంతో ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు ఆశలు వదులుకున్నారు. అయితే, కొత్త పంచాయతీ చట్టం ప్రకారమే ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇస్తున్నట్లు నోటిఫికేషన్ రావడంతో వారిలో ఆనందం వెల్లి విరుస్తోంది. మొండికేస్తే తొలగించే అధికారం.. నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌తో పాటు చెక్ పవర్ ఉన్న ఉప సర్పంచ్‌లు.. చెక్కులపై సంతకాలు చేయడానికి మొండికేస్తే ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్‌ను తొలగించే అధికారం జిల్లా పంచాయతీ అధికారులకు ఉంది. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించింది. అయితే, అనేక చోట్ల సర్పంచ్‌లతో ఉప సర్పంచ్‌లు సమన్వయంతో పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిధుల వినియోగంపై తీర్మానం చేసినా చెక్‌లపై సంతకాలు చేయడానికి ఉప సర్పంచ్‌లు నిరాకరిస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి డీపీవోకు నివేదిక పంపాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు చేయడానికి సహకరించక పోతే వారి చెక్ పవర్‌ను తొలగించి కార్యదర్శికే ఆ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. సర్కారు తాజా మార్గదర్శకాలు ఇవి.. పంచాయతీ నిధులు ఖర్చు చేసేందుకు సర్పంచ్, ఉపసర్పంచ్ బ్యాంక్ చెక్కులపై సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ కార్యాలయం నుంచి ఏమైన ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మాత్రం సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆడిట్ బాధ్యతలను సర్పంచ్, కార్యదర్శులకు అప్పగింత. గ్రామసభ నిర్వహణ, పంచాయతీ నిధుల వినియోగంపై సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పాటు గ్రామ కార్యదర్శిని భాగస్వామ్యం చేశారు. పంచాయతీల్లోని ప్రతి పని ఆన్లైన్ ద్వారా అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణ అనుమతులు, లే అవుట్ అనుమతులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామసభలు, పంచాయతీ సమావేశాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి మూడు రోజుల్లో ఈవోపీఆర్డీకి పంపించాలి. పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానాలను కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై ఉంచాలి. వాటిని పంచాయతీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కార్యదర్శికి అప్పగించిన బాధ్యతలను అమలు చేస్తూ, వాటిని పై అధికారులకు అందించాల్సి ఉంటుంది. అట్టి నివేదికల్లో ఏమైన పొరపాట్లు జరిగినట్లు తేలితే కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. గ్రామసభ నిర్వహించేందుకు నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామసభ నిర్వహిస్తే అట్టి గ్రామ పంచాయతీ జనాభాకు అనుగుణంగా ప్రజలు హాజరుకావాల్సి ఉంటుంది. 500 ఓటర్లు ఉన్న గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలంటే కనీసం 50 మంది హాజరుకావాలి. ప్రజలు హాజరు కాని ఎడల గ్రామసభను వాయిదా వేసి, మరో రోజు నిర్వహించాలి. గ్రామసభకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీయించి వెబ్సైట్లో ఉంచాలి. పంచాయతీ విధులను నిర్వహించే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారిని కలెక్టర్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అధికారం ఉంది. పంచాయతీ పాలన సక్రమంగా నిర్వహించేందుకు పాలకవర్గం సభ్యులు కట్టుబడి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పాలనకు గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం ప్రకారం చెక్ పవర్ అమలు చేస్తుండటంతో గ్రామ పాలనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. పంచాయతీ పాలకులు ఎన్నికై నాలుగున్నర నెలలకైనా చెక్ పవర్ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం. ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తాం. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పాలన అందిస్తాం. – ఆర్మూర్ పెద్ద బాల్‌రాజ్, సర్పంచ్ ఆనందంగా ఉంది.. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్లో భాగస్వామ్యం కల్పించటం ఆనందంగా ఉంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ అందిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేయటం మంచి పరిణామం. ఇద్దరికి కలిపి చెక్ పవర్ ఇస్తేనే గ్రామం త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు వీలు కలుగుతుంది. – నూకల రమేశ్, ఉప సర్పంచ్, దుబ్బాక -
పంచాయతీకి ‘పవర్’
నల్లగొండ : పల్లె పాలన ఇక పట్టాలెక్కనుంది. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇస్తూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసింది. సోమవారం నుంచి చెక్ జాయింట్ చెక్‌పవర్ విధానం అమల్లోకి రానుంది. చెక్ పవర్ ఇవ్వడంతో పంచాయతీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్ పవర్ ఉండగా, ఈ సారి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్‌ను ఇచ్చారు. కాగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌పై సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 844 పంచాయతీలు.. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా 831 గ్రామ పంచాయతీలకు జనవరిలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధిక సర్పంచ్‌లు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం చెక్ పవర్‌ను సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వాలా..? సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు ఇవ్వాలా అనే అంశాలపై సమాలోచన చేసింది. మొన్నటి వరకు వరుసగా ఎన్నికలు రావడంతో.. కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో చెక్‌పవర్‌పై నిర్ణయం వెలువరించింది. ఖాతాల్లోనే 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ముందు గ్రామంలకు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. పాత సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోతున్నందున వారు నిధులు ఇష్టానుసారంగా డ్రా చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిపై ప్రీజింగ్ పెట్టింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా నాలుగున్నర నెలలుగా ఏ సర్పంచ్ కూడా ఖర్చు చేయలేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అప్పులు చేసి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వని కారణంగా ప్రస్తుత సర్పంచ్‌లు అప్పులు చేసి మరి గ్రామాల్లో పనులు చేపట్టారు. కొత్తగా ఎన్నిక కావడంతో.. పనులు చేయకపోతే చెడ్డ పేరు వస్తుందనే భయంతో గ్రామాల్లో పనులు చేప్టటేందుకు సొంతంగా నిధులు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడలేదు. వేసవి కావడంతో గ్రామాల్లో పెద్దయెత్తున నీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి అత్యవసర పనులకు అప్పులు చేయాల్సి వచ్చిందని.. పలువురు పేర్కొన్నారు. అసంతృప్తిలో సర్పంచ్‌లు.. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంపై సర్పంచ్‌లు అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ వేర్వేరు పార్టీలకు చెందినవారు ఉంటే.. పనులపై నిర్ణయం తీసుకోవడంలో, నిధులు విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కొందరు మాత్రం జాయింట్ చెక్ పవర్ ఉంటేనే.. పంచాయతీ పాలకవర్గమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గ్రామంలో ఏది అత్యవసరమైన పనో వాటిని చేపట్టేందుకు అవకాశం ఉండడంతో పాటు పనుల్లో కూడా అవతకవకలకు అవకాశం ఉండదని కొందరు పేర్కొంటున్నారు. కార్యదర్శుల పర్యవేక్షణ.. ప్రభుత్వం నిధుల ఖర్చుపై ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని, చేయకపోతే కార్యదర్శిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా సమావేశాల తీర్మాణాలను కూడా నోటీస్ బో ర్డుపై ఉంచాల్సి ఉంటుంది. లేఅవుట్లు, భవన ని ర్మాణాల అనుమతులకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. తద్వారా పనులు గడువులోపు పూర్తికావడంతో పాటు గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వచ్చేఅవకాశం ఉంది. -
సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్
సాక్షి, హైదరాబాద్ : గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో కొన్ని సెక్షన్లను చేరుస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్ పవర్‌కు సంబంధించిన సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా చట్టంలో 6(10), 34, 37(6), 43(10), 47(4), 70(4), 113(4), 114(2), 141 సెక్షన్లను నోటిఫై చేశారు. గ్రామపంచాయతీల చెక్ పవర్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీతో జాయింట్ చెక్‌పవర్‌పై ప్రభుత్వం స్పష్టతనిచ్చినట్టు అయ్యింది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించడంతోపాటు, గ్రామ పంచాయతీల్లో ఆదాయ, వ్యయ సంబంధిత ఆడిటింగ్ బాధ్యతలు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనున్నారు. ఈ అంశంతోపాటు గ్రామసభ నిర్వహణకు ఉండాల్సిన కోరం తదితర ఇతర అంశాలనూ పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. సోమవారం (జూన్ 17) నుంచి కొత్త సెక్షన్లు అమల్లోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్‌ను సోమవారం నాటి గెజిట్‌లో ప్రచురించాలని వికాస్‌రాజ్ ఆదేశించారు. -
చెక్ పవర్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, వారికి అందాల్సిన కనీస వసతుల కల్పనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం పల్లెలకు ఇబ్బందికరం గా మారుతోంది. కొత్త పాలకవర్గాలు ప్రజల కోసం పనిచేసే పరిస్థితి లేకుండాపోయింది. వేసవిలో తాగునీరు సమస్యలను తీర్చేందుకు పాలకవర్గాలకు ఏమాత్రం అవకాశం లేకుండాపోయింది. బోర్లు, మోటార్లు, స్టార్టర్లు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చివరికి పారిశుధ్య కార్మికులకు చీపుర్లు, ఆఫీసు అవసరం కోసం కాగితాలు సైతం కొనలేని స్థితిలో పంచాయతీలు నడుస్తున్నాయి. కొత్త పాలకవర్గాలు కొలవుదీరి 4నెలలు పూర్తయినా గ్రామపంచాయతీ నిధుల చెక్‌పవర్ అధికారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్ చట్టం అమల్లోఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే కంటే ఏడాది ముందు నుంచీ గ్రామపంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. దీంతో కొత్త పనులేవీ మొదలుకాలేదు. మౌలికవసతుల కల్పన, పునరుద్ధరణ పనులను పట్టించుకోలేదు. కొత్త పాలకవర్గాలు వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందనుకుంటే అదీ జరగడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేసింది. గ్రామపంచాయతీలకు వివిధ రకాలుగా సమకూరిన నిధులను గ్రామపంచాయతీ తీర్మానాల మేరకు పాలకవర్గాలు ఖర్చు చేస్తాయి. నిధుల విడుదల కోసం ‘జాయింట్ చెక్ పవర్’విధానం కొనసాగుతోంది. గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సంయుక్తంగా జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ విధానాన్ని మార్చింది. సర్పంచులు, ఉప సర్పంచులకు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ఇచ్చింది. చట్టం అమలు చేసేందుకు అన్ని అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కీలకమైన 7 విషయాలపై మాత్రం ఉత్తర్వులు జారీ చేయడంలేదు. జాయింట్ చెక్‌పవర్ విషయంలోనూ ప్రభుత్వం కొత్త చట్టంలోని నిబంధన ప్రకారం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. మరోవైపు పాత చట్టం ప్రకారం సర్పంచ్, కార్యదర్శి కలిపి ఉండే జాయింట్ చెక్‌పవర్ విధానం అమలు కావడంలేదు. దీంతో గ్రామపంచాయతీల్లో నిధులు విడుదలకు బ్రేక్ పడింది. దీంతో కొత్త పాలకవర్గాలు సైతం గ్రామపంచాయతీల్లో ఎలాంటి పనులు చేపట్టడంలేదు. తాగునీటి, కరెంటు సరఫరా వంటి ముఖ్యమైన పనులకు సైతం నిధుల విడుదల లేక ముందుకు సాగడంలేదు. అత్యవసర పనుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. సర్పంచ్ల దీనస్థితి గ్రామపంచాయతీ నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారు. సొంతంగా సమకూరిన నిధులు సైతం ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాలకు తమ వంతుగా ఏదో చేయాలని భావించి ఎన్నికల్లో పోటీ చేసిన తమకు కొత్తలోనే చేతులు కట్టేసినట్లుగా ఉందని కొందరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు సంగతి పక్కనపెడితే.. కనీస అవసరాలు సైతం తీర్చలేని దుస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు చెక్‌పవర్‌పై ప్రత్యేకంగా మెమోలు జారీ చేశారు. పాత విధానంలోనే నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు ఈ విషయంలో ధైర్యం చేయడంలేదు. చెక్‌పవర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు నిధుల విడుదలకు దూరంగా ఉంటున్నారు. -
చెక్‌పవర్‌పై వెంటనే జీవో ఇవ్వాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌తో పాటు చెక్‌పవర్ ఇచ్చే వారెవరో నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానికనుగుణం గా జీవో జారీచేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామాల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడి మూడు నెలలు దాటుతున్నా నేటికీ పంచాయతీలకు చెక్‌పవర్ లేకపోవడం, గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు, కనీస అవసరాలు తీర డం లేదన్నారు. సిబ్బందికి చెల్లించే అరకొర జీతభత్యాలు కూడా లేక పారిశుధ్య పనులు చాలా చోట్ల నిలిచిపోయాయని ఒక ప్రకటనలో తెలి పా రు. పంచాయతీరాజ్ కొత్త చట్టంలో సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్‌పవర్ నిబంధన ఉన్నప్పటికీ, సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శికి చెక్‌పవర్ ఇస్తామని ఇటీవలే సీఎం ప్రకటించారన్నారు. జాయింట్ చెక్‌పవర్ ఎవరికిస్తారనే దానిపై నేటికీ స్పష్టత లేదని, ఎన్నికల కోడ్‌కు, చెక్‌పవర్‌కు సం బంధం లేకపోయినా ప్రభుత్వం దాన్ని సాకుగా చూపుతోందన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఇతర గ్రాంట్స్ ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధ ఆటంకమేమీ లేదన్నారు. -
సర్పంచ్‌లకు చెక్ పవర్ వచ్చేదెప్పుడో..?
సాక్షి, భువనగిరి : పల్లెలను ప్రగతి బాటలో నడిపిం చాలనే సంకల్పం, ఆరంభంలోనే ప్రజల చేత శభాష్ అనిపించుకోవాలనే కోరిక, మహిళలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలనే తపన, వీధి దీపాల ఏర్పాటుతోపాటు తమను నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనే ఆశయంతో నూతన సర్పంచ్‌లు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టి నెలరోజులు గడుస్తున్నా సర్పంచ్‌లకు నేటికీ చెక్‌పవర్ అందలేదు. దీంతో ట్రెజరీల్లో పంచాయతీ నిధులు మూలుగుతున్నాయి. కోటి ఆశలతో కొలువుదీరిన సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేకపోవడంతో గ్రామాల్లోని సమస్యలు ఎక్కడిక్కడే పేరుకుపోతున్నాయి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు.. ప్రజల పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం గిరిజన తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కానీ ఈ పంచాయతీల్లో పలు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో చేతిపంపులు వట్టి పోతున్నాయి. ప్రధానంగా నూతనంగా ఏర్పడిన పంచాయతీల్లో పాలక వర్గం వార్డు సభ్యులు, సర్పంచ్‌లు కూర్చుకోవడానికి సైతం కుర్చీలు కొనుగోలు చేద్దామన్నా నిధులు లేకపోవడం శోచనీయం. సర్పంచ్‌లకు చెక్ పవర్ పై స్పష్టత లేకపోవడంతో నిధులు విడుదల చేయాలంటే సర్పంచ్, గ్రామ కార్యదర్శి పేరు పై బ్యాంకులో ఖాతా ఉండాలి. ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల పేరుతో ఉన్న ఖాతాలను మార్పిడి చేసి ట్రేజరీ కార్యాలయంలో నిషేధించారు. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీల పేరిట ట్రేజరీల్లో అందుబాటులో ఉన్నా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఎలాంటి జాప్యలేకుండా ప్రభుత్వం సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాలకవర్గాలకు చెక్‌పవర్ ఇవ్వాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. నియోజకవర్గంలో 127 గ్రామ పంచాయతీలు.. భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 127 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో భువనగిరి మండలంలో 34, భూదాన్‌పోచంపల్లి 22, వలిగొండ 37. బీబీనగర్ మండలంలో 34 గ్రామా పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు ఇంతవరకు చెక్ లేదు. ఆయా గ్రామ పంచాయతీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతోంది. చెక్ పవర్‌పై స్పష్టత ఇవ్వాలి గ్రామ పంచాయతీ నిధుల వాడకంపై స్పష్టత లేదు. పంచాయతీ కార్యదర్శలే, ఉప సర్పంచ్ అనే దానిపై ప్రభుత్వం మార్గ దర్శకాలను విడుదల చేయలేదు. గ్రామంలో సమస్యను పరిష్కరించుకోవడానికి నిధులు కోసం చెక్ పై స్పష్టత లేకపోవడంతో సమస్యగా మారుతుంది. – వెంకట్‌రెడ్డి, సర్పంచ్, పహిల్వాన్‌పురం -
ముగ్గురు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు
– ఆస్పరి సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు కర్నూలు(అర్బన్): జిల్లాలోని ముగ్గురు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు వేర్వేరు కారణాలతో చెక్ పవర్‌ను రద్దు చేశామని, మరో సర్పంచ్‌కు షోకాజ్ నోటీసును అందించినట్లు జిల్లా పంచాయతీ అధికారిణి బి.పార్వతీ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కోడుమూరు మండలం కల్లపరి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఏకగ్రీవ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి రూ.7 లక్షల ప్రకారం విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ గ్రామాల సర్పంచుల చెక్‌పవర్‌ను రద్దు చేశామన్నారు. అలాగే కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ 13వ ఆర్థిక సంఘం కింద విడుదలైన రూ.3 లక్షలను చేతి నిల్వ కింద పెట్టుకున్నట్లు మీకోసంకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టి ఆయన చెక్ పవర్‌ను కూడా రద్దు చేసినట్లు డీపీఓ తెలిపారు. అలాగే ఆస్పరి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పేరుకుపోవడం, ఆక్రమణలు పెరిగిపోయాయని.. వీటిపై విచారణ చేసి ఈ నెల 11న షోకాజ్ నోటీసును జారీ చేశామన్నారు. వారంలోగా నోటీసుకు సంజాయిషీ ఇవ్వకపోతే ఆస్పరి సర్పంచ్ చెక్ పవర్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రభుత్వం విడుదల చేసిన గ్రాట్లను గ్రామాభివృద్ధి కోసం వెచ్చించాలే తప్ప, సొంత పనులకు వాడుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఎస్ఎంసీ చైర్మన్లకూ చెక్‌పవర్
బాలాజీచెరువు (కాకినాడ) : పాఠశాలల్లో వివిధ పనుల నిమిత్తం నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయుడితోపాటు ఇటీవల ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్లకు కూడా సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తూ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ) ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 4,412 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఇటీవల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. పాఠశాల అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, విద్యార్థుల చదువులపై శ్రద్ధ, డ్రాపౌట్ల గుర్తింపు, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం తనిఖీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలను పర్యవేక్షించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. ఇటీవలి వరకూ స్కూల్ కమిటీలు లేకపోవడంతో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవోలు సంయుక్తంగా నిధులను వినియోగించేవారు. కొత్త కమిటీలు ఏర్పడటంతో ప్రధానోపాధ్యాయుడితోపాటు ఎస్ఎంసీ చైర్మన్‌కు జాయింట్‌గా ఖాతాలు ఏర్పాటు చేసి చెక్ పవర్ కల్పిస్తూ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఎంఈవోలకు పంపి ఆయా పాఠశాల చైర్మన్, ప్రధానోపాధ్యాయులతో కొత్త ఖాతా ప్రారంభించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఇంకా పెండింగ్‌లో ఉన్న 52 పాఠశాలలకు వచ్చే వారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఎస్ఏ పీవో శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. కొత్త చైర్మన్లకు వారి అధికారాలు, విధులపై త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
చెక్ పవర్ రద్దు చేస్తారా?
లేట‘రైట్ అనలేదని’ కక్ష సాధిస్తారా.. జన్మభూమి సభలో సరుగుడు సర్పంచ్ ఆవేదన నాతవరం : తాను చేసిన తప్పు ఏమిటో బహిరంగ విచారణ చేపట్టాక చెక్‌పవర్ రద్దుతోపాటు ఏ శిక్ష విధించినా సిద్ధమేనని సరుగుడు సర్పంచ్ సాగిన లక్ష్మణమూర్తి అన్నారు. శుక్రవారం సరుగుడులో నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ లాటరైట్ నిక్షేపాలు అనుమతికి అనుకూలంగా తీర్మానం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. నిబంధనల మేరకు మాత్రమే చేయగలనని తాను చెప్పడంతో రాజకీయ కక్షసాధింపునకు పాల్పడ్డారన్నారు. పంచాయతీకి సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. వైఎస్సార్సీపీ చెందిన వ్యక్తిని కావడంతో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి తనయుడు తన చెక్ పవర్‌ను రద్దు చేయించారన్నారు. అసలు ఏకారణంతో రద్దు చేశారో అధికారులు సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కనీసం గిరిజనుడనని కూడా కనికరంగా లేకుండా వ్యవహరించారని అవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేసి ఉంటే ముందుగా దండోరా వేయించి గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టి ఎటువంటి శిక్ష విధించినా తాను సిద్ధమేనని అన్నారు. అంతే గానీ మంత్రి తనయుడు చెప్పాడని తనకు అన్యాయం చేయడం దారుణమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. లేటరైట్ తవ్వకందారులను అరెస్టు చేయాలి నర్సీపట్నం: లేటరైట్ తవ్వకాలను నిలిపివేసి, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయాలని సీపీఎం డివిజన్ కమిటి సభ్యుడు ఎ.రాజు డిమాండ్ చేశారు. నాతవరం మండలం సరుగుడు శివారు అసనగిరి అటవీ ప్రాంతంలో 35.84 హెక్టార్లల్లో ఇచ్చిన అనుమతులను రద్దు చేసినందున తవ్వకాలను తక్షణమే నిలిపి వేయాలన్నారు. సింగం భవాని చట్ట విరుద్ధంగా అనుమతులు పొంది వన్యప్రాణులకు, గిరిజనుల జీవనానికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన అదేశాల మేరకు తవ్వకాలు జరుపుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘పంచాయతీ’ జేబులకు కత్తెర
గ్రామ పంచాయతీల నిధులను తమ హస్తగతం చేసుకోవడానికి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ వేస్తోంది. కేంద్రం ద్వారా మంజూరైన నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించుకునేందుకు యత్నిస్తోంది. అంగీకరించని సర్పంచ్ల ‘చెక్‌పవర్’ రద్దు చేస్తామంటోంది. రాష్ట్రంలో సగానికిపైగా గ్రామపంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న నేపథ్యంలో వాటి నిధుల ఖర్చును పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఈ ఎత్తుగడ వేస్తోంది. మీ సొమ్ము... మాకివ్వండి * లేదంటే... సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు * పంచాయతీలకు ప్రభుత్వం హుకుం * రూ. 500 కోట్లు హస్తగతం చేసుకునేందుకు మౌఖిక ఆదేశాలు * 73వ రాజ్యాంగ సవరణకు రాష్ట్ర సర్కార్ తూట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమే ఇన్నాళ్లూ చూశాం. విచిత్రంగా చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా మీ ఊళ్లో రోడ్లు వేస్తాం, గ్రామ పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన నిధులను మాకు బదిలీ చేయాలంటూ ఆదేశిస్తోంది. స్వచ్ఛందంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు రాని గ్రామ సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేస్తామంటూ స్వయంగా ఉన్నతాధికారుల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తోంది. రోడ్ల నిర్మాణం కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు రూ.1,774 కోట్లు మంజూరు చేసింది. వాటిలో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడానికి టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 500- 600కు పైగా గ్రామ పంచాయతీల నుంచి అలా మంజూరైన నిధులను ప్రభుత్వం గుంజేసుకుంది. కేంద్రం పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా ఇప్పటికే విద్యుత్ బకాయిల పేరుతో వందల కోట్లను లాగేసుకుంది. విపక్ష సర్పంచ్‌లు ఉన్నందునే.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించిన కారణంగా కేంద్రం రెండేళ్లుగా గ్రామాలకు నిలిపివేసిన నిధులన్నింటినీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ. 1,774 కోట్లను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారున్న నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో నిధుల ఖర్చు పూర్తిగా తమ చేతుల్లో తీసుకోవడానికి చంద్రబాబు సర్కారు ఈ ఎత్తుగడ వేసింది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాల్సిన పనులను, అదే గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారితో చేయించడానికి సిద్ధమవుతోంది. లింకులు పెట్టి ఉన్న పథకానికీ మంగళం పంచాయతీ నిధులను తమ హస్తగతం చేసుకునేందుకు గ్రామాల్లో వంద శాతం ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు తదితర నిర్మాణాలు చేపట్టే కార్యక్రమానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడేసింది. ‘ఉపాధి’ పథకంలో కేవలం కూలీలతో చేపట్టే పనులే కాకుండా వందశాతం ఆ పథకం నిధులతో గతేడాది వరకు గ్రామాల్లో సిమెంటు రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ విధానానికి చంద్రబాబు సర్కారు స్వస్తిపలికి భవిష్యత్తులో గ్రామ పంచాయతీలు సగం నిధులు ఇవ్వడానికి ముందుకొస్తేనే మిగిలిన సగం నిధులు ఉపాధి పథకం ద్వారా ఆయా గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి అనుమతి తెలపాలంటూ ప్రభుత్వం జూన్ 18న జీవో నంబరు 58 జారీ చేసింది. వాస్తవంగా, ఆర్థిక సంఘం పేరుతో కేంద్రం గ్రామాలకు ఇచ్చే నిధుల ఖర్చుతోపాటు, 90శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు జరిగే ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు కేవలం పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలి. జీవో 58 ప్రకారం.. పై రెండు పథకాల ద్వారా పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను 50-50 శాతం కలిపి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కొత్త ఎత్తుగడ వేసింది. నిధులు మళ్లించాలంటూ ఒత్తిడి పంచాయతీలు 50 శాతం నిధులివ్వడానికి ముందుకొస్తే ప్రభుత్వం మరో 50 శాతం నిధులిచ్చి గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తామంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొదట గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకున్నాయి. రాష్ట్రంలో 12,918 గ్రామాలు ఉండగా, అందులో దాదాపు 8వేల గ్రామాలు తీర్మానాలను ప్రభుత్వానికి అందజేశాయి. మిగిలిన గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకోవడం కోసం ఒక పక్క అధికారులు ఒత్తిడి తీసుకొస్తూనే.. మరో పక్క ఇప్పటికే తీర్మానం చేసిన గ్రామ సర్పంచ్‌లు తక్షణమే కేంద్రమిచ్చిన నిధులను రోడ్ల నిర్మాణం కోసం తమకు మళ్లించాలంటూ ఒత్తిడి మొదలుపెట్టారు. దీనిపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోందంటే... ♦ రాజ్యాంగ సవరణ మేరకు గ్రామ పంచాయతీలకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించారు. గ్రామ పంచాయతీలకు పన్ను రూపేణా వచ్చే ఆదాయంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నిధులు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపేణా గ్రామాలకు కేటాయించిన నిధులు పంచాయతీల సాధారణ నిధి (జనరల్ ఫండ్)కి జమవుతాయి. ఈ నిధులు ఖర్చు పెట్టుకోవడంలో అధికారం పూర్తిగా ఆ గ్రామాల పంచాయతీలకే ఉంటుంది. ♦ ఈ నిధుల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోరాదు. ♦ అత్యవసర సందర్భాల్లోనూ పంచాయతీలతోనే ఖర్చు చేయించాలి. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. కానీ, నిధులను తన అధీనంలోకి తీసుకోకూడదు. ♦ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 29 అధికారాలను గ్రామ పంచాయతీలకే పూర్తిగా బదిలీ చేయాలి. -
సర్పంచులకు చెక్ పవర్ ఏదీ?
హైదరాబాద్: పంచాయతీ సర్పంచులకే చెక్‌పవర్ ఇవ్వాలని నాలుగు నెలల కిందట హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం, స్థానిక సంస్థల అధికారాలను కాలరాయడమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సర్కారు తీరును తప్పుపట్టారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని తక్షణమే హైకోర్టు తీర్పు అమలు చేయాలని గురువారం డిమాండ్ చేశారు. అలాగే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు మూడు నెలల క్రితం సీఎం ప్రకటించినా.. ఉత్తర్వులు జారీ కాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. హామీలతో ఉద్యమాలను నీరుగార్చి, ఆ పై అమలు చేయకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని ఆర్.కృష్ణయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు. -
చెక్‌పవర్‌పై వెనక్కి తగ్గేది లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పంచాయితీ కార్యదర్శులకు కల్పించిన అధికారాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం డైరీ, కరదీపికలను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కార్యదర్శులు చురుకైన పాత్ర పోషించాలని, కార్యదర్శులకు సర్పంచ్‌లతో పాటు జాయింట్ చెక్ పవర్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిని అధికారంగా భావించకుండా బాధ్యతగా ఉపయోగించాల ని సూచించారు. సర్పంచులతో సమన్వయంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ప్రతినిధులు యాదగిరి, ఉపేందర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, మల్లికార్జున్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ చెక్‌పవర్ ‘పంచాయితీ’
ఖమ్మం జడ్పీసెంటర్: పంచాయతీల్లో మళ్లీ చెక్‌పవర్ లొల్లి మొదలైంది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్‌ను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అగ్గి రాజుకుంది. ఈ విషయంలో సర్పంచ్‌లు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహాలో జాయింట్ చెక్‌పవర్‌ను ఇవ్వడంతో అప్పట్లో సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఇప్పుడు అదే తరహాలో సర్పంచ్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో నిర్వహించే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగంలో సర్పంచ్‌తో పాటు కార్యదర్శుల సంతకం తీసుకోవటం ఏమిటని పలువురు ప్రెసిడెంట్లు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 671 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 147 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఇటీవల మరో 48 మందిని నియమించారు. ఈ 195 పంచాయతీలు మినహా మిగిలినవాటికి కార్యదర్శులు లేరు. అటువంటప్పుడు జాయింట్ చెక్‌పవర్ ఇస్తే పరిస్థితి ఏంటని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గతంలో ఉన్న జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేశారు..ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటని అంటున్నారు. ‘ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకే సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇచ్చాము’ అని ప్రభుత్వం వాదిస్తోంది. సర్కారు వాదనతో సర్పంచ్‌లు ఏకీభవించడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండానే దుర్వినియో గం అవుతాయనడంలో అర్థం లేదని వాదిస్తున్నారు. ఇద్దరి సంతకంతోనే నిధులు ఈ జీవో ప్రకారం సర్పంచ్, కార్యదర్శి ఇద్దరూ సంతకం చేస్తేనే ఏ నిధులైనా విడుదలవుతాయి. గ్రామపంచాయతీల అభివృద్ధి నిమిత్తం అంతర్గత రహదారులు, మరమ్మతు పనులు, పారిశుధ్యం, వీధి దీపాలు, పంచాయతీ భవనాలు, 13వ ఆర్థికసంఘం నిధులు, బీఆర్జీ, ఆర్‌జీపీఎస్‌ఏ తదితర నిధులు వస్తాయి. ఈ నిధుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా సర్పంచ్, కార్యదర్శులిద్దరి సంతకం కావాలి. గతంలో జనరల్ ఫండ్ నుంచి గ్రామ మౌలిక అవసరాల కోసం ఖర్చు చేసే అధికారం సర్పంచ్‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు జనరల్ ఫండ్ డ్రా చేయాలన్నా కార్యదర్శి సంతకం తప్పనిసరి. కార్యదర్శులపై ‘అదనపు’ భారం జిల్లాలో 671 పంచాయతీలు ఉండగా 195 మంది కార్యదర్శులే ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులను 34 మంది అర్హులతో భర్తీ చేసే అవకాశం ఉంది. అయినా ఇంకా పలు పంచాయతీలకు సెక్రటరీల కొరత ఉంటుంది. సర్పంచ్ కు అవసరమైనప్పుడు కార్యదర్శి అందుబాటులో ఉండని సమస్య తలెత్తే అవకాశం ఉంది. గతంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జాయింట్ చెక్‌పవర్ ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌లు, కార్యదర్శులకు కలిపి ఇచ్చారు. అధికారాలను బదలాయించాలన్న డిమాండ్ సర్పంచ్ల నుంచి వినిపిస్తుండగా ప్రభుత్వం ఉన్న అధికారాల్లో కోత విధించడంపై సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్ల మంచికే:రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి జాయింట్ చెక్ పవర్ వల్ల సర్పంచ్‌లకే ప్రయోజనం. ప్రతి పనిలో, నిధుల ఖర్చులో సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకు బాధ్యత ఉంటుంది. ప్రతి పైస ఖర్చు కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీని వల్ల అడిట్ ఇబ్బందులు ఉండవు. జవాబుదారితనం పెరుగుతుంది. సర్పంచ్‌లకు పూర్తి వెసులుబాటు ఉంటుంది. సర్పంచ్‌లను అవమానించడమే: కొర్రా రాములు, సోములగూడెం సర్పంచ్, పాల్వంచ సర్పంచ్‌లు, సెక్రటరీలకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వడం సర్పంచ్‌లను అవమానించడమే. గతంలో సర్పంచ్‌లు పోరాడి తెచ్చుకున్న జీవోను సీఎం కేసీఆర్ రద్దు చేయడం దారుణం. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరుకాలేదు. అప్పుడే దుర్వినియోగం మాటెత్తడం సరికాదు. అభివృద్ది పనులకు విఘాతమే: సరస్వతి, తోగ్గూడెం సర్పంచ్, పాల్వంచ గ్రామ పంచాయితీలకు సెక్రటరీలు సరిపడా లేరు. ఒక్కో సెక్రటరీ మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీనివల్ల వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. వారు అందుబాటులో లేకపోతే అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. కాబట్టి సర్పంచ్‌లకే చెక్‌పవర్ ఇవ్వాలి. -
పంచాయతీల్లో జాయింట్ చెక్‌పవర్
నిధుల వినియోగానికి సర్పంచ్‌తో పాటు కార్యదర్శి సంతకం తప్పనిసరి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో నిర్వహించే పనులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వినియోగంలో జాయింట్ చెక్‌పవర్ విధానాన్ని అమలుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇక నుంచి గ్రామ పంచాయతీల పరిధిలో పనులకు నిధుల వినియోగం కోసం సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శి సంతకం తప్పనిసరి కానుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి నిమిత్తం అంతర్గత రహదారులు, మరమ్మతు పనులు, పారిశుధ్యం, వీధి దీపాలు, పంచాయతీ భవనాలు తదితర కార్యక్రమాలకు 13వ ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్, ఆర్‌జీపీఎస్‌ఏ పథకాల నుంచి నిధులు విడుదలయ్యాయి. అయితే పలు గ్రామాల పంచాయతీలు గ్రాంట్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదని తేలింది. కొన్ని పంచాయతీల్లో నిబంధనలను పాటించకుండా నిధులు వినియోగిస్తున్నారని, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి సంతకం తప్పనిసరి చేస్తూ.. జాయింట్ చెక్ పవర్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అయితే తాజా ఉత్తర్వులపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌లను అవమానించడమే.. సర్పంచ్ల అధికారాలను కత్తిరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కచ్చితంగా వారిని అవమానించడమేనని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సి. సత్యనారాయణరెడ్డి అన్నారు. అవకతవకలను అరికట్టేందుకు అంబుడ్స్‌మన్ వంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశమున్నా.. అధికారాన్ని కార్యదర్శులకు కట్టబెట్టడం సరికాదని తెలిపారు. సీఎం చంద్రశేఖర్‌రావు గ్రామసర్పంచ్‌లకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కారని విమర్శించారు. -
పవర్.. పంచాయితీ
సాక్షి, కర్నూలు: సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ కట్టబెట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. చిల్లిగవ్వ నిధుల్లేక అభివృద్ధి పనుల విషయంలో సర్పంచ్‌లు ముందడుగు వేయలేకపోతున్నారు. బాధ్యతలు చేపట్టి మూడు నెలలు గడుస్తుండటంతో హామీలు నెరవేర్చడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తుండటం వారిని గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే అవకాశం లేక పలు మేజర్ పంచాయతీలు అంధకారంలో మగ్గుతున్నాయి. గత పంచాయతీ పాలకవర్గాల సమయంలో చెక్‌పవర్ సర్పంచ్ల చేతిలోనే ఉండగా.. పదవీకాలం ముగిసిన తర్వాత ఇటీవల ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ఆ సందర్భంగా ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శికి సంయుక్త అధికారం కట్టబెట్టారు. ఎట్టకేలకు నాలుగు నెలల క్రితం మూడు విడతల్లో జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నో ఆశలతో ఆగస్టు 2న పాలకవర్గాలు పదవీ బాధ్యతలు చేపట్టగా వారికి నిరాశే మిగిలింది. ఏదో చేయాలనే తపన ఉన్నా.. చెక్‌పవర్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వారిని గందరగోళానికి గురిచేస్తోంది. మొదట జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తున్నట్లు ప్రకటించడం ఆందోళనలకు కారణమైంది. సర్పంచ్‌లతో పాటు బీసీ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం.. అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకోవడం, ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ఆ ఉత్తర్వులు క్షేత్ర స్థాయికి చేరలేదు. తెలంగాణ జిల్లాల్లో అమల్లోకి వచ్చినా సీమాంధ్రలో ఉన్నతాధికారుల కార్యాలయాలకే పరిమితమయ్యాయి. తాజాగా సర్పంచ్‌లకే ఆ అధికారం కట్టబెడుతూ ప్రభుత్వం అక్టోబర్ 30న జీవో నంబర్ 432 జారీ చేసింది. ఉత్తర్వులు విడుదలై దాదాపు రెండు వారాలు దాటినా నేటికీ క్షేత్రస్థాయికి చేరకపోవడం విమర్శలకు తావిస్తోంది. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, అనుగొండ, వెంకటగిరి, గోరంట్ల, అమడగుంట్ల, లద్దగరి సర్పంచ్‌లు తాము పదవి చేపట్టి వంద రోజులవుతున్నా ఇప్పటికీ చిల్లిగవ్వ ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఖజానా కార్యాలయం నుంచి జిల్లాలోని ఉప ఖజానా(సబ్‌ట్రెజరీలు) కార్యాలయాలకు ఉత్తర్వులు అందకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సబ్ ట్రెజరీలకు ఉత్తర్వులు అందిన తర్వాత ఆయా మండలాల్లో సర్పంచ్ల సంతకాలను సంబంధిత ఎంపీడీవోలు.. లేకపోతే గెజిటెడ్ అధికారి ధ్రువీకరిస్తూ ఉప ఖజానా కార్యాలయాలకు పంపడం పరిపాటి. అప్పుడే చెక్‌లు డ్రా చేసుకునే వీలు ఏర్పడుతుంది. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు గ్రామాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా జిల్లా కేంద్రం నుంచి ఉప ఖజానా కార్యాలయాలకు చెక్‌పవర్ ఉత్తర్వులు అందడానికి ఇంత సమయం తీసుకోవడం అర్థం లేదనే వాదన వినిపిస్తోంది. ఇక్కడే ఇలావుంటే సర్పంచ్ల సంతకాల ధ్రువీకరణకు ఎంపీడీఓలు మరెంత సమయం తీసుకుంటారోననే చర్చ కొనసాగుతోంది. ఇలాగైతే ప్రజల్లో తిరగలేం: సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఉప ఖజానా కార్యాలయాల అధికారులను కలిస్తే జిల్లా ట్రెజరీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. వీధిలైట్ల కొనుగోలుకు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల చెల్లింపునకు సొంత నిధులను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాగైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి. వారికి కనీసం ముఖం కూడా చేపలేకపోతున్నాము. - పి.మద్దిలేటి, సర్పంచ్, ఆర్.ఖానాపురం, గూడూరు మండలం -
చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేయొద్దు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పం చ్‌లు చెక్‌పవర్ బాధ్యతను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి సూచించారు. చెక్‌పవర్ పునరుద్ధరించినందుకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో సర్పంచ్‌లు సచివాలయంలో మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకుండా ఆపేసిందని, పంచాయతీ ఎన్నికలు పూర్తయినందున రూ. 488 కోట్లు విడుదల చేసిందని వాటిని, జెడ్పీ, మండల, పంచాయతీలకు పంపిణీ చేసినట్లు వివరించారు. మరో వంద కోట్లు మంచినీటి పథకాల కోసం విడుదల చేసినట్లు తెలిపారు. పలు పార్టీలు, సర్పంచ్ల సంఘాలు, వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు సర్పంచ్‌లకు ఈ చెక్‌పవర్‌ను పునరుద్ధరించామన్నారు. వెంటనే మండల, జెడ్పీ, మునిసిపాలిటీల ఎన్నికలు నిర్వహించాలి తక్షణమే మండల, జెడ్పీ, మునిసిపాలిటీల ఎన్నికలు నిర్వహించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాధికారం రాకుండా నిరోధించడానికే ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మంత్రికి సన్మానం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పక్షం రోజుల్లోగా కోర్టుకు వెళ్లడమేకాక, ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. సర్పంచ్ల గౌరవ వేతనాన్ని 20 వేల రూపాయలకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సర్పంచ్‌లకు చెక్‌పవర్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్ల సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతల ఆందోళన నేపథ్యంలో, సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెక్‌పై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలసి సంతకం చేయడం సర్పంచ్‌లకే అవమానవుంటూ పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో గతంలోని జారుుంట్ చెక్‌పవర్ ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి. నాగిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అయితే పంచాయతీల్లో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆంక్షలు విధించారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి చెల్లింపులకూ వీల్లేదని, ప్రతి చెల్లింపునూ రిజిష్టర్‌లో, క్యాష్‌బుక్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనువుతులు లేని పనులు చేపట్టరాదని, నగదు రూపంలో చెల్లింపు కుదరదని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రొక్యూర్మెంట్ విధానానికి అనుగుణంగా కొనుగోళ్లు ఉండాలన్నారు. చెక్‌బుక్‌లు, రిజిష్టర్లు ఇళ్లలో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీ వసూలు చేసే డబ్బును ముందుగా ట్రెజరీలో జమ చేయాల్సిందేనన్నారు. నిధుల వ్యయానికి గ్రామ కార్యదర్శి కూడా బాధ్యత వహించాలని, వ్యయానికి సంబంధించి మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, ఏమాత్రం నిర్లక్ష్యంఉన్నా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ల సంఘం హర్షం: పంచాయతీల నిధుల వ్యయంలో జారుుంట్ చెక్‌పవర్‌ను రద్దు చేసి సర్పంచ్‌లకు పూర్తిస్తాయి చెక్‌పవర్ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపట్ల రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి, గౌరవ సలహాదారు పిల్లి సత్తిరాజు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడాన్ని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్వాగతించారు. సర్పంచ్‌కు గౌరవవేతనాన్ని ఆరువందల రూపాయలను 20 వేల రూపాయలకు పెంచాలని ఆయున డిమాండ్ చేశారు. -
సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వాలి: కృష్ణయ్య
నల్గొండ: సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సర్పంచ్ల సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నవారికే పదవులు దక్కుతున్నాయని ఆయన అన్నారు. ఈ సన్మాన సభకు టిడిపి ఎంపి దేవేందర్ గౌడ్ కూడా హాజరయ్యారు. -
కొత్త సర్పంచులకు సర్కారు షాక్
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: సర్పంచ్ల చెక్‌పవర్‌లో పంచాయతీ కార్యదర్శులకు వాటా కల్పి స్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 385పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఈ చర్య తమకు అవమానకరంగా భావిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ నిధుల వినియోగంలో సర్పంచ్ల చెక్ పవర్‌ను కుదిస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం 385 జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడిగా చెక్ పవర్ కల్పించారు. ఈ అంశమే సర్పంచుల ఆగ్రహానికి, నిరసనకు కారణమవుతోంది. కొత్త జీవో కారణంగా జనరల్ ఫండ్ ద్వారా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. 2011 ఆగస్టులో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు కొనసాగాయి. ఎట్టకేలకు ఈ ఏడాది జులై నెలలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఆగస్టు మొదటి వారంలో కొత్త సర్పంచ్‌లు పదవీ ప్రమాణం చేశారు. అయితే పదవుల్లో కూర్చున్నామన్న ముచ్చట తీరకముందే చెక్ పవర్ కుదిస్తూ జీవో జారీ చేయడం ద్వారా ప్రభుత్వం వారికి షాకిచ్చింది. గ్రామ కార్యదర్శితో పాటు చెక్‌పవర్ పంచుకోవాలన్న విషయాన్ని సర్పంచ్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైన తమ అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేయడం సరైంది కాదని జిల్లాలోని సర్పంచ్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తమ హక్కులను కాలరాయడమేనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ సర్పంచ్‌తోపాటు ఒక వార్డు సభ్యుడికి ఉమ్మడిగా చెక్ పవర్ ఉండేదని సర్పంచ్‌లు గుర్తుచేస్తున్నారు. అయితే అలా చెక్‌పవర్ ఇవ్వాల్సిన సభ్యుడిని, మిగతా వార్డు సభ్యులందరూ కలసి ఎన్నుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా గ్రామ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిధుల వినియోగంలో కొందరు సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడ్డారని ఇటువంటి చర్యలు తీసుకోవడం అందరినీ అవమానించడమేనని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కక్ష సాధింపు చర్య అవినీతికి పాల్పడ్డ సర్పంచ్‌లను వదిలేసి సర్పంచ్లందనీ అనుమానిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం శోచనీయం. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే. ప్రభుత్వం వెంటనే ఈ జీవో ఉపసంహరించుకోవాలి. -గదిలి మల్లేశ్వరరావు, సర్పంచ్, గోపాలపెంట ప్రభుత్వ నిర్ణయం సరికాదు చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. దీనివల్ల అభివృద్ది కుంటుపడుతుంది. ఈ జీవోను రద్దు చేసి సర్పంచ్‌లకే పూర్తి స్థాయి అధికారాలు అప్పగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -బగ్గు అరుణ, సర్పంచ్, కొబగాం -
385 జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం
మాచర్లటౌన్, న్యూస్‌లైన్: గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ హక్కులను భంగపరుస్తూ, వారి అధికారాన్ని, చెకపవర్‌ను రద్దుచేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. పట్టణంలోని తన కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్ల కిందట కాలపరిమితి పూర్తయిన పంచాయతీలకు ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారులకు పెత్తనం ఇచ్చి గ్రామాభివృద్ధిని కుంటుపర్చారని విమర్శించారు. సర్పంచ్‌లకు నిధులు లేకుండా జాయింట్ చెక్‌పవర్ పేరుతో జీవో నంబరు 385ను తెచ్చిందన్నారు. సర్పంచ్‌ను అవమాన పర్చే ఈ జీవోను వెంటనే రద్దు చేసి సర్పంచ్‌లకు పూర్తి స్థాయి చెక్‌పవర్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు జరపని కారణంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి, ఎస్‌ఎప్‌సీ గ్రాంటు ద్వారా రావాల్సిన కోట్ల రూపాయల నిధులు పంచాయతీలకు దక్కలేదన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పారు. మెజార్టీ స్థానాలు ప్రతిపక్ష పార్టీలకు దక్కటంతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాభివృద్ధిపై శీత కన్ను వేసి ఎన్నికలు పూర్తయి నెల రోజులైనా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. జిల్లాలోని సర్పంచ్‌లందరూ పార్టీలకు అతీతంగా ముందుకువచ్చి జీవో రద్దు గురించి పంచాయతీల్లో తీర్మానం చేసి కలెక్టర్, డీపీవోలకు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసం గ్రామ స్వరాజ్యం, సర్పంచ్ల అధికారం కోసం, గ్రామాభివృద్ధికి వైఎస్సార్సీపీ తరపున పోరాటం చేసి జీవోను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామన్నారు. -
ఎస్ఎంసీ చైర్మన్లకు చెక్ పవర్
యాచారం, న్యూస్‌లైన్: పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) చెర్మన్లకు చెక్ పవర్ వచ్చింది. ఈమేరకు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎస్ఎంసీ చైర్మన్లతో కూడిన జాయింట్ అకౌంట్‌ను తెరవాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఇటీవల అదేశాలు జారీచేశారు. పాఠశాల నిధుల నిర్వహణ, నూతన భవనాల నిర్మాణం తదితర అంశాలల్లో ఆర్థికపరమైన నిధుల్లో పాఠశాల హెచ్‌ఎంలతోపాటు ఎస్ఎంసీ చైర్మన్లు కీలకం కానున్నారు. గత ఏడాది వరకు ఈ నిధులపై పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్లకు ఎలాంటి అధికారం లేదు. కేవలం నామమాత్రంగానే ఈ పదవులు ఉండేవి. మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 51 వరకు ఉన్నాయి. దాదాపు ఆరు వేల మంది విద్యార్థుల వరకు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాల్లో ఎస్ఎంసీ కమిటీ చెర్మన్లను ఎన్నుకున్నారు. ప్రభుత్వం నుంచి పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఆర్వీఎం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. ఇందులో ఉన్నత పాఠశాలకు గ్రాంటు కింద రూ. 7వేలు, నిర్వాహణ కోసం రూ. 10 వేలు, ప్రాథమిక పాఠశాల గ్రాంట్, నిర్వాహణకు రూ.10వేలు మంజూరవుతాయి. వీటితోపాటు ప్రత్యేకంగా క్లస్టర్ పాఠశాలలకు అదనంగా నిధులు మంజూరవుతాయి. వివిధ పథకాల కింద ప్రతి పాఠశాలకు రూ. 10 నుంచి 20 వేల వరకు సాధారణ నిధులు మంజూరు కావడంతో పాటు రూ. లక్షల్లో అభివృద్ధి నిధులు కూడా మంజూరవుతాయి. గతేడాది వరకు పాఠశాలకు నిధులను డ్రా చేయటానికి హెచ్ఎంతో పాటు ఆదే పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడికి జాయింట్ చెక్ పవర్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయమై మండల విద్యాధికారి మాధవరెడ్డిని ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా ఎస్ఎంసీ చెర్మన్లకు జాయింట్ చెక్‌పవర్ గురించి రాజీవ్ విద్యామిషన్ నుంచి ఆదేశాలు వచ్చింది వాస్తవమేన న్నారు.