385 జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం
Published Sun, Sep 1 2013 2:00 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
మాచర్లటౌన్, న్యూస్‌లైన్: గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ హక్కులను భంగపరుస్తూ, వారి అధికారాన్ని, చెకపవర్‌ను రద్దుచేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. పట్టణంలోని తన కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్ల కిందట కాలపరిమితి పూర్తయిన పంచాయతీలకు ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారులకు పెత్తనం ఇచ్చి గ్రామాభివృద్ధిని కుంటుపర్చారని విమర్శించారు. సర్పంచ్‌లకు నిధులు లేకుండా జాయింట్ చెక్‌పవర్ పేరుతో జీవో నంబరు 385ను తెచ్చిందన్నారు. సర్పంచ్‌ను అవమాన పర్చే ఈ జీవోను వెంటనే రద్దు చేసి సర్పంచ్‌లకు పూర్తి స్థాయి చెక్‌పవర్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు జరపని కారణంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి, ఎస్‌ఎప్‌సీ గ్రాంటు ద్వారా రావాల్సిన కోట్ల రూపాయల నిధులు పంచాయతీలకు దక్కలేదన్నారు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పారు. మెజార్టీ స్థానాలు ప్రతిపక్ష పార్టీలకు దక్కటంతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాభివృద్ధిపై శీత కన్ను వేసి ఎన్నికలు పూర్తయి నెల రోజులైనా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. జిల్లాలోని సర్పంచ్‌లందరూ పార్టీలకు అతీతంగా ముందుకువచ్చి జీవో రద్దు గురించి పంచాయతీల్లో తీర్మానం చేసి కలెక్టర్, డీపీవోలకు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసం గ్రామ స్వరాజ్యం, సర్పంచ్‌ల అధికారం కోసం, గ్రామాభివృద్ధికి వైఎస్సార్‌సీపీ తరపున పోరాటం చేసి జీవోను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామన్నారు.
Advertisement
Advertisement