
నల్లగొండ : పల్లె పాలన ఇక పట్టాలెక్కనుంది. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇస్తూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసింది. సోమవారం నుంచి చెక్ జాయింట్ చెక్‌పవర్ విధానం అమల్లోకి రానుంది. చెక్ పవర్ ఇవ్వడంతో పంచాయతీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్ పవర్ ఉండగా, ఈ సారి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్‌ను ఇచ్చారు. కాగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌పై సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 844 పంచాయతీలు..
జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా 831 గ్రామ పంచాయతీలకు జనవరిలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధిక సర్పంచ్‌లు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం చెక్ పవర్‌ను సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వాలా..? సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు ఇవ్వాలా అనే అంశాలపై సమాలోచన చేసింది. మొన్నటి వరకు వరుసగా ఎన్నికలు రావడంతో.. కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో చెక్‌పవర్‌పై నిర్ణయం వెలువరించింది.
ఖాతాల్లోనే 14వ ఆర్థిక సంఘం నిధులు
పంచాయతీ ఎన్నికల ముందు గ్రామంలకు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. పాత సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోతున్నందున వారు నిధులు ఇష్టానుసారంగా డ్రా చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిపై ప్రీజింగ్ పెట్టింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా నాలుగున్నర నెలలుగా ఏ సర్పంచ్ కూడా ఖర్చు చేయలేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
అప్పులు చేసి పనులు చేపట్టిన సర్పంచ్‌లు..
ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వని కారణంగా ప్రస్తుత సర్పంచ్‌లు అప్పులు చేసి మరి గ్రామాల్లో పనులు చేపట్టారు. కొత్తగా ఎన్నిక కావడంతో.. పనులు చేయకపోతే చెడ్డ పేరు వస్తుందనే భయంతో గ్రామాల్లో పనులు చేప్టటేందుకు సొంతంగా నిధులు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడలేదు. వేసవి కావడంతో గ్రామాల్లో పెద్దయెత్తున నీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి అత్యవసర పనులకు అప్పులు చేయాల్సి వచ్చిందని.. పలువురు పేర్కొన్నారు.
అసంతృప్తిలో సర్పంచ్‌లు..
సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంపై సర్పంచ్‌లు అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ వేర్వేరు పార్టీలకు చెందినవారు ఉంటే.. పనులపై నిర్ణయం తీసుకోవడంలో, నిధులు విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కొందరు మాత్రం జాయింట్ చెక్ పవర్ ఉంటేనే.. పంచాయతీ పాలకవర్గమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గ్రామంలో ఏది అత్యవసరమైన పనో వాటిని చేపట్టేందుకు అవకాశం ఉండడంతో పాటు పనుల్లో కూడా అవతకవకలకు అవకాశం ఉండదని కొందరు పేర్కొంటున్నారు.
కార్యదర్శుల పర్యవేక్షణ..
ప్రభుత్వం నిధుల ఖర్చుపై ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని, చేయకపోతే కార్యదర్శిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా సమావేశాల తీర్మాణాలను కూడా నోటీస్ బో ర్డుపై ఉంచాల్సి ఉంటుంది. లేఅవుట్లు, భవన ని ర్మాణాల అనుమతులకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. తద్వారా పనులు గడువులోపు పూర్తికావడంతో పాటు గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వచ్చేఅవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment