కొత్త సర్పంచులకు సర్కారు షాక్
Published Tue, Sep 17 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: సర్పంచ్‌ల చెక్‌పవర్‌లో పంచాయతీ కార్యదర్శులకు వాటా కల్పి స్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 385పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఈ చర్య తమకు అవమానకరంగా భావిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ నిధుల వినియోగంలో సర్పంచ్‌ల చెక్ పవర్‌ను కుదిస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం 385 జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడిగా చెక్ పవర్ కల్పించారు. ఈ అంశమే సర్పంచుల ఆగ్రహానికి, నిరసనకు కారణమవుతోంది. కొత్త జీవో కారణంగా జనరల్ ఫండ్ ద్వారా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. 2011 ఆగస్టులో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు కొనసాగాయి.
ఎట్టకేలకు ఈ ఏడాది జులై నెలలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఆగస్టు మొదటి వారంలో కొత్త సర్పంచ్‌లు పదవీ ప్రమాణం చేశారు. అయితే పదవుల్లో కూర్చున్నామన్న ముచ్చట తీరకముందే చెక్ పవర్ కుదిస్తూ జీవో జారీ చేయడం ద్వారా ప్రభుత్వం వారికి షాకిచ్చింది. గ్రామ కార్యదర్శితో పాటు చెక్‌పవర్ పంచుకోవాలన్న విషయాన్ని సర్పంచ్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైన తమ అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేయడం సరైంది కాదని జిల్లాలోని సర్పంచ్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తమ హక్కులను కాలరాయడమేనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ సర్పంచ్‌తోపాటు ఒక వార్డు సభ్యుడికి ఉమ్మడిగా చెక్ పవర్ ఉండేదని సర్పంచ్‌లు గుర్తుచేస్తున్నారు. అయితే అలా చెక్‌పవర్ ఇవ్వాల్సిన సభ్యుడిని, మిగతా వార్డు సభ్యులందరూ కలసి ఎన్నుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా గ్రామ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిధుల వినియోగంలో కొందరు సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడ్డారని ఇటువంటి చర్యలు తీసుకోవడం అందరినీ అవమానించడమేనని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కక్ష సాధింపు చర్య
అవినీతికి పాల్పడ్డ సర్పంచ్‌లను వదిలేసి సర్పంచ్‌లందనీ అనుమానిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం శోచనీయం. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే. ప్రభుత్వం వెంటనే ఈ జీవో ఉపసంహరించుకోవాలి.
-గదిలి మల్లేశ్వరరావు, సర్పంచ్, గోపాలపెంట
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. దీనివల్ల అభివృద్ది కుంటుపడుతుంది. ఈ జీవోను రద్దు చేసి సర్పంచ్‌లకే పూర్తి స్థాయి అధికారాలు అప్పగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-బగ్గు అరుణ, సర్పంచ్, కొబగాం
Advertisement