- నిధుల వినియోగానికి సర్పంచ్‌తో పాటు కార్యదర్శి సంతకం తప్పనిసరి
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో నిర్వహించే పనులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వినియోగంలో జాయింట్ చెక్‌పవర్ విధానాన్ని అమలుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇక నుంచి గ్రామ పంచాయతీల పరిధిలో పనులకు నిధుల వినియోగం కోసం సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శి సంతకం తప్పనిసరి కానుంది.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి నిమిత్తం అంతర్గత రహదారులు, మరమ్మతు పనులు, పారిశుధ్యం, వీధి దీపాలు, పంచాయతీ భవనాలు తదితర కార్యక్రమాలకు 13వ ఆర్థిక సంఘం, బీఆర్‌జీఎఫ్, ఆర్‌జీపీఎస్‌ఏ పథకాల నుంచి నిధులు విడుదలయ్యాయి. అయితే పలు గ్రామాల పంచాయతీలు గ్రాంట్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదని తేలింది.
కొన్ని పంచాయతీల్లో నిబంధనలను పాటించకుండా నిధులు వినియోగిస్తున్నారని, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి సంతకం తప్పనిసరి చేస్తూ.. జాయింట్ చెక్ పవర్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అయితే తాజా ఉత్తర్వులపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్‌లను అవమానించడమే..
సర్పంచ్‌ల అధికారాలను కత్తిరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కచ్చితంగా వారిని అవమానించడమేనని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సి. సత్యనారాయణరెడ్డి అన్నారు. అవకతవకలను అరికట్టేందుకు అంబుడ్స్‌మన్ వంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశమున్నా.. అధికారాన్ని కార్యదర్శులకు కట్టబెట్టడం సరికాదని తెలిపారు. సీఎం చంద్రశేఖర్‌రావు గ్రామసర్పంచ్‌లకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కారని విమర్శించారు.