నిజామాబాద్–డోన్ డబ్లింగ్‌కు330 కోట్లు అదనంగా కేటాయింపు
కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు మరో రూ. 190 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులో దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులను రైల్వేశాఖ రూ. 1,350.26 కోట్ల మేర పెంచింది. మధ్యంతర బడ్జె ట్‌లో దక్షిణమధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని 15,583.10 కోట్లకు పెంచింది. మొత్తంగా నిధులు పెంచడంతోపాటు ప్రాజెక్టులవారీగా మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలను కూడా సవరించింది.
బైపాస్ లైన్లకు నిదుల పెంపు..
జంక్షన్ స్టేషన్‌ల సమీపంలో రైల్వే ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బైపాస్ లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. వేగంగా పనులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సవరించిన బడ్జెట్‌లో నిధులు పెంచింది.
దక్షిణమధ్య రైల్వేకు తొలుత రూ. 2,905 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 3,629 కోట్లకు పెంచింది. అలాగే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ పనులకు రూ. 113.64 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. ట్రాక్ సామర్థ్యం పెంపు పనులకు తొలుత రూ. 1,530 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని రూ. 1,930 కోట్లకు పెంచింది.
కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు పెరిగిన నిధులు
దక్షిణాది–ఉత్తరాదిని జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్‌లో భాగంగా ఉన్న కాజీపేట–విజయవాడ మార్గంలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు రైళ్ల వేగాన్ని కూడా పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం మూడో మార్గాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏడాదిలో పనులు ముగించేలా చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు మధ్యంతర బడ్జెట్‌లో రూ.310 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని రూ. 190 కోట్ల మేర పెంచి రూ. 500 కోట్ల కేటాయింపులు చేసింది.
మరోవైపు నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలోని అకోలా నుంచి డోన్ వరకు విస్తరించిన ప్రాజెక్టు. ఇందులో సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తవగా ఎగువ ప్రాంతంలో జరుగుతున్నాయి. నిజామాబాద్–సికింద్రాబాద్ మధ్య జరగాల్సి ఉంది. ఈ పనులకు తొలుత రూ. 220 కోట్లు ప్రతిపాదించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 550 కోట్లకు పెంచడం విశేషం.
బీబీనగర్–గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండటంతో ఆ మార్గంలో రైళ్ల సంఖ్య, వాటి వేగం పెంపు సాధ్యం కావట్లేదు. దీంతో ఈ మార్గంలో రెండోలైన్ నిర్మించే ప్రాజెక్టు గత బడ్జెట్‌లో మంజూరైంది. ఆ పనులకు మధ్యంతర బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 220 కోట్లకు పెంచారు.
ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల్లో కోత..
పురోగతి అంతంతమాత్రంగానే ఉన్న భద్రాచలం–డోర్నకల్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కుదించింది. రూ. 100 కోట్ల కేటాయింపులను రూ. 50 కోట్లకు తగ్గించింది. అలాగే హైదరాబాద్‌లో కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు కేటాయించిన నిధులను రూ. 50 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు కుదించింది.
Comments
Please login to add a commentAdd a comment