బడ్జెట్ నిధులతో నిమిత్తం లేకుండా, పనుల వేగాన్ని బేరీజు వేసుకుంటూ..
కేటాయింపులో కొత్త విధానం అవలంబిస్తున్న కేంద్రం
అలా ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అదనంగా రూ.1,350 కోట్లు
ఈసారీ అలాగే చేస్తుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులతో ప్రమేయం లేకుండా, పనుల వేగాన్ని బేరీజు వేసుకుంటూ కేంద్రం అప్పటికప్పుడు నిధులు కేటాయిస్తోంది. ఈసారి కూడా అదే పంథాను అవలంబించే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్‌లో కొత్త రైళ్ల ప్రకటనపై అంతగా దృష్టి సారించని కేంద్రం, కొత్త లైన్లను పూర్తి చేయడానికే ప్రాధాన్యమిస్తోంది. కొత్త రైళ్లను మాత్రం వీలు చిక్కినప్పుడు ప్రారంభిస్తోంది. గత బడ్జెట్‌లో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను ఆ తర్వాత ఉన్న ఫళంగా పెంచింది.
దీంతో ఆ ప్రాజెక్టుల్లో పనులు వేగంగా జరిగేందుకు అవకాశం చిక్కింది. గత బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా, ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టుల నిధులను పెంచింది. అలా జోన్‌కు అదనంగా రూ.1350.26 కోట్ల మేర నిధులు అందాయి. ముఖ్యంగా, అతి కీలక మూడో లైన్ నిర్మాణ పనులకు కేటాయింపులు పెంచింది. కాజీపేట–బల్లార్షా పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కాజీపేట–విజయవాడ మూడోలైన్ పనుల్లో దాదాపు 100 కి.మీ. పనులు చేయాల్సి ఉంది.
వీటి వేగం పెంచటం ద్వారా, ఆ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు దానికి రూ.190 కోట్లను అదనంగా కేటాయించింది. బడ్జెట్‌లో రూ.310 కోట్లు ప్రతిపాదించగా, ఆ తర్వాత దాన్ని రూ.500 కోట్లకు పెంచింది. ఫలితంగా ఈ ఏడాది కాలంలో ఏకంగా 60 కి.మీ. మేర మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. ఇందులో 40 కి.మీ.కు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ పూర్తి చేసి పచ్చజెండా ఊపటంతో అంతమేర ట్రాక్‌పై రైళ్లను కూడా తిప్పుతున్నారు. మిగతా 20 కి.మీ. పనులకు సంబంధించి సేఫ్టీ కమిషనర్ తనిఖీ జరగాల్సి ఉంది.
ఈసారి కేటాయింపులు వేటికి?
డోన్–అకోలా డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మన రాష్ట్రంలో నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తికాగా, మిగతా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. గత బడ్జెట్‌లో ఈ పనులకు రూ.220 కోట్లు ప్రతిపాదించగా, తర్వాత దాన్ని ఏకంగా రూ.550 కోట్లకు పెంచారు. దీంతో గత ఏడాది కాలంలో 45 కి.మీ. డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో వికారాబాద్–కృష్ణా లైన్‌పై విన్నపాలు వచ్చాయి. దీనికి ఈసారి కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. రామగుండం–మణుగూరు, సికింద్రాబాద్–వాడీ మూడు, నాలుగు లైన్లకు నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment