![Budget 2023: No New Train Service For Hyderabad in Last 10 Years - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/3/Train.jpg.webp?itok=PI2MM_Y8)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి రోజూ సుమారు 3 లక్షల మంది రైళ్లలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మరో 50 వేల మంది వరకు వెయిటింగ్ జాబితాలో నిరీక్షిస్తున్నారు. పండగలు, వరుస సెలవులు వస్తే ఈ జాబితా రెట్టింపవుతుంది. రద్దీ ఉంటే అరకొరగా ప్రత్యేక రైళ్లు నడపడం మినహాయించి ఈ పదేళ్ల కాలంలో ఒకటి, రెండు మినహాయించి కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని ఆ మేరకు కొత్త రైళ్లను వేయాల్సి ఉండగా.. ఈ ప్రక్రియకు రైల్వే చాలా ఏళ్ల క్రితమే తిలోదకాలిచ్చింది. దీంతో ఒకవైపు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అందుకనుగుణంగా రైళ్లు మాత్రం పెరగడం లేదు. కేవలం 85 ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి.
కసరత్తు ఏదీ..
ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి ప్రజాభిప్రాయం వెలువడే విధంగా ఏర్పాట్లు చేసే దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఆ పద్ధతిని సైతం విస్మరించింది. ఎంపీల సమావేశం నిర్వహించలేదు. మరోవైపు రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్‌లో విలీనం చేసిన తర్వాత రైల్వేల ప్రాధాన్యం బాగా పడిపోయిందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జోన్ పరిధిలోని, డివిజన్ పరిధిలో క్రమం తప్పకుండా రైల్వే వినియోగదారుల సమావేశాలను నిర్వహించే అధికారులు ఆ సాంప్రదాయాన్ని కూడా పాటించడం లేదు.
ఇలా ప్రయాణికుల అవసరాలను తెలుసుకొనేందుకు ఎలాంటి కసరత్తులు చేపట్టకపోవడంతో ప్రధాన బడ్జెట్‌లో రైల్వేల అంశం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పాట్నాకు అరకొర రైళ్లే ఉన్నాయి. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మినహాయించి పెద్దగా
అందుబాటులో లేవు. ఈ రూట్‌లో అదనంగా రైళ్లను నడపాలని పదేళ్లుగా ప్రయాణికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి షిరిడీకి ఒక్క రైలు మాత్రమే నడుస్తోంది. వేలాది మంది భక్తులు సందర్శించే షిరిడీకి తగినన్ని రైళ్లు లేకపోవడం వల్ల ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సి వస్తోంది.
నో కనెక్టివిటీ..
పట్టణాలు, నగరాల నుంచి రాజధానికి రైల్ కనెక్టివిటీ పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, దూరప్రాంతాల రైళ్లపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా ఇంటర్‌సిటీ రైళ్లను, ప్యాసింజర్ రైళ్లను పెంచాలని ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సైతం ప్రతి సంవత్సరం వినతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్, వరంగల్, తాండూరు, వికారాబాద్, నిజామాబాద్, తదితర ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రతి రోజు నగరానికి వచ్చి తిరిగి సాయంత్రం తమ ఊళ్లకు వెళ్లిపోయే ఈ ప్రయాణికులంతా సరిపడా రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది.
పెరిగిన చార్జీల భారం..
► ప్రతి రోజు ఉదయం కాజీపేట నుంచి నగరానికి వచ్చే పుష్‌ఫుల్ ట్రైన్ ప్రయాణికుల్లో చాలా మంది తిరిగి సాయంత్రం తమ ఊళ్లకు బయలుదేరి వెళ్తారు. వరంగల్, మడికొండ, ఘన్‌పూర్,రఘునాథ్‌పల్లి, జనగామ, తదితర ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మందికి పైగా నెలవారీ పాస్‌లపైన రాకపోకలు సాగిస్తారు.
► మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ చుట్టుక్కల ప్రాంతాల నుంచి మరో 7 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తారు. వికారాబాద్, తాండూర్, తదితర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ ఉంటుంది.
► గతంలో ఆలేరు నుంచి హైదరాబాద్‌కు కేవలం రూ.250 నెలవారీ పాస్‌తో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రూ.1000కి పైగా ఖర్చు చేయాల్సివస్తోంది. (క్లిక్ చేయండి: మెరుపు సమ్మెపై మెట్రో యాజమాన్యం స్పందన)
Comments
Please login to add a commentAdd a comment