సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వందేభారత్ రైళ్లకు ఇటీవల భద్రతా తనిఖీలను నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
మొదట హైదరాబాద్ నుంచి ముంబై, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం మార్గాల్లో వందేభారత్ రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం దశలవారీగా సికింద్రాబాద్–షిరిడీ, సికింద్రాబాద్–బెంగళూరు మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుండగా వందేభారత్ రైళ్లు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ–వారణాసి మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కాగా, కొత్తగా రానున్న రైళ్ల వేగాన్ని మరో 15 కిలోమీటర్లు అదనంగా పెంచారు. దీంతో రద్దీ మార్గాల్లో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
పడిగాపులకు ఫుల్‌స్టాప్
హైదరాబాద్ నుంచి విశాఖ, ముంబై, బెంగళూరు, షిరిడీకి ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. కనీసం మూడు నెలల ముందే రిజర్వేషన్‌లు బుక్ చేసుకోవలసి వస్తుంది. సాఫ్ట్‌వేర్ నిపుణులు, వ్యాపారవర్గాల డిమాండ్ ఎక్కువ. ఈ రూట్లలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా రైళ్ల కోసం పడిగాపులు కాసే బాధ తప్పుతుంది.
వందేభారత్ ప్రత్యేకతలివే..
►గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
►ఈ రైళ్లలో ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 లైట్లు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఈ లైట్లు ఉపయోగపడతాయి.
►కోచ్‌లకు బయటవైపు నుంచి 4 కెమెరాలు ఉంటాయి. వెనుక వైపు నుంచి మరొకటి ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 అత్యవసర ద్వారాలు ఉంటాయి. కోచ్‌లు పూర్తిగా ఏసీ సదుపాయం కలిగి ఉంటాయి. అత్యుత్తమ కోచ్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
►ప్రతి కోచ్‌లో 32 ఇంచ్‌ల స్క్రీన్‌తో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉంటుంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటుచేసిన అగ్నిమాపక పరికరాలు కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేస్తాయి. వరదలను సైతం తట్టుకొనేవిధంగా వీటిని రూపొందించారు. n ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనకుండా అరికట్టే కవచ్ వ్యవస్థతో ఈ రైళ్లను అనుసంధానం చేశారు. ఈ రైళ్లలో అంధుల కోసం ప్రత్యేక సీట్లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment