Nagpur-Hyderabad Vande Bharat Express To Be Introduced Soon - Sakshi
Sakshi News home page

త్వరలో సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ మధ్య.. వందేభారత్‌

Published Sat, May 27 2023 3:34 AM | Last Updated on Sat, May 27 2023 10:59 AM

Nagpur Hyderabad Vande Bharat express is introduced soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు త్వరలో మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాబోతోంది. హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ మధ్య ఈ రైలు ప్రారంభం కానుంది. ఈ సంవత్సరారంభంలో దక్షిణమధ్య రైల్వేకు మూడు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే బోర్డు మంజూరు చేసింది. అందులో తొలి రైలు సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య సంక్రాంతి రోజున ప్రారంభమవగా ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైంది.

మూడో వందేభారత్‌ రైలు హైదరాబాద్‌–పుణే మధ్య ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు దానికంటే ముందు నాగ్‌పూర్‌తో అనుసంధానం తెరపైకి వచ్చింది. దీనికి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడపాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.  

తగ్గనున్న ప్రయాణ సమయం.. 
నాగ్‌పూర్‌–హైదరాబాద్‌ మధ్య ఇప్పటివరకు శతాబ్ది, రాజధాని లాంటి ప్రీమియర్‌ కేటగిరీ రైళ్లు లేవు. సాధారణ రైళ్లు ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్నా ఇరు నగరాల మధ్య 581 కి.మీ. దూరం ఉండటంతో ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంటోంది.

దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే వ్యాపార బంధం మరింత దృఢంగా మారుతుందన్న ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ ప్రాంతానికి చెందిన ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుదీర్‌ ముంగంటివార్‌ ఇటీవల రైల్వే మంత్రిని కలిసి వందేభారత్‌ రైలును కోరారు. విదర్భలోని వార్ధా ఎంపీ రామ్‌దాస్‌ కూడా ఈ మేరకు విన్నవించారు. వాటికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

తాత్కాలిక టైంటేబుల్‌ ఇలా... 
ప్రతిపాదిత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తాత్కాలిక టైంటేబుల్‌ను అధికారులు రూపొందించారు. దీని ప్రకా రం రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30కు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. మళ్లీ మధ్యాహ్నం 1:30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్‌ చేరుకుంటుంది.

వారంలో ఆరు రోజులు ఈ రైలు తిరగనుంది. బల్లార్షా, సిర్పూర్, కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేటల్లో ఈ రైలుకు తాత్కాలిక స్టాప్‌లను కేటాయించారు. ఎకానమీలో రూ.1,450– రూ.1,550, ఎగ్జిక్యూటివ్‌లో రూ.2,750–రూ.2,850 వరకు చార్జీలను ఖరారు చేసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement