సాక్షి, హైదరాబాద్: ‘పొగబండి’కి ఇక కాలం చెల్లే రోజు దగ్గరలోనే ఉంది. రైలు అనగానే గుప్పుగుప్పున పొగ వదులుతూ ఉండే ఇంజిన్ ఇక కనిపించదు. వాటి స్థానంలో అన్నీ కరెంటు ఇంజిన్లే కనిపించబోతున్నాయి. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’ను లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే.. అన్ని మార్గాలను విద్యుదీకరించనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వచ్చే రెండుమూడేళ్లలో దీన్ని సాధించేదిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా విద్యుదీకరించే పని జరుగుతుండగా, తాజాగా దీన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.178 కోట్లను జోన్ పరిధిలో దీని కోసం ఖర్చు చేయబోతున్నారు.
ఒకేసారి అన్ని సెక్షన్‌లలో పనులు...
గతంలో ఏదో ఒక సెక్షన్‌కు నిధులు కేటాయిస్తే దాని పరిధిలో విద్యుదీకరణ పనులు జరిగేవి. కానీ ఇప్పుడు ఒకేసారి అన్ని సెక్షన్‌లలో పనులు జరుపుతున్నారు. ఒక స్టేషన్‌లో రైలు వెళ్లిపోగానే, తదుపరి రైలు వచ్చేలోపు కొంత పని చేస్తున్నారు. ఆ తర్వాత తదుపరి రైలు దాటిపోగానే మళ్లీ కొనసాగిస్తున్నారు. ఇలా రైళ్ల ప్రయాణానికి ఆటంకం లేకుండా పనులు జరుపుతున్నారు. ఒకేసారి అన్ని సెక్షన్‌లలో ఈ తరహాలో ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతుండటంతో వేగంగా లక్ష్యం చేరుకునేందుకు అవకాశం కలిగింది.
ఇటీవల నడికుడి–మాచర్ల, పగిడిపల్లి–గుంటూరు, పెద్దపల్లి–లింగంపేట జగిత్యాల మధ్య విద్యుదీకరణ పూర్తి చేశారు. సికింద్రాబాద్–డోన్, మన్నాడ్–బొల్లారం మధ్య ఇప్పటి వరకు ఎక్కడా విద్యుదీకరణ జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ మారిపోనున్నాయి. మొత్తం లైన్లు విద్యుదీకరణ పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజిన్లను కూడా కరెంటుతో నడిచేలా మార్పు చేయనున్నారు. ఆ పరిజ్ఞానం కోసం రైల్వే ప్రయత్నిస్తోంది. జోన్ పరిధిలో ప్రస్తుతం కరెంటు లోకోమోటివ్స్ 700 ఉంటే, డీజిల్ ఇంజిన్లు 600 ఉన్నాయి. ఇక కాజీపేట, మౌలాలి, విజయవాడ, గుత్తి, గుంతకల్‌లో ఉన్న డీజిల్ వర్క్‌షాపులను విద్యుత్ లోకోమోటివ్ వర్క్‌షాపులుగా మార్చే పని మొదలైంది.
ఇవీ ఉపయోగాలు...
భారీ ఆదా...
వంద కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ ఇంజిన్ రూ.65 వేల ఇంధనాన్ని ఖర్చు చేస్తోంది (వేగాన్ని బట్టి ఈ మొత్తం మారుతుంది). అదే కరెంటు లోకోమోటివ్ రూపంలో ఈ ఖర్చు 45 వేలే అవుతుంది. ఈ రూపంలో రైల్వే భారీగా ప్రజాధనాన్ని పొదుపు చేసే అవకాశం ఉంటుంది.
తగ్గనున్న కాలుష్యం...
డీజిల్ లోకోమోటివ్స్ నుంచి పొగ విపరీతంగా వస్తుంది. ఇది వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను భారీగా విడుదల చేస్తుంది. దీంతోపాటు డీజిల్ ఇంజిన్ చేసే శబ్దం కూడా ఎక్కువ. కరెంటు ఇంజిన్లతో వాతావరణ కాలుష్యం నామమాత్రం కానుండగా, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది.
ఇంజిన్ మార్చే సమస్యకు చెల్లు..
కొన్ని మార్గాల్లో కొంతమేర విద్యుదీకరించినందున చాలా రైళ్లకు ఆ మేర విద్యుత్ లోకోమోటివ్, మిగతా ప్రయాణానికి డీజిల్ ఇంజిన్ వాడుతున్నారు. ఏదో ఒకచోట ఇంజిన్లను మార్చాల్సి రావటం ఇబ్బందిగా మారింది. ఇది ప్రయాణికులకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తోంది. దీనికి ఫుల్‌స్టాప్ పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment