దక్షిణ మధ్య రైల్వేలో నడపాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదన
100– 250 కిలోమీటర్ల పరిధిలో తిరిగే నమోభారత్ రైళ్లు
హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు నడపాలని వినతులు
2024–25 బడ్జెట్‌లో వస్తాయని ఆశించినా ఇవ్వని కేంద్రం
వచ్చే బడ్జెట్‌లో అయినా ఇస్తారని ఆశలు
నమో భారత్ వస్తే పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్.. సమీప నగరాలను, పట్టణాలను చుట్టేసే ఇంటర్ సిటీ రైలు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల కోసం హైదరాబాద్ ఎదురుచూస్తోంది. గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లను, హైదరాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోనూ అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదన రెండేళ్ల నుంచే ఉంది.
వందేభారత్ తరహాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లు, గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని మొదట వందే మెట్రో రైళ్లుగా పిలిచారు. అనంతరం నమో భారత్ ర్యాపిడ్ రైళ్లుగా పేరు మార్చారు.
అహ్మదాబాద్–భుజ్ స్టేషన్ల మధ్య మొట్టమొదటి నమో భారత్ రైలు పట్టాలెక్కింది. గత సంవత్సరమే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయని భావించినా వీలు కాలేదు. వచ్చే బడ్జెట్‌లో అయినా మనకు వీటిని కేటాయిస్తారని ప్రజలు ఆశపడుతున్నారు.
సామాన్యుల రైళ్లు..
నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 250 కిలోమీటర్ల దూరం వరకు నడపాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, భద్రాచలం, కర్నూల్, మహబూబ్‌నగర్, గజ్వేల్, వికారాబాద్, తాండూర్‌తోపాటు ప్రస్తుతంఇంటర్ సిటీ రైళ్లు నడుస్తున్న సికింద్రాబాద్–విజయవాడ మధ్య కూడా ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది.
గతంలో జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలోనూ ఇంటర్ సిటీ రైళ్లుగా వీటిని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు వీటిని నడపడం వల్ల ప్రజలు తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.
కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఇంటర్ సిటీ లేదా మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని 12 సంవత్సరాల క్రితం ప్రతిపాదించినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం నమో భారత్‌ను ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌గా నడపాలనే డిమాండ్ ఉంది.
సామాన్య, మధ్య తరగతివారికి ఉపయోగపడే తక్కువ దూరం నడిచే పుష్‌పుల్ మెము, ఇంటర్ సిటీ, నమో భారత్ ర్యాపిడ్, వందే సాధారణ్ (అమృత్ భారత్) ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్–మనోహరాబాద్–కొత్తపల్లి రూట్లో రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి వెళ్లే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
స్టాండింగ్ జర్నీకి అవకాశం..
ప్రస్తుతం ఎంఎంటీఎస్ వంటి లోకల్ రైళ్లు నడుస్తున్నట్లుగానే వందే మెట్రోలు రాకపోకలు సాగిస్తాయి. ఒక బోగీలో 100 మంది కూర్చొనే సదుపాయం ఉంటుంది. వీటిలో కనీసం 200 మంది నిలబడి ప్రయాణం చేయవచ్చు. ఆటోమెటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను నివారించే కవచ్ సాంకేతికతతో వీటిని అనుసంధానం చేశారు. ప్రతి బోగీలో సీసీటీవీ నిఘా ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భద్రత లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment