వరుస సెలవులతో నేటి నుంచి సోమవారం వరకు అధిక రద్దీ
ఎంపీల డిమాండ్‌తో కొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించిన ద.మ.రైల్వే
జోన్ పరిధిలో ప్రస్తుతం బెడ్‌రోల్స్‌కు కొరత
వాటిల్లో బెడ్‌రోల్స్ సరఫరా చేయలేమని రైల్వే అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు నడిపే స్పెషల్ రైళ్లలో బెడ్‌రోల్స్‌కు కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉన్న బెడ్ రోల్స్ సంఖ్య, వాటిని శుభ్రపరిచి తిరిగి అందించే లాండ్రీల సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడటమే దీనికి కారణం. రెగ్యులర్ రైళ్లు, సంవత్సరం పొడవునా నిర్వహించే సాధారణ స్పెషల్ రైళ్లకు ఇవి సరిపోతుండగా, ఉన్నట్టుండి వచ్చే రద్దీ ఆధారంగా నడిపే స్పెషల్ రైళ్లకు ఈ సమస్య ఏర్పడుతోంది.
ఐదు రోజుల వరుస సెలవులతో..
పంద్రాగస్టు నేపథ్యంలో గురువారం దేశవ్యాప్త సెలవు ఉంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దీంతో రాకపోకలు బాగా పెరుగుతాయి. శనివారం వారాంతం కావటంతోపాటు ఆదివారం పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో శనివారం ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉండనుంది. ఆదివారం ఎలాగూ సెలవు, ఆ రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి.
సోమవారం రాఖీ పౌర్ణమి.. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో.. మరిన్ని స్పెషల్ రైళ్లు నడపాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 15 మంది పార్లమెంటు సభ్యులు విన్నప లేఖలు పంపారు. ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ వచ్చి0ది. దీంతో అందుబాటులో రేక్స్ తక్కువగా ఉండటంతో.. కొన్ని స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
స్పెషల్ రైళ్లు ఇవే..
18న నర్సాపూర్–సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్–నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్‌సోల్, కాచిగూడ–తిరుపతి మధ్య వీటిని నడుపుతున్నారు. వీటన్నింటిలో ఏసీ కోచ్‌లున్నాయి.
కానీ, వాటిల్లోని ప్రయాణికులకు బెడ్‌రోల్స్‌ను సర్దుబాటు చేయలేమని నిర్ణయించుకున్న దక్షిణ మధ్య రైల్వే, బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లలో బెడ్ రోల్స్‌ను సరఫరా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రయాణికులే సొంత ఏర్పాట్లతో రావాలన్నది దాని పరోక్ష సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment