
రంజాన్ బజార్‌లో ఈవెంట్ మేనేజర్ హల్‌చల్
గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో ఘటన
రెండు స్టాళ్ల నిర్వాహకుల మధ్య గొడవే కారణం
పోలీసుల అదుపులో నిందితుడు
గోల్కొండ: గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్ గార్డెన్‌లో దావత్ – ఎ– రంజాన్ షాపింగ్ ఎక్స్‌పోలో శనివారం రెండు స్టాళ్ల నిర్వాహకుల మధ్య జరిగిన గొడవ గాలిలోకి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో దావత్– ఎ– రంజాన్ పేరుతో రంజాన్ షాపింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్స్‌పో శుక్రవారం రాత్రి ముగిసింది. శనివారం ఉదయం నిర్వాహకులు తమ స్టాళ్లను తొలగిస్తున్నారు. కాగా..
ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్ సోదరులు బొమ్మల షాపు నిర్వహిస్తుండగా.. వీరి స్టాల్ పక్కనే దుబాయ్‌కి చెందిన తౌఫిక్ అనే వ్యక్తి పర్‌ఫ్యూమ్ షాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫారూక్ అహ్మద్ తనకు ఒక పర్‌ఫ్యూమ్ బాటిల్ ఇవ్వాలని తౌఫిక్‌ను అడుగుతున్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ స్టాళ్లను ధ్వంసం చేయసాగారు. పర్‌ఫ్యూమ్ స్టాల్ నిర్వాహకుడు తౌఫిక్ ఈవెంట్ ఆర్గనైజర్ అయిన మీర్ హసీబుద్దీన్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తమపైనే షికాయత్ చేస్తావా అంటూ ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్‌లు కలిసి తౌఫిక్‌పై దాడికి వెళ్లారు.
వీరి మధ్య పరస్పరం తోపులాట చోటుచేసుకుంది. ఇది గమనించిన ఈవెంట్ ఆర్గనైజర్ మీర్ హసీబుద్దీన్ తనపై కూడా దాడి జరగవచ్చనే అనుమానంతో తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే స్టాళ్లను తొలగించిన వ్యాపారులు, వారి సహాయకులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన మీర్ హసీబుద్దీన్ నుంచి రివాల్వర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.