
పదేళ్లలో రూ.1,90,00,000 కోట్లకు రిటైల్
2024లో రూ.82,00,000 కోట్ల వ్యయం
సాక్షి, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, డిజిటల్ అవగాహన కలిగిన యువ కస్టమర్లు, విస్తరిస్తున్న మహిళా శ్రామిక శక్తి.. ఇంకేముంది బోలెడంత షాపింగ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వినియోగదార్లు గత ఏడాది రూ.82,00,000 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. మన దేశంలోకి విదేశీ కంపెనీల రాక, అలాగే బీటూసీ బ్రాండ్లు వెల్లువెత్తడం, మారుతున్న ప్రజల అభిరుచులతో రిటైల్ మార్కెట్ అంచనాలను మించి రికార్డులను సృష్టిస్తోంది. వచ్చే దశాబ్దంలో భారతీయ రిటైల్ మార్కెట్ ఏటా 8.8 శాతం వృద్ధి చెంది 2034 నాటికి రూ.1,90,00,000 కోట్లు మించిపోనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త నివేదిక వెల్లడించింది.
రిటైల్ రంగం పరుగెడుతోంది..
ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతి
2014లో రూ.35,00,000 కోట్ల నుంచి వార్షిక ప్రాతిపదికన రిటైల్ రంగం ఏటా 8.9 శాతం దూసుకెళ్లిందంటే కొనుగోలు తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవచ్చు. జీవనశైలి, వినోదం కోసం చేస్తున్న వ్యయాలు ఏటా 10 శాతం పెరిగాయి. వ్యవస్థీకృత రిటైల్‌లో పెట్టుబడులు 2014–2024 మధ్య రెండింతలయ్యాయి. ఈ కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో 30 శాతం వృద్ధి నమోదైంది. వినియోగానికి అనుగుణంగా రిటైల్ రంగం పరుగెడుతోంది. భారతదేశ వినియోగ వృద్ధి ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అంచనా. 32.5 కోట్లుగా ఉన్న గృహాల సంఖ్య 2034 నాటికి 40.7 కోట్లకు చేరుకోనుందని నివేదికలు చెబుతున్నాయి.
విదేశీ బ్రాండ్లకు సై..
ప్రపంచీకరణ, విదేశీ
బ్రాండ్ల పట్ల భారతీయులు సాను కూలంగా భావిస్తున్నారు. గ్లోబల్ బ్రాండ్లకై వినియోగ దారుల డిమాండ్‌ను తీర్చడానికి గడిచిన నాలుగు సంవత్సరాల్లో భారత్‌కు 60కిపైగా విదేశీ సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి.
ఆర్థిక స్తోమతనుబట్టి..
వినియోగదార్ల కొనుగోళ్లను నిర్ణయి స్తున్న అంశాలు ఆర్థిక స్తోమతనుబట్టి మారు తున్నాయి. దిగువ మధ్యతరగతి కస్టమర్లలో అత్యధికుల షాపింగ్‌ను ధర ప్రభావితం చే స్తోంది. మధ్య తరగతి, అధిక ఆదాయ కుటుంబాల్లో ఎక్కువ మంది ఫీచర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
కొనుగోలు నిర్ణయం ఇలా..
ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే అత్యధికులు ఆఫ్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. అంటే ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను చూసి, ముట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నారన్న మాట. మిశ్రమ మార్గాలలో అంటే నేరుగా షాప్‌కు వెళ్లి వస్తువులను పరిశీలించి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం లేదా ఆన్‌లైన్‌లో పరిశోధించి ఆఫ్‌లైన్‌లో కొనడం.
లోకల్‌కే మొగ్గు..
భారతీయ బ్రాండ్లు, స్థానిక ఉత్పత్తులను కొనడానికి జనం ఇష్టపడుతున్నారు. 2016 నుండి భారత్‌లో 600లపైచిలుకు స్వదేశీ డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీటీసీ) బ్రాండ్లు ఉద్భవించాయి.
Comments
Please login to add a commentAdd a comment