డిమాండ్‌కే ‘లైన్‌’!  | GM Sanjeev Kishore React On Railway Union Budget | Sakshi
Sakshi News home page

డిమాండ్‌కే ‘లైన్‌’! 

Published Fri, Feb 4 2022 3:40 AM | Last Updated on Fri, Feb 4 2022 8:36 AM

GM Sanjeev Kishore React On Railway Union Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. కొన్నేళ్లుగా పాత ప్రాజెక్టులపై పూర్తిపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టగా.. ఈసారి కూడా అదే పంథాను అనుసరించింది. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు మంజూరు చేసి, చాలీచాలకుండా నిధులిస్తూ ఏళ్లకేళ్లు కొనసాగించడానికి భిన్నంగా.. కొత్తప్రాజెక్టుల మంజూరును దాదాపు నిలిపివేసింది. పనులు నడుస్తున్నవాటికే.. అందులోనూ ఎక్కువ డిమాండ్‌ ఉన్న, నిర్వహణపరంగా ఆచరణీయమైన వాటికే గణనీయంగా నిధులు కేటాయించింది.

రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల అవసరమున్నా, వాటికోసం ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు పంపినా.. కేంద్రం వాటి జోలికి వెళ్లలేదు. మూడు రోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని రైల్వే పద్దు వివరాలను గురువారం మధ్యాహ్నం దక్షిణమధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిశోర్‌ వెల్లడించారు. ఇందులో ఒక్క కొత్త ప్రాజెక్టు లేకపోవడం ఉసూరుమనిపించినా.. కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రం గత బడ్జెట్‌ కంటే రూ.628 కోట్లు ఎక్కువగా కేటాయించటం ఊరటనిచ్చింది. ముఖ్యంగా కీలకమైన బల్లార్షా–కాజీపేట– విజయవాడ మూడోలైన్‌ నిర్మాణం, విద్యుదీకరణ పనులకు రైల్వే ప్రాధాన్యం ఇచ్చింది. మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టుకు గతంలో కంటే నిధులు తగ్గినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనులకు ఇబ్బందిలేదని అధికారులు చెప్తున్నారు.

ముఖ్యమైన ప్రాజెక్టులకు కేటాయింపులివీ
మునీరాబాద్‌–మహబూబ్‌నగర్‌ కొత్తలైన్‌: రూ.289 కోట్లు 
244 కి.మీ. పొడవైన ప్రాజెక్టును 1997–98లో రూ.1,723 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. ఈ మార్గంలో 66 కిలోమీటర్లు దక్షిణ మధ్య రైల్వే (తెలంగాణ) పరిధిలో ఉంది. ఇందులో దేవరకద్ర–మక్తల్‌ సెక్షన్ల మధ్య 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయి మార్గం ప్రారంభమైంది. కృష్ణ–మక్తల్‌ మధ్య 26 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. 

భద్రాచలం–సత్తుపల్లి: రూ.163 కోట్లు 
54 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2010–11లో రూ.928 కోట్ల వ్యయంతో మంజూరైంది. రైల్వే –సింగరేణి భాగస్వామ్యంతో చేపట్టారు. భద్రాచలం–చంద్రుగొండ సెక్ష¯న్‌లో 25.1 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగతా సెక్షన్లలో పనులు చివరి దశలో ఉన్నాయి. 

అక్కన్నపేట–మెదక్‌: రూ.41 కోట్లు. 
17 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2012–13లో మంజూరైంది. ఖర్చులో 50 శాతం భరించేలా రాష్ట్రం ఉచితంగా భూమిని కేటాయించింది. పనులు ముగింపు దశలో ఉన్నాయి. 

కాజీపేట–విజయవాడ మూడో లైన్‌: రూ.592.5 కోట్లు 
220 కిలోమీటర్ల పొడవైన ఈ మూడో లైన్‌ 2012–13లో రూ.1,953 కోట్లతో మంజూరైంది. విజయవాడ–కొండపల్లి మధ్య 17.5 కిలోమీటర్ల పనులు చివరిదశలో ఉన్నాయి. కొండపల్లి–ఎర్రుపాలెం సెక్షన్‌లో, కాజీపేటలో యార్డ్‌ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 

కాజీపేట–బల్లార్షా 3వ లైన్‌: రూ.550.43 కోట్లు 
201 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు 2015–16లో రూ.2,063 కోట్ల వ్యయంతో మంజూరైంది. రాఘవాపురం–పోత్కపల్లి విరూర్‌–మానిక్‌ఘడ్‌ మధ్య 50 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగతా సెక్షన్లలో విద్యుదీకరణ సహా ట్రిప్లింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. 

సికింద్రాబాద్‌– మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌: రూ.150 కోట్లు 
ఈ 85 కిలోమీటర్ల ప్రాజెక్టు 2015–16లో రూ.774 కోట్లతో మంజూరు చేశారు. ఉందానగర్‌–గొల్లపల్లి మధ్య 60 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ, డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయి. గొల్లపల్లి–మహబూబ్‌నగర్‌ మధ్య 25 కిలోమీటర్ల పనులు చివరి దశలో ఉన్నాయి. 

మనోహరాబాద్‌– కొత్తపల్లి: రూ.160 కోట్లు 
151 కిలోమీటర్ల పొడవుతో, రూ.1,160 కోట్ల వ్యయంతో 2006–07లో మంజూరైన ఈ లైన్‌ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో కొనసాగుతోంది. తొలిదశలో మనోహరాబాద్‌–గజ్వేల్‌ మధ్య 32 కిలోమీటర్ల పనులు పూర్తయ్యా యి. మరో 20 కిలోమీటర్ల పనులు తుదిదశలో ఉన్నాయి. మిగతా పనులు చేపట్టాల్సి ఉంది. 

ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా 
♦పర్లి వైద్యనాథ్‌–వికారాబాద్‌ సెక్షన్‌లోవిద్యుదీకరణ కోసం రూ.109 కోట్లు 
♦జగిత్యాల–నిజామాబాద్‌ విద్యుదీకరణకు రూ.39 కోట్లు 
♦స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు రూ.325 కోట్లు 
♦కాజీపేట వద్ద పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌కు రూ.45 కోట్లు. 
♦చర్లపల్లి స్టేషన్‌ వద్ద శాటిలైట్‌ టెర్మినల్‌ అభివృద్ధికి రూ.70 కోట్లు 
♦ఉందానగర్‌–తిమ్మాపూర్‌ స్టేషన్ల మధ్య నూతన క్రాసింగ్‌ స్టేషన్‌ కోసం రూ.7 కోట్లు.  

దక్షిణమధ్య రైల్వే పరిధిలో కేటాయింపులివీ.. (రూ.కోట్లలో) 
అంశం    తాజా బడ్జెట్‌    గత బడ్జెట్లో 
రాష్ట్రాలవారీగా.. 
తెలంగాణకు    3,048    2,420 
ఆంధ్రప్రదేశ్‌కు   7,032   5,812  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement