ఏ సర్వీసు ఎప్పుడొస్తుందో తెలియదు
అకస్మాత్తుగా సర్వీసులు రద్దు
సకాలంలో రైళ్లు నడపండి
జంటనగరాల ప్రయాణికుల సంఘాలు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుపై ప్రయాణికుల సంఘాలు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఏ రైలు ఎపుడొస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఎందుకు రద్దవుతుందో తెలియదు. నగరానికి లైఫ్‌లైన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్‌పైన నిర్లక్ష్యమెందుకు’ అంటూ రైల్వే ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపైన దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్‌లకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ప్రయాణికుల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో నడుస్తున్న ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకల పట్ల వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతే కుమార్ జైన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ లోకేష్ విష్ణోయ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు సికింద్రాబాద్‌లోని సంచాలన్‌భవన్, హైదరాబాద్ భవన్‌లలో ప్రయాణికుల సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ, జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్, అమ్ముగూడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానందపురం వెల్ఫేర్ అసోసియేషన్, దక్షిణ మధ్య రైల్వే రైల్ ఫ్యాన్స్ అసోసియేషన్, తదితర సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సకాలంలో రైళ్లు నడపాలి..
మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు, మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు గతేడాది సర్వీసులను ప్రారంభించారు. కానీ ఈ రూట్‌లలో ప్రతి రోజు రైళ్లు రద్దవుతున్నాయి. పైగా ఏ ట్రైన్ ఎప్పుడొస్తుందో తెలియదు. మధ్యాహ్నం సమయంలో నడిపే రైళ్ల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఉండే సమయాల్లోనే రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. ఈ రూట్‌లో సకాలంలో రైళ్లు నడపాలని జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి నూర్ కోరారు. ఉదయం 9 గంటలకు రావలసిన ట్రైన్ 11 గంటలకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోవైపు మల్కాజిగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది కాలనీలకు సిటీబస్సుల కంటే ఎంఎంటీఎస్ ఎంతో ప్రయోజనంగా ఉంటుందని భావిస్తే ఈ రూట్‌లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు రైళ్లు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయిందని అమ్ముగూడ, రాఘవేంద్రనగర్ కాలనీలకు చెందిన ప్రతినిధులు తెలిపారు.
చదవండి: హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రీ సర్వే.. రంగంలోకి సర్వేయర్లు
‘హైలైట్స్’ పునరుద్ధరించాలి...
ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందజేసే ‘హైలైట్స్’ మొబైల్ యాప్ సేవలను పునరుద్ధరించాలని ప్రయాణికుల సంఘాలు కోరాయి. చిన్న చిన్న కారణాలతో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడం పట్ల కూడా ప్రయాణికుల సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా కూడా రైళ్లను రద్దుచేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సంఘాల నుంచి వచ్చిన సమస్యలను, సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్ధనలను పరిశీలించిన అనంతరం, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని దక్షిణమధ్యరైల్వే జనరల్‌మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment