సాక్షి, కర్నూలు: సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ కట్టబెట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. చిల్లిగవ్వ నిధుల్లేక అభివృద్ధి పనుల విషయంలో సర్పంచ్‌లు ముందడుగు వేయలేకపోతున్నారు. బాధ్యతలు చేపట్టి మూడు నెలలు గడుస్తుండటంతో హామీలు నెరవేర్చడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తుండటం వారిని గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే అవకాశం లేక పలు మేజర్ పంచాయతీలు అంధకారంలో మగ్గుతున్నాయి. గత పంచాయతీ పాలకవర్గాల సమయంలో చెక్‌పవర్ సర్పంచ్‌ల చేతిలోనే ఉండగా.. పదవీకాలం ముగిసిన తర్వాత ఇటీవల ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల పాలన సాగింది.
ఆ సందర్భంగా ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శికి సంయుక్త అధికారం కట్టబెట్టారు. ఎట్టకేలకు నాలుగు నెలల క్రితం మూడు విడతల్లో జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నో ఆశలతో ఆగస్టు 2న పాలకవర్గాలు పదవీ బాధ్యతలు చేపట్టగా వారికి నిరాశే మిగిలింది. ఏదో చేయాలనే తపన ఉన్నా.. చెక్‌పవర్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వారిని గందరగోళానికి గురిచేస్తోంది. మొదట జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తున్నట్లు ప్రకటించడం ఆందోళనలకు కారణమైంది. సర్పంచ్‌లతో పాటు బీసీ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం.. అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకోవడం, ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ఆ ఉత్తర్వులు క్షేత్ర స్థాయికి చేరలేదు.
తెలంగాణ జిల్లాల్లో అమల్లోకి వచ్చినా సీమాంధ్రలో ఉన్నతాధికారుల కార్యాలయాలకే పరిమితమయ్యాయి. తాజాగా సర్పంచ్‌లకే ఆ అధికారం కట్టబెడుతూ ప్రభుత్వం అక్టోబర్ 30న జీవో నంబర్ 432 జారీ చేసింది. ఉత్తర్వులు విడుదలై దాదాపు రెండు వారాలు దాటినా నేటికీ క్షేత్రస్థాయికి చేరకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, అనుగొండ, వెంకటగిరి, గోరంట్ల, అమడగుంట్ల, లద్దగరి సర్పంచ్‌లు తాము పదవి చేపట్టి వంద రోజులవుతున్నా ఇప్పటికీ చిల్లిగవ్వ ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఖజానా కార్యాలయం నుంచి జిల్లాలోని ఉప ఖజానా(సబ్‌ట్రెజరీలు) కార్యాలయాలకు ఉత్తర్వులు అందకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
సబ్ ట్రెజరీలకు ఉత్తర్వులు అందిన తర్వాత ఆయా మండలాల్లో సర్పంచ్‌ల సంతకాలను సంబంధిత ఎంపీడీవోలు.. లేకపోతే గెజిటెడ్ అధికారి ధ్రువీకరిస్తూ ఉప ఖజానా కార్యాలయాలకు పంపడం పరిపాటి. అప్పుడే చెక్‌లు డ్రా చేసుకునే వీలు ఏర్పడుతుంది. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు గ్రామాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా జిల్లా కేంద్రం నుంచి ఉప ఖజానా కార్యాలయాలకు చెక్‌పవర్ ఉత్తర్వులు అందడానికి ఇంత సమయం తీసుకోవడం అర్థం లేదనే వాదన వినిపిస్తోంది. ఇక్కడే ఇలావుంటే సర్పంచ్‌ల సంతకాల ధ్రువీకరణకు ఎంపీడీఓలు మరెంత సమయం తీసుకుంటారోననే చర్చ కొనసాగుతోంది.
ఇలాగైతే ప్రజల్లో తిరగలేం:
సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఉప ఖజానా కార్యాలయాల అధికారులను కలిస్తే జిల్లా ట్రెజరీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. వీధిలైట్ల కొనుగోలుకు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల చెల్లింపునకు సొంత నిధులను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాగైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి. వారికి కనీసం ముఖం కూడా చేపలేకపోతున్నాము.
- పి.మద్దిలేటి, సర్పంచ్, ఆర్.ఖానాపురం, గూడూరు మండలం
పవర్.. పంచాయితీ
Published Sun, Nov 17 2013 4:04 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement