త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు
- ఓటర్ల గుర్తింపునకు నోటిఫికేషన్ జారీ
- ఫిబ్రవరి 1నుంచి 12 వరకు డోర్ టు డోర్ సర్వే
-15ను ముసాయిదా జాబితా ప్రకటన
- ఫిబ్రవరి 28న తుది జాబితా ప్రకటన
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. కొన్ని నెలల క్రితమే నగరపాలక సంస్థ ఓటర్ల జాబితాలను రెవెన్యూ అధికారులు తయారు చేశారు. అయితే ఇంతవరకు వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్త్రీల ఓటర్ల వివరాలు ఖరారు కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వీటి ఆధారంగా రిజర్వేషన్‌లు ప్రకటిస్తారు. ఎట్టకేలకు ఈ కేటగిరీలకు చెందిన ఓటర్లను గుర్తించి ఓటర్ల జాబితా రూపొందించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు షెడ్యూలును ప్రకటించారు. ఫిబ్రవరి 28 నాటికి వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల తుది జాబితాలను ప్రకటించనున్నారు.
ఓటర్ల జాబితా ఖరారు అయితే మే లేదా జూన్ నెలల్లో కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్త్రీల ఓటర్లను గుర్తించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు పురపాలక శాఖ ఉత్తర్వులు ఇవ్వడంతోనే ఎన్నికల వేడి మొదలైనట్లు అయింది. ఫిబ్రవరి 1 నుంచి 12వ తేదీ వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్త్రీల ఓటర్లను గుర్తిస్తారు. సర్వే ఆధారంగా ఫిబ్రవరి 15న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వివిద స్థాయిల్లో అభ్యంతరాలను 21 నుంచి 26 వరకు స్రూటినీ చేస్తారు. ఫిబ్రవరి 28న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. మార్చిన 1న ఓటర్ల జాబితాలను మున్సిపల్ పరిపాలన శాఖకు పంపుతారు. డోర్‌టు డోర్ సర్వేకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించారు.