ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేద్దాం
ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేద్దాం
Published Thu, Feb 9 2017 9:36 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్):
ఎన్నికల ప్రవర్తన నియమావళిని శాసన మండలి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు పకడ్బందీగా అమలు అయ్యేలా పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మండల స్థాయిలోని ఎంసీసీ టీములు, ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. టీములు చేయాల్సిన పనులు, విధి విధానాలను కలెక్టర్ వివరించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగాలంటే కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంసీసీ టీము సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులుగా నియమింపబడిన వారిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమావళిని తూచా పాటించాలన్నారు. కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దని సూచించారు. ఎన్నికల కోడ్ ఉందంటే కలెక్టర్‌తో సహా ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా కాకుండా జిల్లా ఎన్నికల అధికారిగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టరాదని, ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేయరాదని తెలిపారు. ఎలాంటి నోటిఫికేషన్‌లు, టెండర్లు నిర్వహించరాదని తెలిపారు. కొత్తగా ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులు ప్రారంభించడంపై ఎన్నికల కమిషన్ అనుమతి కోసం లేఖ రాశామని, అనుమతి వచ్చిన తర్వాత కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. జేసీ హరికిరణ్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలు, ఊరేగింపులు తదితర ప్రచార కార్యక్రమాలు వీడియో తీసి పంపాలని ఎంసీసీ టీములను ఆదేశించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ ఎన్నికల నియమావళి సమానమేనని అన్నారు. మండల స్థాయి టీములు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సెంట్రల్ కంప్లైంట్ మానిటరింగ్ కంట్రోలు రూమును కూడా ప్రారంబించామని 08518– 277305, 277309కు పోన్ చేయవచ్చని వివరించారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement