నిఘా నీడలో అభ్యర్థులు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థుల వ్యయం హద్దులు దాటుతోంది. ఏదోవిధంగా గెలిచి తీరాలనే పట్టుదల వారిని వివిధ రకాల ఖర్చులకు పురిగొల్పుతోంది. వీరి వ్యయం మితిమీరితే ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కల్గే అవకాశం ఉన్నందునా జిల్లా అధికార యంత్రాంగం నిఘాను మరింత ముమ్మరం చేసింది.
ఇప్పటి వరకు జరుగుతున్న పర్యవేక్షణ, వ్యయ వివరాలను షాడో రిజిష్టర్‌లో సక్రమంగా నమోదు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అలసత్వం తగదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమ రికార్డింగ్, ఖర్చు అంచనా, ఆధారాల సేకరణ, షాడో రిజిష్టర్‌లో నమోదుపై తదితరవాటిపై నియోజకవర్గాల వారీగా సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీములతో కలెకక్టర్ బుధవారం కాన్ఫరెన్స్‌హాలులో సమీక్ష నిర్వహించారు.
ఆదోని తదితర నియోజకవర్గాల్లో నామినేసన్ల కార్యక్రమాన్ని వీడియో తీయలేదని, ఖర్చుల వివరాలు నమోదు చేయలేదనే సమాధానాలు రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యయంపై గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఇలా ఉంటే ఎలా ఆంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సంబంధిత రిటర్నింగ్ అధికారి అనుమతితో వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకోండి. సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలతో సహా అభ్యర్థులు నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని రికార్డింగ్ చేసి ఆధారాలతో సహా షాడో రిజిష్టర్‌లో నమోదు చేయండి’ అని కలెక్టర్ ఆదేశించారు. వాహనాలు లేవని, ఉన్నా డీజిల్ వేయడం లేదని కొందరు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆర్వోలకు చెప్పి పరిష్కరిస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు.
అభ్యర్థుల ఖర్చుకు సంబంధించిన రికార్డులను మూడు రోజులకోసారి విధిగా పరిశీలించాలని సూచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి జి.రామచంద్రారెడ్డి, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శివానందం తదితరులు పాల్గొన్నారు.