నందికొట్కూరులో వీస్తున్న ఫ్యాన్ గాలి
మెరవని ‘రత్నం’
లబ్బీకి అసంతృప్తుల సెగ
ప్రచారంలో దూసుకుపోతున్న ఐజయ్య
సాక్షి, కర్నూలు: అరుదైన ‘బట్టమేక ’ పక్షికి స్థావరమైన నందికొట్కూరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో తెలుగుదేశం సతమతమవుతోంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఉద్యమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ బలంగా కనిపిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం వైఎస్సార్సీపీ గెలుపునకు దోహదపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో(1955) నందికొట్కూరు ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఈ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన అయ్యపురెడ్డి, ఎన్‌కె.లింగం విజయం సాధించారు. అంతకుముందు 1952లో కమ్యూనిస్టు పార్టీ నేత చండ్ర పుల్లారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
నందికొట్కూరు శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా మొత్తం 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. మరో మూడు సార్లు తెలుగుదేశం, రెండు సార్లు ఇండిపెండెంట్లు, ఒకసారి సీపీఐ గెలుపొందింది. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందడం విశేషం.
నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వై. ఐజయ్య బరిలో ఉన్నారు. ఈయన పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలున్నారు.
దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలతో చాలా మంది లబ్ధిపొందారు. వీరంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు.
అలాగే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫేస్టోను నమ్ముతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్సీపీ క్రీయాశీలక పాత్రను ప్రశంసిస్తూ ఆ పార్టీవెంటే తామంతా అంటూ నడుస్తున్నారు. ఐజయ్యకు అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.