ముగ్గురు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు
Published Mon, May 15 2017 11:10 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
– ఆస్పరి సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ముగ్గురు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు వేర్వేరు కారణాలతో చెక్ పవర్‌ను రద్దు చేశామని, మరో సర్పంచ్‌కు షోకాజ్ నోటీసును అందించినట్లు జిల్లా పంచాయతీ అధికారిణి బి.పార్వతీ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కోడుమూరు మండలం కల్లపరి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఏకగ్రీవ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి రూ.7 లక్షల ప్రకారం విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ గ్రామాల సర్పంచుల చెక్‌పవర్‌ను రద్దు చేశామన్నారు.
అలాగే కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ 13వ ఆర్థిక సంఘం కింద విడుదలైన రూ.3 లక్షలను చేతి నిల్వ కింద పెట్టుకున్నట్లు మీకోసంకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టి ఆయన చెక్ పవర్‌ను కూడా రద్దు చేసినట్లు డీపీఓ తెలిపారు. అలాగే ఆస్పరి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పేరుకుపోవడం, ఆక్రమణలు పెరిగిపోయాయని.. వీటిపై విచారణ చేసి ఈ నెల 11న షోకాజ్ నోటీసును జారీ చేశామన్నారు. వారంలోగా నోటీసుకు సంజాయిషీ ఇవ్వకపోతే ఆస్పరి సర్పంచ్ చెక్ పవర్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రభుత్వం విడుదల చేసిన గ్రాట్లను గ్రామాభివృద్ధి కోసం వెచ్చించాలే తప్ప, సొంత పనులకు వాడుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement