సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, వారికి అందాల్సిన కనీస వసతుల కల్పనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం పల్లెలకు ఇబ్బందికరం గా మారుతోంది. కొత్త పాలకవర్గాలు ప్రజల కోసం పనిచేసే పరిస్థితి లేకుండాపోయింది. వేసవిలో తాగునీరు సమస్యలను తీర్చేందుకు పాలకవర్గాలకు ఏమాత్రం అవకాశం లేకుండాపోయింది. బోర్లు, మోటార్లు, స్టార్టర్లు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చివరికి పారిశుధ్య కార్మికులకు చీపుర్లు, ఆఫీసు అవసరం కోసం కాగితాలు సైతం కొనలేని స్థితిలో పంచాయతీలు నడుస్తున్నాయి. కొత్త పాలకవర్గాలు కొలవుదీరి 4నెలలు పూర్తయినా గ్రామపంచాయతీ నిధుల చెక్‌పవర్ అధికారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొంది.
పంచాయతీరాజ్ చట్టం అమల్లోఉన్నా..
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే కంటే ఏడాది ముందు నుంచీ గ్రామపంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. దీంతో కొత్త పనులేవీ మొదలుకాలేదు. మౌలికవసతుల కల్పన, పునరుద్ధరణ పనులను పట్టించుకోలేదు. కొత్త పాలకవర్గాలు వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందనుకుంటే అదీ జరగడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేసింది. గ్రామపంచాయతీలకు వివిధ రకాలుగా సమకూరిన నిధులను గ్రామపంచాయతీ తీర్మానాల మేరకు పాలకవర్గాలు ఖర్చు చేస్తాయి. నిధుల విడుదల కోసం ‘జాయింట్ చెక్ పవర్’విధానం కొనసాగుతోంది.
గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సంయుక్తంగా జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ విధానాన్ని మార్చింది. సర్పంచులు, ఉప సర్పంచులకు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ఇచ్చింది. చట్టం అమలు చేసేందుకు అన్ని అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కీలకమైన 7 విషయాలపై మాత్రం ఉత్తర్వులు జారీ చేయడంలేదు. జాయింట్ చెక్‌పవర్ విషయంలోనూ ప్రభుత్వం కొత్త చట్టంలోని నిబంధన ప్రకారం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. మరోవైపు పాత చట్టం ప్రకారం సర్పంచ్, కార్యదర్శి కలిపి ఉండే జాయింట్ చెక్‌పవర్ విధానం అమలు కావడంలేదు. దీంతో గ్రామపంచాయతీల్లో నిధులు విడుదలకు బ్రేక్ పడింది. దీంతో కొత్త పాలకవర్గాలు సైతం గ్రామపంచాయతీల్లో ఎలాంటి పనులు చేపట్టడంలేదు. తాగునీటి, కరెంటు సరఫరా వంటి ముఖ్యమైన పనులకు సైతం నిధుల విడుదల లేక ముందుకు సాగడంలేదు. అత్యవసర పనుల విషయంలోనూ ఇదే జరుగుతోంది.
సర్పంచ్‌ల దీనస్థితి
గ్రామపంచాయతీ నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారు. సొంతంగా సమకూరిన నిధులు సైతం ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాలకు తమ వంతుగా ఏదో చేయాలని భావించి ఎన్నికల్లో పోటీ చేసిన తమకు కొత్తలోనే చేతులు కట్టేసినట్లుగా ఉందని కొందరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు సంగతి పక్కనపెడితే.. కనీస అవసరాలు సైతం తీర్చలేని దుస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు చెక్‌పవర్‌పై ప్రత్యేకంగా మెమోలు జారీ చేశారు. పాత విధానంలోనే నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు ఈ విషయంలో ధైర్యం చేయడంలేదు. చెక్‌పవర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు నిధుల విడుదలకు దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment