Panchayath secretaries
-
ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్
సాక్షి, నూజివీడు : అధికారులు అవినీతికి దూరంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం పదేపదే చెప్తున్నా, అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. నూజివీడు నియోజకవర్గంలోని ఓ మండలంలో అధికారి పేరు చెబితే పంచాయతీ కార్యదర్శులు హడలెత్తుతున్నారు. ప్రతి విషయంలోనూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో వారంతా సెలవుపై వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తన ఇంట్లో పూజలు నుంచి మనవరాలి పుట్టినరోజు వరకు, వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఏ పండుగ వచ్చినా ఒత్తిడి చేసీ మరీ సెక్రటరీల నుంచి వేలకువేలు గుంజుతున్నట్లు తెలిసింది. దసరా పర్వదినానికి చీర కొనిపెట్టమని కార్యదర్శులను ఒత్తిడి చేయడంతో రూ.5వేలు సమరి్పంచుకున్నట్లు సమాచారం. వినాయకచవితికి పూజా కార్యక్రమాలకు, దీపావళికి బాణసంచా కూడా కార్యదర్శులే కొని ఇచ్చినట్లు సమాచారం. ఆమె తనకు కావాల్సిన గృహోపకరణాలను సైతం కార్యదర్శులను పీడించి మరీ వారితో కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రూ.30వేలతో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. అందులో రూ.20వేలు ఆమె చెల్లించగా, మిగిలిన రూ.10వేలు ఓ కార్యదర్శి పేరుతో షోరూమ్‌లో అప్పురాయించారు. చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఆ కార్యదర్శి రూ.10వేలు షోరూమ్‌లో చెల్లించినట్లు సమాచారం. ఆ అధికారి మనమరాలి జన్మదిన వేడుకలకు కార్యదర్శుల జేబులు ఖాళీ అయ్యాయి. పంచాయతీలలో సొంత డబ్బులు పెట్టి పనులు చేయించి బిల్లులు పెడితే వాటిపై సంతకాలు చేయడానికి చేయి తడపాల్సిందే. వాళ్లూ, వీళ్లు అనే తేడా లేకుండా నిత్యం డబ్బులు గుంచే ఆలోచనలో ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే మండలంలోని మరో అధికారి కూడా పంచాయతీ కార్యదర్శుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోని టేబుల్‌పైన ఒక పంచాయతీ కార్యదర్శి తన బ్యాగ్‌ను ఉంచి పక్కకు వెళ్తే ఆ బ్యాగులోని రూ.2వేలను ఆ అధికారి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి తీరుపై ప్రజాప్రతినిధులలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
భరించలేక.. బాదేశారు!
తూర్పుగోదావరి , నెల్లిపాక (రంపచోడవరం): ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంగా తమను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ఆగ్రహం చెందిన గౌరీదేవిపేట పీహెచ్సీ ఏఎన్ఎంలు వారి బంధువులు గురువారం తోటపల్లి పంచాయతీ కార్యదర్శికి దేహశుద్ధి చేశారు. పింఛన్ల పంపిణీ చేస్తున్న ప్రదేశానికి మూకుమ్మడిగా వెళ్లిన వైద్య సిబ్బంది కార్యదర్శిని నిలదీశారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన బాధిత సెకండ్ ఏఎన్ఎం, ఆమె బంధువులు కార్యదర్శిపై విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతడు అక్కడి నుంచి పరుగులుపెట్టి ఎదురుగా ఉన్న సహకార సంస్థ గోడౌన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయినా శాంతించని ఏఎన్ఎంలు వారి బంధువులు తలుపులు బలవంతంగా తెరిచి కార్యదర్శిని బయటకు లాక్కొని వచ్చారు. ఈ క్రమంలో కార్యదర్శి పింఛన్ల పంపిణీ నిలిపివేసి ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు. తోటపల్లి కార్యదర్శిని నిలదీస్తున్న ఏఎన్ఎంలు ఇదీ విషయం.. గౌరీదేవిపేట పీహెచ్సీలో సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఓ యువతి తల్లికి వితంతు పింఛను వస్తోంది. అయితే గౌరీదేవిపేట పరిధిలో కాకుండా తోటపల్లి పరిధిలో నమోదుకావడంతో కొన్ని నెలలుగా అక్కడి నుంచే పింఛను పొందుతోంది. పింఛను ఇచ్చే క్రమంలో ‘మీ అమ్మను తీసుకురా?’ అంటూ తన సెల్‌కు అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతూ తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని సెకండ్ ఏఎన్ఎం ఆవేదన వ్యక్తం చేసింది. పింఛను గౌరీదేవిపేట పరిధిలోకి మార్చండని వేడుకున్నా నిర్లక్ష్యం చేస్తున్నాడని వాపోయింది. నిత్యం గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఏదోఒక సమచారం కావాలంటూ తీవ్ర ఇబ్బందులు పెడుతూ తమపై దురుసుగా వ్యవహరిస్తున్నాడని అక్కడ ఉన్న ఏఎన్ఎంలు ఆరోపించారు. కొందరికి సెల్‌ఫోన్ ద్వారా అభ్యంతరకర మెసేజ్‌లు పెడుతున్నాడని, దీనివలన కుటుంబంలో కలహాలు నెలకొన్న సందర్భాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ విషయంపై ఎటపాక పోలీసులకు, మండల పరిషత్ అధికారులకు వైద్యశాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
పైసలు లేక పస్తులు
సాక్షి, నెక్కొండ(వరంగల్) : వారంతా ప్రతి దినం విధులకు హాజరుకావాల్సిందే. చేసేది చిన్న ఉద్యోగం.. కాని ఒకటి కాదు నాలుగునెలలైనా జీతం అందలేదు. ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలా.. నాలుగునెలలైనా వేతనం అందక దిగులుపడాలా తెలియని పరిస్థితిలో కొత్త పంచాయతీ కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారు. విధుల్లో చేరి దాదాపు నాలుగు మాసాలు గడుస్తున్నా ఇంతవరకూ మొదటి వేతనం ఎట్లుంటదో చూద్దమన్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఇక కొందరికైతే సొంత ఊళ్లు కాకుండా వేరే చోట డ్యూటీ కేటాయించడంతో రోజువారిగా రాకపోకల ఖర్చులతో పాటు కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జిల్లాలోని కొత్తగా విధుల్లో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వ్యథ వర్ణనాతీతం. 276 మంది .. పంచాయతీల్లో కీలక పాత్ర పోషించే కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పంచాయతీ పాలన గాడితప్పింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అయితే గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అక్టోబర్‌లో రాత పరీక్ష నిర్వహించింది. డిసెంబర్ 19న ఫలితాలు ప్రకటించిన విషయం విధితమే. ఇదిలా ఉండగా ఫలితాలపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 12న జిల్లాలో మొత్తం 276 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు కార్యదర్శులు విధుల్లో చేరలేదని సమాచారం. మొత్తం 270 మంది జూనియర్ కార్యదర్శులు అప్పటినుంచి విధుల్లో చేరి పని చేస్తుండగా ఇప్పటివరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. కార్యదర్శులకు మూలవేతనం రూ.15 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌గా పరిగణించిన అనంతరం పని తీరు ఆధారంగా శాశ్వత కార్యదర్శులుగా గుర్తించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో.. నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో పలువురు కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పలువురు కార్యదర్శులకు సొంత మండలాల పరిధిలో కాకుండా ఇతర మండలాల్లోని పంచాయతీల్లో కార్యదర్శులుగా నియమించారు. సొంత నివాసం నుంచి విధులు నిర్వహించాల్సిన గ్రామానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. ప్రధానంగా మహిళ కార్యదర్శులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు ఎంప్లాయ్ ఐడీ కార్డులు జారీ చేయలేదు. జీతాలు చెల్లించేందుకు ఉద్యోగుల ఐడీకార్డు అవసరముంటుంది. ఉద్యోగి వివరాలు డీపీఓ కార్యాలయం, ట్రెజరీకి పంపినట్లయితే జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో విధులకు.. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో విధులకు హాజరవుతున్నాం. మొదటి జీతమైనా తీసుకోకపోవడం దురదృష్టకరం. రోజువారీ ఖర్చులకే పడరాని పాట్లు పడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం మా ఇబ్బందుల్ని గుర్తించాలె. నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. – ఆనంద్, నెక్కొండ, తండా జీపీ జూనియర్ కార్యదర్శి జీతాలిచ్చి ఆదుకోవాలే... జీతాలు లేక నాలుగు నెలలయితానయ్. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం స్వాగతిస్తున్నాం. మా గురించి ప్రభుత్వం ఆలో చించి ఆదుకోవాలి. కనీసం ఇంటి అవసరాలు సైతం తీర్చలేక పోతున్నామన్న బాధే వేధిస్తోంది. అప్పుల పాలవుతున్నాం. ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి. – సురేష్, పిట్టకాలుబోడు తండా జీపీ కార్యదర్శి -
శిక్షణ లేకుండానే విధుల్లోకి
సాక్షి, నల్లగొండ : శిక్షణ లేకుండానే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. అంతకు ముందే పంచాయతీ కార్యదర్శులకు టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల కోడ్‌తోనియామకాలు ఆగిపోయాయి. ఎన్నికలు పూర్తయితన తర్వాత విధుల్లో చేరారు. వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో గ్రామాల్లో కొత్త పంచాయతీ చట్టం ప్రకారం విధులు ఎలా నిర్వహించాలో పూర్తి స్థాయిలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సందేహాలతో చేరే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నియామకం కాగానే శిక్షణ ఇస్తారు. వీరికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 పంచాయతీలకు గత జనవరి మాసంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులను జిల్లాకు అలాట్ చేయడంతో వారికి జిల్లా పంచాయతీ అధికారి జాయినింగ్ ఉత్తర్వులు అందజేయడం.. వెంటనే వారు విధుల్లో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కాకముందు గతంలో రెండు మూడు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ప్రస్తుతం కొత్త నియామకాల కారణంగా ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఏర్పాటయ్యాడు. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. దాని బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. చట్టం అమలులో భా గంగా సర్పంచ్‌కు, ఉపసర్పంచ్‌కు ఇటీవల ప్రభుత్వం చెక్ పవర్‌ను అందించింది. గతంలో సర్పం చ్‌కు, కార్యదర్శికి చెక్ పవర్ ఉండేది. నిధుల విని యోగానికి సంబంధించిన ఆడిట్ మాత్రం సర్పం చ్, కార్యదర్శే చేయాల్సి ఉంది. ఇందులో తప్పిదాలు చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవు. కార్యదర్శుల విధులు కొత్తచట్టం ప్రకారం పనితీరును ప్రతినెలా వెబ్సైట్లో పొందుపర్చాలి. లే అవుట్లు, భవన నిర్మాణాలు, అందుకు సంబంధించిన అనుమతుల కోసం గ్రామపంచాయతీలకు అనుసంధానంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆ సాఫ్ట్ వేర్ కూడా ఇప్పటికే జిల్లాకు చేరింది. గ్రామాల్లో ఉపాధి హామీతోపాటు జనన, మరణ, ఇతర గ్రామానికి సంబంధించిన సమాచారానికి సంబంధించి ప్రతి ఒక్క విషయానికి పంచాయతీ కార్యదర్శే ప్రముఖ పాత్ర వహించాలి. విధులు సరిగా నిర్వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకునేందుకు కూడా చట్టంలో ఉంది. తొలగింపు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఏప్రిల్ 12న పంచాయతీ కార్యదర్శులు నియామకాలు తీసుకొని అదే రోజు విధుల్లో చేరాలని ఆదేశాలు ఉండడంతో వెంటనే చేరారు. మరుసటి రోజు నుంచే పంచాయతీలకు వారిని కేటాయిం చారు. ప్రస్తుతం కొత్త చట్టం గ్రామంలోని ప్రతి పనికి సంబంధించి కార్యదర్శే బాధ్యత వహించాలి. అది కూడా ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. -
చెక్ పవర్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, వారికి అందాల్సిన కనీస వసతుల కల్పనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం పల్లెలకు ఇబ్బందికరం గా మారుతోంది. కొత్త పాలకవర్గాలు ప్రజల కోసం పనిచేసే పరిస్థితి లేకుండాపోయింది. వేసవిలో తాగునీరు సమస్యలను తీర్చేందుకు పాలకవర్గాలకు ఏమాత్రం అవకాశం లేకుండాపోయింది. బోర్లు, మోటార్లు, స్టార్టర్లు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చివరికి పారిశుధ్య కార్మికులకు చీపుర్లు, ఆఫీసు అవసరం కోసం కాగితాలు సైతం కొనలేని స్థితిలో పంచాయతీలు నడుస్తున్నాయి. కొత్త పాలకవర్గాలు కొలవుదీరి 4నెలలు పూర్తయినా గ్రామపంచాయతీ నిధుల చెక్‌పవర్ అధికారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్ చట్టం అమల్లోఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే కంటే ఏడాది ముందు నుంచీ గ్రామపంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. దీంతో కొత్త పనులేవీ మొదలుకాలేదు. మౌలికవసతుల కల్పన, పునరుద్ధరణ పనులను పట్టించుకోలేదు. కొత్త పాలకవర్గాలు వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందనుకుంటే అదీ జరగడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేసింది. గ్రామపంచాయతీలకు వివిధ రకాలుగా సమకూరిన నిధులను గ్రామపంచాయతీ తీర్మానాల మేరకు పాలకవర్గాలు ఖర్చు చేస్తాయి. నిధుల విడుదల కోసం ‘జాయింట్ చెక్ పవర్’విధానం కొనసాగుతోంది. గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సంయుక్తంగా జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ విధానాన్ని మార్చింది. సర్పంచులు, ఉప సర్పంచులకు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ఇచ్చింది. చట్టం అమలు చేసేందుకు అన్ని అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కీలకమైన 7 విషయాలపై మాత్రం ఉత్తర్వులు జారీ చేయడంలేదు. జాయింట్ చెక్‌పవర్ విషయంలోనూ ప్రభుత్వం కొత్త చట్టంలోని నిబంధన ప్రకారం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. మరోవైపు పాత చట్టం ప్రకారం సర్పంచ్, కార్యదర్శి కలిపి ఉండే జాయింట్ చెక్‌పవర్ విధానం అమలు కావడంలేదు. దీంతో గ్రామపంచాయతీల్లో నిధులు విడుదలకు బ్రేక్ పడింది. దీంతో కొత్త పాలకవర్గాలు సైతం గ్రామపంచాయతీల్లో ఎలాంటి పనులు చేపట్టడంలేదు. తాగునీటి, కరెంటు సరఫరా వంటి ముఖ్యమైన పనులకు సైతం నిధుల విడుదల లేక ముందుకు సాగడంలేదు. అత్యవసర పనుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. సర్పంచ్ల దీనస్థితి గ్రామపంచాయతీ నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారు. సొంతంగా సమకూరిన నిధులు సైతం ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాలకు తమ వంతుగా ఏదో చేయాలని భావించి ఎన్నికల్లో పోటీ చేసిన తమకు కొత్తలోనే చేతులు కట్టేసినట్లుగా ఉందని కొందరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు సంగతి పక్కనపెడితే.. కనీస అవసరాలు సైతం తీర్చలేని దుస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు చెక్‌పవర్‌పై ప్రత్యేకంగా మెమోలు జారీ చేశారు. పాత విధానంలోనే నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు ఈ విషయంలో ధైర్యం చేయడంలేదు. చెక్‌పవర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు నిధుల విడుదలకు దూరంగా ఉంటున్నారు. -
గ్రామ పంచాయతీలో వివాహ రిజిస్ట్రేషన్లు
దస్తురాబాద్: మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీల్లో వివాహ రిజిస్ట్రేషన్ల నమోదును బుధవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన గుబ్బలి రాకేశ్, రజితల వివాహం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్ అనంతరం వధూవరులకు సర్పంచ్ నిమ్మలతోట రాజమణిశివయ్య చేతుల మీదుగా వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపి, వార్డు సభ్యులు సత్యనారాయణ, గణేశ్, రాణి, బుచ్చరాజు, రమేశ్, కారోబార్ శ్రీనివాస్, నాయకులు రాజనర్సయ్య, బక్కన్న తదితరులు పాల్గొన్నారు. -
పక్కా భవనాల నిర్మాణమెప్పుడో..?
కొడిమ్యాల: 500 జనాభా ఉన్న గ్రామాలు, గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇక తమ సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కరించుకోవచ్చని నూతన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సంతోషించారు. ఐతే వారి ఆశలు నిజం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. నూతన పంచాయతీలు 21 కొడిమ్యాల మండలంలో హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, దమ్మయ్యపేట, చింతలపల్లి, గంగారాంతండా, అప్పారావుపేట, కొండాపూర్, తుర్కకాశీనగర్ గ్రామాలు, గంగాధర మండలంలో చిన్న ఆకంపెల్లి, ఇస్లాంపూర్, మంగపేట, చెర్లపల్లి, లింగంపల్లి, నర్సింహులపల్లి, మధురానగర్, ముప్పిడిపల్లి, వెంకంపల్లి, మల్యాల మండలంలో గొర్రెగుండం, గుడిపేట గ్రామాలు, రామడుగు మండలంలో పందికుంటపల్లి, చొప్పదండి మండలంలో సాంబయ్యపల్లి గ్రామం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అద్దె భవనాల్లోనే పాలన పాలనాధికారాల వికేంద్రీకరణతో అభివృద్ధి వేగవంతం కానుందని ఆనందపడ్డారు. ఐతే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పరిపాలనా నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు గ్రామాల్లో కుల సంఘ భవనాలు, పాఠశాలల్లోని అదనపు గదులు, నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ భవనాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటున్నారు. అధిక గ్రామాల్లో అద్దె భవనాలనే పంచాయతీలకు పరిపాలనా భవనాలుగా ఉపయోగిస్తున్నారు. కొత్త జీపీల నిర్వహణకు నిధుల లేమి కారణంగా అద్దె భవనాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి. కానరాని కారోబార్లు.. కార్మికులు నూతన గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు కారోబార్లు, పారిశుధ్య కార్మికులు, వాటర్ పంప్మెన్లు, ఎలక్ట్రీషియన్లను నియమించలేదు. నిధులు లేకపోవడంతో తాత్కాలికంగా పని చేసేవారిని నియమించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా పంచాయతీల్లోని ప్రజలు అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికులు లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు వారి డబ్బులతోనే పనులు చేపడుతున్నారు. నిధులు మంజూరయ్యే దాకా కొత్త పాలకవర్గాలు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కార్యదర్శుల నియామకంలో ఆలస్యం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా.. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పుతోంది. ప్రస్తుతమున్న కార్యదర్శులను నాలుగు నుంచి ఐదు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. దీంతో ఏ ఒక్క గ్రామానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వారంలో రెండు రోజుల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. ప్రజలు వివిధ రకాల ధ్రువపత్రాలు పొందడంలో ఆలస్యమవుతోంది. పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కోర్టు సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని, కార్యదర్శుల నియామకాలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్‌కు వినతి నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ కొడిమ్యాల మండలంలోని 21 గ్రామాల సర్పంచ్‌లు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు వారు విన్నవించారు. జేబులో నుంచే.. ఇప్పటివరకు మా తండాకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తండాలో పారిశుధ్యం, రోజూవారీ ఇతర పనుల నిర్వహణకు ప్రస్తుతానికి జేబులో నుంచే ఖర్చు చేస్తున్నా. – భూక్యా భోజ్యనాయక్, సర్పంచ్, గంగారాంతండా నిధులు మంజూరు చేయాలి కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ముందుగా గ్రామ పంచాయతీ భవనాలకు నిధులందించాలి. తర్వాత ఇతర పనులపై దృష్టి సారించాలి. నిధులు లేక ఏ పని చేపట్టలేకపోతున్నాం. – గరిగంటి మల్లేశం, సర్పంచ్, అప్పారావుపేట -
జీవోలో 44 ఏళ్లు.. నోటిఫికేషన్లో 39 ఏళ్లు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓసీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నోటిఫికేషన్లో మాత్రం గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లుగా పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల ఫలితాలను ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి వారిని పరీక్షకు అనుమతించాలని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓసీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ 2017లో జీవో 190 జారీ చేసింది. అయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో మాత్రం ఓసీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 39 సంవత్సరాలుగా పేర్కొంది. ఈ వైరుధ్యాన్ని సవాల్ చేస్తూ నల్లగొండకు చెందిన కె.జయధీర్‌రెడ్డి, మరో 9 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జె.కొండారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో ఓసీ అభ్యర్థుల వయోపరిమితిని 39 సంవత్సరాలుగా నిర్ణయించడం వల్ల అనేక మంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. అందులో పిటిషనర్లు కూడా ఉన్నారని వివరించారు. జీవో 190 ప్రకారం పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి వారిని పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. జీవోలో 44 ఏళ్లుగా గరిష్ట వయోపరిమితిని నిర్ణయించి, నోటిఫికేషన్లో 39 సంవత్సరాలుగా పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న వయో పరిమితి ప్రాథమికంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. -
39 ఏళ్లా.. 44 ఏళ్లా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో వయోపరిమితిపై అయోమయం నెలకొంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 39గా నిర్ధారించడంతో మెజార్టీ అభ్యర్థులకు దరఖాస్తు చేసే అంశంపై స్పష్టత కొరవడింది. టీఎస్పీఎస్సీ ద్వారా చేపడుతున్న ఉద్యోగాల భర్తీకి సం బంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా పేర్కొంటూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వయోపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ జీవో 190ని గతేడాది జూలై 8న జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో అప్పటివరకున్న గరిష్ట వయోపరిమితిగా ఉన్న 34 సంవత్సరాలు కాస్తా 44 సంవత్సరాలుగా మారింది. ఈ ఉత్తర్వులు 26 జూన్, 2019 వరకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు నియామకాల భర్తీలో గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా ఉంది. కానీ, గత వారం ప్రభుత్వం విడుదల చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాలుగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 9,355 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతమున్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 31న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కు నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగాల సంఖ్య భారీగా ఉండటంతో నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య తీవ్రమైంది. ఈ నోటిఫికేషన్‌పై దాదాపు రెండు నెలలుగా ప్రచారం జరుగుతుండటంతో కొందరు ముందస్తుగా శిక్షణ(కోచింగ్) సైతం పొందుతున్నారు. తాజాగా వెలువడిన ప్రకటనలో గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొనడంతో వారిలో నైరాశ్యం నెలకొంది. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా ప్రకటించాలని నిరుద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలకు 3,158 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనున్న 9,355 జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో మహిళలకు మూడో వంతు చొప్పున 3,158 రిజర్వ్ చేశారు. మిగతా 6,197 పోస్టులను జనరల్ కేటగిరీలోకి చేర్చారు. పోస్టుల భర్తీకి సంబంధించి గత నెల 31న నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ రెండ్రోజుల క్రితం జిల్లాలవారీగా పోస్టుల వివరాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాలను పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 3 నుంచి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాలి. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా జనరల్ మహిళలు మొత్తం ఆదిలాబాద్ 221 114 335 భద్రాద్రి 257 130 387 జగిత్యాల 191 97 288 జనగాం 137 69 206 భూపాలపల్లి 201 103 304 జోగులాంబ 106 55 161 కామారెడ్డి 289 147 436 కరీంనగర్ 151 78 229 ఖమ్మం 323 162 485 కొమురంభీం 155 80 235 మహబూబాబాద్ 245 125 370 మహబూబ్‌నగర్ 340 171 511 మంచిర్యాల 153 79 232 మెదక్ 230 116 346 మేడ్చల్ 15 12 27 నాగర్‌కర్నూల్ 205 105 311 నల్లగొండ 439 222 661 నిర్మల్ 211 111 322 నిజామాబాద్ 269 136 405 పెద్దపల్లి 130 64 194 రాజన్న సిరిసిల్ల 118 59 177 రంగారెడ్డి 237 120 357 సంగారెడ్డి 297 149 446 సిద్దిపేట 223 115 338 సూర్యాపేట 227 115 342 వికారాబాద్ 285 144 429 వనపర్తి 104 55 159 వరంగల్‌రూరల్ 183 93 276 వరంగల్ అర్బన్ 52 27 79 యాదాద్రి 203 104 307 -
ప్రతి పంచాయతీకీ.. ఓ సెక్రటరీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి కొలువుల పండుగకు తెరలేచింది. కొత్తగా 9,200 మంది పంచా యతీ కార్యదర్శులను నియమించనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి రెండు నెలల్లోగా భర్తీ పూర్తి చేయాలని ఆదివారం అధికారులను ఆదే శించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని, పల్లె సీమలను ప్రగతిసీమలుగా మార్చే బృహత్తర కార్య క్రమంలో వారు కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షిం చారు. కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్ధీకరించాలన్నారు. విధులు నిర్వహించలేని వారిని క్రమబద్ధీకరించకుండా ఉండేలా విధానం రూపొందించాలని సీఎం చెప్పారు. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15,000 చొప్పున వేతనం ఇవ్వాలని ఆదేశించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్‌లో కార్యదర్శుల నియామకాలు జరపాలని పేర్కొన్నారు. ఇక ఇన్చార్జి విధానం వద్దు రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయితీలకు కార్యదర్శులున్నారు. ప్రభుత్వం ఇటీవలే కొత్తగా గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. వీటికితోడు పాత గ్రామ పంచాయితీల్లోనూ ఖాళీలున్నాయి. అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా పంచాయితీ కార్యదర్శులుండాలని, ఒక కార్యదర్శి మరో పంచాయితీకి ఇన్చార్జిగా పనిచేసే విధానానికి స్వస్తి పలకాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగా 9,200 మందిని పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని చెప్పారు. నియామక ప్రక్రియ, పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలు రూపొందించాల్సిందిగా పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్‌లను ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు ప్రకటించారు. 200 మంది ఉన్నా కార్యదర్శి గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా మార్చేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని మా ప్రభుత్వం నమ్ముతుంది. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరిపాలన సౌలభ్యం కోసం, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో కొత్త పంచాయితీలను ఏర్పాటు చేశాం. పంచాయితీల పరిధిలో హరితహారం కార్యక్రమం అమలు చేయడం, గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూలు, మురికి కాలువల నిర్మాణం–నిర్వహణ, విద్యుత్ దీపాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడడం, దోమల నివారణ, శ్మశానవాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు లాంటి ఎన్నో బాధ్యతలు గ్రామ పంచాయితీకి ఉన్నాయి. గ్రామ పంచాయితీ పాలకవర్గంతో కలిసి గ్రామ కార్యదర్శి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శి విధిగా ఉండాలి. 200 జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించాం. వారంతా కష్టపడి పనిచేస్తే రెండు మూడేళ్లలోనే ఎంతో మార్పు వస్తుంది. తెలంగాణ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలుగొందుతాయి. దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలెక్కడున్నాయంటే తెలంగాణలోనే అనే పేరు వస్తుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
పరీక్షల కాలం
అర్ధరాత్రి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం రాత్రి 12 గంటల తరువాత ప్రారంభం అయినట్లు ఎంసెట్-2014 కన్వీనర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు వివరాలు, దరఖాస్తుల ప్రక్రియ, ఆన్లైన్ సబ్మిషన్కు సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్ (ఠీఠీఠీ.్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.ౌటజ)లో పొందవచ్చని వివరించారు. 3 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: మార్చి 3 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్లు, హ్యాండ్లూమ్ వీవింగ్ రెండు గ్రేడ్లు, టైలరింగ్ రెండు గ్రేడ్ల పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శి పరీక్షకు ఏర్పాట్లు పూర్తి సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అవసరమైన సామగ్రిని ఇప్పటికే జిల్లాలకు పంపించింది. రెండుసార్లు దరఖాస్తు చేసిన 2,500కు పైగా అభ్యర్థుల దరఖాస్తుల్లో ఒక దానిని తిరస్కరించినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపారు. సీమాంధ్రలో ఉద్యోగులు సమ్మె విరమించడంతో 23వ తేదీన పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇగ్నోలో ప్రవేశాలకు 23న రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంఫిల్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ డెరైక్టర్ కామేశ్వరి మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని చెప్పారు. హాల్‌టికెట్లను ఠీఠీఠీ.జీజౌఠ.్చఛి.జీ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.