సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లో వయోపరిమితిపై అయోమయం నెలకొంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 39గా నిర్ధారించడంతో మెజార్టీ అభ్యర్థులకు దరఖాస్తు చేసే అంశంపై స్పష్టత కొరవడింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపడుతున్న ఉద్యోగాల భర్తీకి సం బంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా పేర్కొంటూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వయోపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ జీవో 190ని గతేడాది జూలై 8న జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో అప్పటివరకున్న గరిష్ట వయోపరిమితిగా ఉన్న 34 సంవత్సరాలు కాస్తా 44 సంవత్సరాలుగా మారింది. ఈ ఉత్తర్వులు 26 జూన్, 2019 వరకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు నియామకాల భర్తీలో గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా ఉంది. కానీ, గత వారం ప్రభుత్వం విడుదల చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాలుగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
9,355 ఉద్యోగాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతమున్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 31న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కు నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగాల సంఖ్య భారీగా ఉండటంతో నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య తీవ్రమైంది. ఈ నోటిఫికేషన్‌పై దాదాపు రెండు నెలలుగా ప్రచారం జరుగుతుండటంతో కొందరు ముందస్తుగా శిక్షణ(కోచింగ్) సైతం పొందుతున్నారు. తాజాగా వెలువడిన ప్రకటనలో గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొనడంతో వారిలో నైరాశ్యం నెలకొంది. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా ప్రకటించాలని నిరుద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
మహిళలకు 3,158 పోస్టులు
ప్రభుత్వం భర్తీ చేయనున్న 9,355 జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో మహిళలకు మూడో వంతు చొప్పున 3,158 రిజర్వ్ చేశారు. మిగతా 6,197 పోస్టులను జనరల్ కేటగిరీలోకి చేర్చారు. పోస్టుల భర్తీకి సంబంధించి గత నెల 31న నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ రెండ్రోజుల క్రితం జిల్లాలవారీగా పోస్టుల వివరాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాలను పంచాయతీరాజ్ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 3 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాలి.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా జనరల్ మహిళలు మొత్తం
ఆదిలాబాద్ 221 114 335
భద్రాద్రి 257 130 387
జగిత్యాల 191 97 288
జనగాం 137 69 206
భూపాలపల్లి 201 103 304
జోగులాంబ 106 55 161
కామారెడ్డి 289 147 436
కరీంనగర్ 151 78 229
ఖమ్మం 323 162 485
కొమురంభీం 155 80 235
మహబూబాబాద్ 245 125 370
మహబూబ్‌నగర్ 340 171 511
మంచిర్యాల 153 79 232
మెదక్ 230 116 346
మేడ్చల్ 15 12 27
నాగర్‌కర్నూల్ 205 105 311
నల్లగొండ 439 222 661
నిర్మల్ 211 111 322
నిజామాబాద్ 269 136 405
పెద్దపల్లి 130 64 194
రాజన్న సిరిసిల్ల 118 59 177
రంగారెడ్డి 237 120 357
సంగారెడ్డి 297 149 446
సిద్దిపేట 223 115 338
సూర్యాపేట 227 115 342
వికారాబాద్ 285 144 429
వనపర్తి 104 55 159
వరంగల్‌రూరల్ 183 93 276
వరంగల్ అర్బన్ 52 27 79
యాదాద్రి 203 104 307
Comments
Please login to add a commentAdd a comment