సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
కాగా, దాదాపు నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. టీఎస్‌పీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది.
వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె.రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు.
రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్ 27న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment