జీవోలో 44 ఏళ్లు.. నోటిఫికేషన్‌లో 39 ఏళ్లు?  | High Court Slams Government Over Age Issue In Nitifification | Sakshi
Sakshi News home page

జీవోలో 44 ఏళ్లు.. నోటిఫికేషన్‌లో 39 ఏళ్లు? 

Published Thu, Sep 20 2018 2:19 AM | Last Updated on Thu, Sep 20 2018 9:49 AM

High Court Slams Government Over Age Issue In Nitifification - Sakshi

హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓసీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నోటిఫికేషన్‌లో మాత్రం గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లుగా పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల ఫలితాలను ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి వారిని పరీక్షకు అనుమతించాలని పేర్కొంది.

ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓసీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ 2017లో జీవో 190 జారీ చేసింది. అయితే జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో మాత్రం ఓసీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 39 సంవత్సరాలుగా పేర్కొంది. ఈ వైరుధ్యాన్ని సవాల్‌ చేస్తూ నల్లగొండకు చెందిన కె.జయధీర్‌రెడ్డి, మరో 9 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జె.కొండారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో ఓసీ అభ్యర్థుల వయోపరిమితిని 39 సంవత్సరాలుగా నిర్ణయించడం వల్ల అనేక మంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. అందులో పిటిషనర్లు కూడా ఉన్నారని వివరించారు. జీవో 190 ప్రకారం పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి వారిని పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. జీవోలో 44 ఏళ్లుగా గరిష్ట వయోపరిమితిని నిర్ణయించి, నోటిఫికేషన్‌లో 39 సంవత్సరాలుగా పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయో పరిమితి ప్రాథమికంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement