కార్యదర్శిపై దాడి చే స్తున్న ఏఎన్‌ఎం, ఆమె బంధువులు
తూర్పుగోదావరి , నెల్లిపాక (రంపచోడవరం): ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంగా తమను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ఆగ్రహం చెందిన గౌరీదేవిపేట పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు వారి బంధువులు గురువారం తోటపల్లి పంచాయతీ కార్యదర్శికి దేహశుద్ధి చేశారు. పింఛన్ల పంపిణీ చేస్తున్న ప్రదేశానికి మూకుమ్మడిగా వెళ్లిన వైద్య సిబ్బంది కార్యదర్శిని నిలదీశారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన బాధిత సెకండ్ ఏఎన్‌ఎం, ఆమె బంధువులు కార్యదర్శిపై విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతడు అక్కడి నుంచి పరుగులుపెట్టి ఎదురుగా ఉన్న సహకార సంస్థ గోడౌన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయినా శాంతించని ఏఎన్‌ఎంలు వారి బంధువులు తలుపులు బలవంతంగా తెరిచి కార్యదర్శిని బయటకు లాక్కొని వచ్చారు. ఈ క్రమంలో కార్యదర్శి పింఛన్ల పంపిణీ నిలిపివేసి ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు.
తోటపల్లి కార్యదర్శిని నిలదీస్తున్న ఏఎన్‌ఎంలు
ఇదీ విషయం..
గౌరీదేవిపేట పీహెచ్‌సీలో సెకండ్ ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఓ యువతి తల్లికి వితంతు పింఛను వస్తోంది. అయితే గౌరీదేవిపేట పరిధిలో కాకుండా తోటపల్లి పరిధిలో నమోదుకావడంతో కొన్ని నెలలుగా అక్కడి నుంచే పింఛను పొందుతోంది. పింఛను ఇచ్చే క్రమంలో ‘మీ అమ్మను తీసుకురా?’ అంటూ తన సెల్‌కు అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతూ తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని సెకండ్ ఏఎన్‌ఎం ఆవేదన వ్యక్తం చేసింది. పింఛను గౌరీదేవిపేట పరిధిలోకి మార్చండని వేడుకున్నా నిర్లక్ష్యం చేస్తున్నాడని వాపోయింది. నిత్యం గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఏదోఒక సమచారం కావాలంటూ తీవ్ర ఇబ్బందులు పెడుతూ తమపై దురుసుగా వ్యవహరిస్తున్నాడని అక్కడ ఉన్న ఏఎన్‌ఎంలు ఆరోపించారు. కొందరికి సెల్‌ఫోన్ ద్వారా అభ్యంతరకర మెసేజ్‌లు పెడుతున్నాడని, దీనివలన కుటుంబంలో కలహాలు నెలకొన్న సందర్భాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ విషయంపై ఎటపాక పోలీసులకు, మండల పరిషత్ అధికారులకు వైద్యశాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment