పైసలు లేక పస్తులు  | New Panchayat Secretary Salaries Pending In Telangana | Sakshi
Sakshi News home page

పైసలు లేక పస్తులు 

Published Thu, Aug 1 2019 1:01 PM | Last Updated on Thu, Aug 1 2019 1:01 PM

New Panchayat Secretary Salaries Pending In Telangana - Sakshi

సాక్షి, నెక్కొండ(వరంగల్‌) : వారంతా ప్రతి దినం విధులకు హాజరుకావాల్సిందే. చేసేది చిన్న ఉద్యోగం.. కాని ఒకటి కాదు నాలుగునెలలైనా జీతం అందలేదు. ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలా.. నాలుగునెలలైనా వేతనం అందక దిగులుపడాలా తెలియని పరిస్థితిలో కొత్త పంచాయతీ కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారు. విధుల్లో చేరి దాదాపు నాలుగు మాసాలు గడుస్తున్నా ఇంతవరకూ మొదటి వేతనం ఎట్లుంటదో చూద్దమన్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఇక కొందరికైతే సొంత ఊళ్లు కాకుండా వేరే చోట డ్యూటీ కేటాయించడంతో రోజువారిగా రాకపోకల ఖర్చులతో పాటు కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జిల్లాలోని కొత్తగా విధుల్లో చేరిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వ్యథ వర్ణనాతీతం. 

276 మంది ..
పంచాయతీల్లో కీలక పాత్ర పోషించే కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పంచాయతీ పాలన గాడితప్పింది. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అయితే గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం అక్టోబర్‌లో రాత పరీక్ష నిర్వహించింది. డిసెంబర్‌ 19న ఫలితాలు ప్రకటించిన విషయం విధితమే. ఇదిలా ఉండగా ఫలితాలపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్‌ 12న జిల్లాలో మొత్తం 276 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు కార్యదర్శులు విధుల్లో చేరలేదని సమాచారం. మొత్తం 270 మంది జూనియర్‌ కార్యదర్శులు అప్పటినుంచి విధుల్లో చేరి పని చేస్తుండగా ఇప్పటివరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. కార్యదర్శులకు మూలవేతనం రూ.15 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌గా పరిగణించిన అనంతరం పని తీరు ఆధారంగా శాశ్వత కార్యదర్శులుగా గుర్తించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఆర్థిక ఇబ్బందుల్లో..
నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో పలువురు కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పలువురు కార్యదర్శులకు సొంత మండలాల పరిధిలో కాకుండా ఇతర మండలాల్లోని పంచాయతీల్లో కార్యదర్శులుగా నియమించారు. సొంత నివాసం నుంచి విధులు నిర్వహించాల్సిన గ్రామానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. ప్రధానంగా మహిళ కార్యదర్శులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు ఎంప్లాయ్‌ ఐడీ కార్డులు జారీ చేయలేదు. జీతాలు చెల్లించేందుకు ఉద్యోగుల ఐడీకార్డు అవసరముంటుంది. ఉద్యోగి వివరాలు డీపీఓ కార్యాలయం, ట్రెజరీకి పంపినట్లయితే జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులతో విధులకు..
జీతాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో విధులకు హాజరవుతున్నాం. మొదటి జీతమైనా తీసుకోకపోవడం దురదృష్టకరం. రోజువారీ ఖర్చులకే పడరాని పాట్లు పడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం మా ఇబ్బందుల్ని గుర్తించాలె. నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం.
– ఆనంద్, నెక్కొండ, తండా జీపీ జూనియర్‌ కార్యదర్శి

జీతాలిచ్చి ఆదుకోవాలే...
జీతాలు లేక నాలుగు నెలలయితానయ్‌. ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించడం స్వాగతిస్తున్నాం. మా గురించి ప్రభుత్వం ఆలో చించి ఆదుకోవాలి. కనీసం ఇంటి అవసరాలు సైతం తీర్చలేక పోతున్నామన్న బాధే వేధిస్తోంది. అప్పుల పాలవుతున్నాం. ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి.
– సురేష్, పిట్టకాలుబోడు తండా జీపీ కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement