
ఉమ్మడి వరంగల్‌లో పెరిగిన ప్రీ వెడ్డింగ్ షూటింగ్ సరదా
ఆధునిక కెమెరాలతో చిత్రీకరణ
భారీ ఖర్చుకు వెనకాడని నవ దంపతులు
కోటి ఆశలతో, వేల ఊసులతో ఒక్కటయ్యే అనుబంధం. నమ్మకమనే ఆస్తిని ఇద్దరి భుజస్కంధాలపై మోయాలనే మాటకు అసలైన అర్థం పెళ్లి. అంతటి ముఖ్యమైన ఘట్టంలోని మధుర క్షణాలు, జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందుకు నేటితరం ఆసక్తి చూపుతోంది. ఓ వైపు కల్యాణ మండపం, విందు.. మరోవైపు అందంగా.. ఆధునికంగా చిత్రాలు, వీడియోల చిత్రీకరణకు ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు. ఇందుకోసం కొత్తగా ‘ప్రీ వెడ్డింగ్ షూట్’కు యువత ఆసక్తి చూపిస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పెళ్లి చేసుకుంటున్న జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందమైన ఊహలు, దివ్యమైన ఆలోచనలకు రూపాన్నిచ్చేలా.. చక్కటి రూపం కల్పిస్తుండడంతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వధూవరుల ఇళ్లకు పరిమితమవ్వకుండా.. పచ్చదనంతో నిండిన అందమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. – తొర్రూరు
వెడ్డింగ్ షూట్ కొత్తపుంతలు..ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, కాజీపేట, నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర పట్టణాల్లో ఫొటో, వీడియోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతోంది. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’కు ప్రత్యేక చిత్రాలను తీయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
వీడియో, ఫొటోగ్రాఫర్లతో ఒప్పందం కుదుర్చుకునే ముందు.. గతంలో వారు తీసిన వీడియోలను చూశాకే బుక్ చేసుకుంటున్నారు. గతంలో కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ నాయకుల పిల్లలు మాత్రమే వీటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం అందరిలో ఆసక్తి పెరగడంతో ఆయా ప్రాంతాల్లో కొత్త విధానానికి మొగ్గు చూపుతున్నారు.

అందమైన కావ్యంలా..
అందమైన ప్రదేశంలో ఫొటో.. వీడియో షూట్లకు నవ వధూవరులు ఆసక్తి చూపుతున్నారు. వివాహానికి ముందే వధూవరులు తమ హావభావాలు, సంభాషణలు, సాన్నిహిత్యాన్ని చిత్రీకరించుకుంటున్నారు. భిన్న కోణాల్లో చూసుకుని మురిసిపోయేందుకు.. రేపటి తరానికి చూపించేందుకు ఎంత వ్యయమైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ద్వారా ఆధునిక కెమెరాలతో ఓ సినిమా పాటలా చిత్రీకరిస్తున్నారు.
అత్యాధునిక కెమెరాలతో చిత్రీకరణ..
ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చిత్రీకరించేందుకు హైడెన్సిటీ (హెచ్డీ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు డీఎస్‌ఎల్‌ఆర్, డ్రోన్, 5డీ, మార్క్ 3, మార్క్ 4, సోని, 1 డీఎక్స్, 1 డీఎక్స్ మార్క్ తదితర కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఒక షూట్ చేయడానికి కనీసం నలుగురు కెమెరామన్లు పని చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.

ఒక్కొక్క కెమెరాకు ఒక్కొక్క లెన్స్‌లను ఉపయోగించి వధూవరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మూడు నుంచి 4 నిమిషాల నిడివిగల పాటకు సుమారు 2 నుంచి 3 రోజుల పాటు పని చేస్తారు. ఒక పాటకు ఒక్కోసారి ప్రదేశాలను కూడా మార్చాల్సి ఉంటుంది. ప్రదేశం మారిన సమయంలో దుస్తులను మార్చుకోవడం, మేకప్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమయం ఎక్కువ పడుతుంది.
ఎడిటింగ్ కీలకం..
వధూవరులపై సన్నివేశాల చిత్రీకరణ కెమెరామెన్ల ఆలోచన, సృజనాత్మకతను బట్టి ఉంటుంది. ఒక్కోసారి వధూవరుల ఆలోచనలకూ ప్రాధాన్యమిస్తారు. చిత్రీకరణకు 2 నుంచి 3 రోజుల సమయం పట్టినా దాన్ని పాట రూపంలో తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటోంది. ఎడిటింగ్‌కు కనీసం 10 రోజుల సమయం పడుతుంది. ఈ మేరకు సీన్‌కట్, ఈడీఎస్, ప్రీమియర్, ఆప్టర్ ఎఫెక్ట్స్ వంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగిస్తారు.

వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతున్నారు. లక్నవరం చెరువు, రామప్ప లేక్, పాకాల చెరువు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, గోవిందరాజుల గుట్ట, ఏటూరునాగారం అభయారణ్యం, పాకాల అభయారణ్యం, వేయిస్తంభాల గుడి, కాకతీయ రాక్ గార్డెన్, భద్రకాళి టెంపుల్ తదితర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహిస్తున్నారు.
లక్షలు ఖర్చయినా లక్షణంగా..
గతంలో పెళ్లికి ఫొటోలు, వీడియో తీయించుకోవాలంటే తెలిసిన ఫొటోగ్రాఫర్లకు చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా ఆల్బమ్‌లు, వీడియోలు అన్ని కలిపి ప్యాకేజీగా తీసుకుంటున్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలు రకాల ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా ఉంటాయి. వివాహానికి కొద్ది రోజుల ముందు, వివాహమైన తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ చేసి వీడియోలను చిత్రీకరిస్తున్నారు.
వాట్సాప్, ఫేస్‌బుక్‌లో షేరింగ్..
గతంలో వివాహాలంటే చాలా రోజుల ముందు నుంచే హడావుడి మొదలయ్యేది. బంధువులు, స్నేహితులకు శుభలేఖల పంపిణీ చేయడం పెద్ద ప్రహసనంగా మారిపోయేది. కానీ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ పుణ్యమా.. అని ఆ శ్రమ లేకుండా పోయింది. ప్రీ షూట్ చేశాక పెళ్లికి ముందు తమ సమీప బంధువులు, స్నేహితులకు అందరికీ వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పంపుకొంటున్నారు. ఈ డిజిటల్ ఆహ్వానాన్నే పెళ్లి కార్డుగా ఉపయోగిస్తున్నారు.
పెరిగిన ఉపాధి..
ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు పెళ్లిళ్ల సీజన్‌లో మాత్రమే పని ఉండేది. ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుండటంతో వారికి గిరాకీ పెరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల పెళ్లికి ముందు, తర్వాత కూడా చేతినిండా పని దొరుకుతుంది. సమర్థవంతులైన ఫొటోగ్రాఫర్లు బృందాలుగా ఏర్పడి వేడుకలను నిర్వహిస్తున్నారు. యువతరం ఆసక్తి పెరగడంతో నాణ్యతతో కూడిన అత్యాధునిక కెమెరాలను ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వినియోగిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment