
విదేశీ మహిళ దాతృత్వంతో ఆర్థికంగా నిలదొక్కుకున్న కుమ్మరిగూడెం గ్రామస్తులు
జాతి ఆవుల దానం.. విదేశాలకు నెయ్యి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన గ్రామస్తులు
యూఎస్, యూకే, జర్మనీ వంటగదుల్లో ఘుమఘుమలాడుతున్న కుమ్మరిగూడెం నెయ్యి
సాక్షి ప్రతినిధి, వరంగల్/వేలేరు: కుమ్మరిగూడెం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు అమెరికా, యూకే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే అప్పుల ఊబి నుంచి బయటపడి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది.
జర్మన్ మహిళ దాతృత్వంతో..
సత్యసాయి బాబా భక్తురాలు, దాతృత్వశీలి అయిన మోనికా రేటరింగ్(జర్మనీ) భారత్‌లో పర్యటిస్తూ.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలేకర్ సాగు విధానంపై శిక్షణ పొందిన కుమ్మరిగూడెంవాసి మారుపాక కోటి, మహర్షి గోశాల నిర్వాహకుడు సర్జన రమేష్ ద్వారా కుమ్మరిగూడెం సహా చుట్టుపక్కల గ్రామాల్లో స్వయంగా పర్యటించారు.అన్నదాతల ఇబ్బందులను ఆమె గుర్తించారు. వారిని ఎలాగైనా ఆదుకోవాలనుకున్న మోనికా రేటరింగ్.. గ్రామస్తులను పాడిపరిశ్రమ వైపు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది రైతులను గుజరాత్ తీసుకెళ్లి రూ. 50 వేల చొప్పున 30 గిర్ జాతి ఆవులను కొనిచ్చారు. అలాగే నెయ్యి తీసే యంత్రాన్ని కూడా రైతులకు అందించారు.
మోనికా రేటరింగ్ అందించిన ఆర్థిక చేయూతతో కుమ్మరి గూడెం రైతులు క్రమంగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన గిర్ జాతి ఆవు పాలతో గ్రామస్తులు నెలకు సుమారు 50కిలోల మేర తయారు చేస్తున్న నెయ్యికి భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా కిలో ఆవు నెయ్యి తయారీకి 20 లీటర్ల పాలు అవసర మవుతుంది. కుమ్మరి గూడెం రైతులు మాత్రం కిలో నెయ్యి (Ghee) తయారీకి 30 నుంచి 35 లీటర్ల పాలను ఉపయో గిస్తున్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా మారడంతో కిలో రూ.4 వేలకు పైగా వెచ్చించి మరీ కొంటున్నారు.
ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు కూడా ఫోన్ చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. అమెరికాలోని డాలస్, యూకేలోని లండన్, జర్మనీలో ఉంటున్న వారు సైతం ఫోన్ చేసి నెయ్యి ఆర్డర్ చేస్తున్నారు. వారికి స్పీడ్ పోస్ట్, కార్గో సర్వీస్‌ల ద్వారా నెయ్యిని పంపిస్తున్నారు. హనుమ కొండ, వరంగల్, హైదరాబాద్‌లలోని ఆయుర్వేద వైద్యులు సైతం ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు.
ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతోంది..
నాకున్న ఎకరంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. అలాగే పశుపోషణ చేస్తున్నాను. ప్రస్తుతం ఒక గిర్ ఆవు పాలు ఇస్తోంది. ప్రతి నెలా పాలబిల్లు రూ. 7–8 వేలు వస్తోంది. దీంతో మా కుటుంబ నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది.
– మారుపాక రవి, కుమ్మరిగూడెం గ్రామస్తుడు
ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి..
మేము గ్రామంలోనే నెయ్యి తయారు చేసి దేశవిదేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి చాలా డిమాండ్ ఉంది. మాకు ప్రభుత్వం సహకారం అందించి రుణాలు మంజూరు చేస్తే చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
– మారుపాక రాజు, పాలకేంద్రం నిర్వాహకుడు, కుమ్మరిగూడెం
సంతృప్తిగా ఉంది..
కుమ్మరిగూడెం (Kummarigudem) ఏడేళ్లలో సాధించిన ప్రగతిని చూసి ఎంతో ఆనందిస్తున్నా. ఇప్పుడు ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ఇంగ్లిష్ మాట్లాడే యువకులు నా వెంట నడుస్తూ విజయగాథలు వివరిస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రామస్తులు ఫోన్ చేసి వారి ఆవులను చూసేందుకు రావాలని, జీవితంలో ఎంతో బాగుపడ్డామని చెబుతుండటం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.
– మోనికా రేటరింగ్
Comments
Please login to add a commentAdd a comment