panchayathi raj
-
చెక్ పవర్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, వారికి అందాల్సిన కనీస వసతుల కల్పనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం పల్లెలకు ఇబ్బందికరం గా మారుతోంది. కొత్త పాలకవర్గాలు ప్రజల కోసం పనిచేసే పరిస్థితి లేకుండాపోయింది. వేసవిలో తాగునీరు సమస్యలను తీర్చేందుకు పాలకవర్గాలకు ఏమాత్రం అవకాశం లేకుండాపోయింది. బోర్లు, మోటార్లు, స్టార్టర్లు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చివరికి పారిశుధ్య కార్మికులకు చీపుర్లు, ఆఫీసు అవసరం కోసం కాగితాలు సైతం కొనలేని స్థితిలో పంచాయతీలు నడుస్తున్నాయి. కొత్త పాలకవర్గాలు కొలవుదీరి 4నెలలు పూర్తయినా గ్రామపంచాయతీ నిధుల చెక్‌పవర్ అధికారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్ చట్టం అమల్లోఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే కంటే ఏడాది ముందు నుంచీ గ్రామపంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. దీంతో కొత్త పనులేవీ మొదలుకాలేదు. మౌలికవసతుల కల్పన, పునరుద్ధరణ పనులను పట్టించుకోలేదు. కొత్త పాలకవర్గాలు వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందనుకుంటే అదీ జరగడంలేదు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేసింది. గ్రామపంచాయతీలకు వివిధ రకాలుగా సమకూరిన నిధులను గ్రామపంచాయతీ తీర్మానాల మేరకు పాలకవర్గాలు ఖర్చు చేస్తాయి. నిధుల విడుదల కోసం ‘జాయింట్ చెక్ పవర్’విధానం కొనసాగుతోంది. గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సంయుక్తంగా జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ విధానాన్ని మార్చింది. సర్పంచులు, ఉప సర్పంచులకు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ఇచ్చింది. చట్టం అమలు చేసేందుకు అన్ని అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కీలకమైన 7 విషయాలపై మాత్రం ఉత్తర్వులు జారీ చేయడంలేదు. జాయింట్ చెక్‌పవర్ విషయంలోనూ ప్రభుత్వం కొత్త చట్టంలోని నిబంధన ప్రకారం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. మరోవైపు పాత చట్టం ప్రకారం సర్పంచ్, కార్యదర్శి కలిపి ఉండే జాయింట్ చెక్‌పవర్ విధానం అమలు కావడంలేదు. దీంతో గ్రామపంచాయతీల్లో నిధులు విడుదలకు బ్రేక్ పడింది. దీంతో కొత్త పాలకవర్గాలు సైతం గ్రామపంచాయతీల్లో ఎలాంటి పనులు చేపట్టడంలేదు. తాగునీటి, కరెంటు సరఫరా వంటి ముఖ్యమైన పనులకు సైతం నిధుల విడుదల లేక ముందుకు సాగడంలేదు. అత్యవసర పనుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. సర్పంచ్ల దీనస్థితి గ్రామపంచాయతీ నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారు. సొంతంగా సమకూరిన నిధులు సైతం ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాలకు తమ వంతుగా ఏదో చేయాలని భావించి ఎన్నికల్లో పోటీ చేసిన తమకు కొత్తలోనే చేతులు కట్టేసినట్లుగా ఉందని కొందరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు సంగతి పక్కనపెడితే.. కనీస అవసరాలు సైతం తీర్చలేని దుస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు చెక్‌పవర్‌పై ప్రత్యేకంగా మెమోలు జారీ చేశారు. పాత విధానంలోనే నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు ఈ విషయంలో ధైర్యం చేయడంలేదు. చెక్‌పవర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు నిధుల విడుదలకు దూరంగా ఉంటున్నారు. -
గణతంత్ర విజయం.. పంచాయతీరాజ్ వ్యవస్థ
70ఏళ్ల భారత గణతంత్ర సుదీర్ఘ ప్రస్థానంలో సాధించిన అతిగొప్ప విజయం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఢిల్లీ పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం లక్ష్యంతో మొదలైన పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా వరకు ఉద్దేశిత లక్ష్యాలను చేరుకుంది. జనాభాలో సగంగా ఉన్న మహిళలు ఇప్పుడు 50% స్థానిక సంస్థలను పాలిస్తున్నారు. ఊరికి దూరంగా బతుకులీడ్చిన దళితులు కూడా అధికారంలో భాగస్వాములయ్యారు. అయితే, ఇలాంటి విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ.. అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ పరిష్కరించుకోగలిగితే ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా భారత్ ఆదర్శవంతమవుతుంది. 73వ రాజ్యాంగ సవరణతో.. ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయి వరకు విస్తరింపచేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చి ంది. పాలనలో పంచాయతీ ప్రతినిధులు భాగస్వాములయ్యారు. గ్రామస్థాయి పాలనలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. తమ సమస్యలను తామే గుర్తించి వాటి పరిష్కారాలను కూడా తామే నిర్ణయించుకునే అధికారం పంచాయతీ ప్రతినిధులకు దక్కింది. తద్వారా నిధుల వినియోగం, పాలనలో పారదర్శకత ఏర్పడింది. ఆ మేరకు రాష్ట్రాలు పంచాయతీలకు అవసరమైన అధికారాలు బదిలీ చేయడానికి వీలైంది. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారులతో గ్రామ పాలన సాగించేది. అధికారులకు స్థానిక సమస్యల పట్ల అవగాహన లేమి కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడేది. గ్రామాలపై అధికారుల పెత్తనం కొనసాగేది. పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు, విధుల వికేంద్రీకరణ వల్ల అవి బలమైన పాలన కేంద్రాలుగా తయారవుతాయనడంలో సందేహం లేదు.స్థానికుల అవసరాలను తీర్చగలుగుతాయి. వారికి జవాబుదారీగా ఉంటాయి. మహిళలకు పగ్గాలు.. ప్రస్తుతం దేశంలో 2,32,332 గ్రామ పంచాయతీలు, 6000 మండల/సమితులు, 534 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు 27,75,858 మంది, మండల/సమితులకు 1,44,491 మంది, జిల్లా పరిషత్‌లకు 15,067 మంది ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. వీటిలో 75వేల పంచాయతీలు, 2వేల మండల పరిషత్‌లు 175 జిల్లా పరిషత్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ల కారణంగా పలువురు ఎస్సీ,ఎస్టీలు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికవుతున్నారు. పాలనలో భాగస్వాములవుతున్నారు. దేశ వ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ విజయవంతం అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం స్థానిక సంస్థలు కూడా పార్లమెంటు, అసెంబ్లీల్లాగే రాజ్యాంగబద్ధ సంస్థలే. వాటిలాగే ఇవి కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి. చాలా స్థానిక సంస్థలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల పాలనాపరంగా పంచాయతీలకు నేటికీ పూర్తి స్వయంప్రతిపత్తి లభించడం లేదు. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదా సీనంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. నిధుల కేటాయింపులో రాజకీయ ఒత్తిళ్లు, కాం ట్రాక్టర్ల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రక్రి యలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోం ది. కొన్ని రాష్ట్రాలు పంచాయతీల నిధులను కూడా ఏదో వంకతో పక్కదారి పట్టిస్తున్నాయి. సమాంతర పాలన.. పంచాయతీల అధికారాల్ని దెబ్బతీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పార్టీ తరఫున గ్రామ సభలు/కమిటీలు ఏర్పాటు చేయడం, పంచాయతీ నిధుల్ని పక్కదారి పట్టించడం చేస్తున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పంచాయతీలతో సంబంధం లేకుండా అభివృద్ధి పథకాలు అమలు పరచడం కూడా పంచాయతీ వ్యవస్థను బలహీనపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ జన్మభూమి కమిటీల ద్వారా సమాంతర పాలన సాగిస్తోంది. మౌలిక వసతుల కొరత.. దేశవ్యాప్తంగా 2.52 లక్షల పంచాయతీలు ఉంటే, వాటిలో 60వేల పంచాయతీలకు సొంత భవనాలు కూడా లేవు. చాలా పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కూడా అరకొరగానే ఉన్నాయి. ప్రభుత్వం ఈ–గవర్నెన్స్ ప్రవేశపెట్టినా దానిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన సదుపాయాలు చాలా పంచాయతీలకు లేవు. సాంకేతిక నిపుణుల కొరత, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా పంచాయతీలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోలేక అభివృద్ధిలో వెనకబడుతున్నాయి. పేరుకు స్వయం నిర్ణయాధికారాలు ఉన్నా పరోక్షంగా ఇవి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలుగా వాటి అదుపాజ్ఞల్లోనే పని చేయాల్సి వస్తోంది. స్వయం ప్రతిపత్తి లేదు. మూడంచెల మధ్య సమన్వయం, సామరస్యం లోపిస్తోంది. జవసత్వాలిచ్చిన సవరణ 73వ రాజ్యాంగ సరవణ పంచాయతీలకు కొత్త అధికారాలు కల్పించడమే కాక దాని స్వభావాన్ని కూడా మార్చివేసింది. అంతకు ముందు పంచాయతీలు రాజ్యాంగ సంస్థలు కావు. కేవలం అమలు కమిటీలుగానే ఉండేవి. వాటిలో రాజకీయ పార్టీలకు ఏ సంబంధం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగతంగానే పోటీ చేసేవారు. 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీల్లో రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. వాటికి స్వయం నిర్ణయాధికారం లభించింది. పంచాయతీల్లో బలహీనవర్గాలు, మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. దేశమంతటా రెండు, మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటయింది. నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట రాజస్థాన్ ప్రభుత్వం 1959లో నాగపూర్ జిల్లాలో ప్రవేశపెట్టింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. రాజస్తాన్ రెండో సీఎం బల్వంత్రాయ్ను ‘పంచాయతీ పిత’గా పేర్కొంటారు. ఆయన ఆధ్వర్యంలో వేసిన కమిటీ సిఫారసు మేరకే దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. వైఫల్యాల్లోంచి పుట్టిన ఆలోచన దేశాభివృద్ధి కోసం1952లో నాటి ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించింది. అయితే, ఇవి ఆశించిన ఫలితాలనివ్వలేదు. గ్రామస్థాయికి ఆ పథకాలు వెళ్లకపోవడం, పంచాయతీలు వాటిని సమర్థవంతంగా అమలు పరచలేకపోవడమే దీనికి కారణమన్న భావన వ్యక్తమయింది. పరిపాలన కేంద్రీకృతం కావడం వల్ల గ్రామ స్థాయిలో పథకాల అమలుపై పర్యవేక్షణ లోపించింది, అవినీతి పెరిగింది. జవాబుదారీ తనం లోపించింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై, అధికారులపై నమ్మకం పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడానికి, అభివృద్ధి పథకాలు గ్రామ స్థాయిలో పూర్తిగా అమలు కావడానికి అధికార వికేంద్రీకరణ అవసరమని పెద్దలు భావించారు. దాంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టుకొచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. 1990లో జనతా ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యాల అధ్యయనానికి అశోక్ మెహతా కమిటీని వేసింది. రాజీవ్ గాంధీ (1989), వీపీ సింగ్(1990), పీవీ నరసింహారావు(1991) ప్రభుత్వాలు ఈ వ్యవస్థ బలోపేతానికి పలు సవరణలు చేశాయి. వీటన్నిటి కారణంగానే.. 73వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. -
మూడేళ్లయినా ముందుకు సాగట్లే !
పర్యాటకులను అలరించే ప్రకృతి అందాలకు నిలయం కిన్నెరసాని. నెమళ్లు, దుప్పులు, బాతులు.. ఇలా పలు రకాల పక్షులు, వన్యప్రాణులతో పాటు రిజర్వాయర్‌లో బోటు షికారు చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే దీన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దాలని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆహ్లాదం పెంచాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కూడా మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం పర్యాటకులకు శాపంగా మారింది. పాల్వంచరూరల్: కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు నిత్యం వందలాది మంది ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు, వివిధ రకాల పక్షులు వారిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశాయి. కానీ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అభివృద్ధికి ఆటంకంగా మారింది. మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే కేటాయింపు.. కిన్నెరసాని పర్యాటక అభివృద్ధికి 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకో టూరిజం అభివృద్ధి కింద రూ.7.53 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కొత్తగూడెంలో టూరిజం హోటల్, కిన్నెరసానిలో అద్దాలమేడ, పది కాటేజీల పునర్నిర్మాణం, ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. పనులను దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ 9 కాటేజీలకు స్లాబ్‌లు వేశారు. రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న అద్దాల మేడకు ఇంకా స్లాబ్ వేయలేదు. ఈ పనులన్నీ గత మూడేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. నిర్దేశిత గడువు పూర్తయి కూడా ఏడాది దాటింది. ఇంకా ఎంత కాలానికి నిర్మాణ పనులు పూర్తిచేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో శిథిలమైన కాటేజీలు, అద్దాలమేడ స్థానంలో కొత్తగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయా అని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫుడ్‌కోర్టు సైతం అసంపూర్తిగానే మిగిలింది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.. గత ఏడాది రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌తోపాటు అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కిన్నెరసానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అంసతృప్తి, ఆశ్చర్యానికి లోనయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అయితే ఆ ఆదేశాలను కాంట్రాక్టర్ పట్టించుకున్న పాపాన పోలేదు. 2018 డిసెంబర్ వస్తున్నా పనులు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆదేశిస్తే పనుల్లో వేగం పెంచకపోగా.. దీపావళి పండగ తర్వాత ఇప్పటివరకు పూర్తిగా నిలిపివేశారు. ఇక అద్దాలమేడ, తొమ్మిది కాటేజీలు, ఫుడ్‌కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి దొడ్డు ఇసుకను వినియోగిస్తున్నారని పర్యాటకులు అంటున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి గడువు విధించాం కిన్నెరసాని, కొత్తగూడెంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. కిన్నెరసానిలో అద్దాలమేడ రెండు అంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేయాల్సి ఉంది. పది కాటేజీలకు స్లాబ్‌ల నిర్మాణం పూర్తయింది. కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్ నిర్మాణం పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రెండోసారి విధించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – శంకర్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ -
ఒకే ఒక్కడు..
‘చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు’.. అన్నట్లు తయారైంది ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి వ్యవహారం. ఓ ప్రజాప్రతినిధి మనిషిని అంటూ కార్యాలయానికి వచ్చేవారిని బెదిరిస్తున్నాడు. ఆ ఉద్యోగి మాట కాదన్నారంటే చాలు ఏకంగా కార్యాలయాన్నే తరలిస్తాం.. అంటూ హెచ్చరికలూ జారీ చేస్తున్నాడు! ఇదెక్కడి లేనిపోని తలనొప్పి అంటూ అక్కడికి వచ్చే కాంట్రాక్టర్లు, ఇతర ఉద్యోగులు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతి తడిపి పని చేసుకుంటున్నారు. లేదంటే ఫైలు కదలదండోయ్! బాన్సువాడ టౌన్ : డివిజన్ కేంద్రంలోని పంచాయ తీ రాజ్ కార్యాలయంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి బరితెగించాడు. బోధన్ ఎమ్మెల్యే అనుచరుడిని.. అం టూ సదరు ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన పట్టించుకునేనాథుడే కరువయ్యా రు. సదరు ఎమ్మెల్యే పేరు చెప్పి బాన్సువాడలో ఉ న్న పంచాయత్ రాజ్ డివిజన్ కార్యాలయాన్ని బో ధన్‌కు తరలిస్తానని బెదిరిస్తున్నారు. నిత్యం బిల్లు ల కోసం కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్ల నుం చి అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాన్సువాడ పంచాయత్ రాజ్ డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ అన్ని తానై వ్యవరిస్తున్నారు. సదరు ఆపరేటర్ జుక్కల్ నియో జకర్గ బాధ్యతలు వ్యవరిస్తున్నారు. జుక్కల్ నియో జకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా ఆ పనికి సంబంధించిన ప్రతి బిల్లు ఈ ఆపరేటర్ కంప్యూటరీకరణ చేసి ఫైల్‌ను ఉన్నతాధికారి టేబుల్‌పైకి పం పిస్తారు. జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, మద్నూర్ మండలాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, మెట ల్ రోడ్లుకు సంబంధించిన బిల్లులు మంజూ రు కావాలంటే సదరు కాంట్రాక్టర్లు బాన్సువాడ డివిజన్ కార్యాలయానికి రావాల్సిందే. కార్యాల యం లోకి రాగానే ముందుగానే సదరు ఆపరేటర్ ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆపరేటర్‌ను కలిసి బిల్లుకు సంబంధించిన పత్రాలను కంప్యూటర్లో నమోదు చేసి ఫైల్‌ను డీఈ, ఈఈ టేబుల్‌పైకి పం పించాలి. ఫైల్ కదలాలంటే సదరు ఆపరేటర్ చేయి తడపాల్సిందే. చేయి తడిపితేనే ఫైల్ ప్రాసె స్ ముందుకు కదులుతుంది. లేదంటే ఏదో ఓ సాకు చెప్పి ఫైల్ వెనక్కివెళ్తుంది. కార్యాలయానికి వచ్చే ఏ వ్యక్తితోనైన మాటలు కలుపుకుని బాన్సువాడలో ఉన్న డివిజన్ కార్యాలయంలో బోధన్‌కు తరలిస్తానని చెప్పడం అలవాటైంది. బోధన్ ఎమ్మెల్యేతో నాకు మంచి సంబంధాలు ఉ న్నాయని చెప్పడం గమనార్హం. జుక్కల్ నియోజకవర్గం కాంట్రాక్టర్లకే కాదు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అనుచరుల వద్ద కూడా ముక్కుపిండి మరి వసూలు చేసిన సంఘటలను ఉన్నా యని తెలిసింది. సదురు ఆపరేటర్ బోధన్, నిజా మాబాద్, ఆర్మూర్ ప్రాంతాలో రూ.కోట్లాది విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. -
కొలువుల పండుగ
సాక్షి, హన్మకొండ అర్బన్ జయశంకర్ జిల్లా : పంచాయతీ కార్యదర్శుల పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉండడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. కానీ, జిల్లాలో భర్తీకి అవకాశం ఉన్న వాటిలో ఖాళీలు ఎక్కువగా లేకపోవడం కొంత నిరాశపరుస్తోంది. ఇదిలా ఉండగా నియామక ప్రక్రియ ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేపడతారా లేక కొత్త జిల్లాల ప్రాతిపదికన ఆయా జిల్లాల కలెక్టర్లు చేపడతారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకా రం..పాత వరంగల్ జిల్లా పరిధిలో 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి నాలుగు గ్రేడుల్లో 701 కార్యదర్శి పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 476 మంది వివిధ గ్రేడుల్లో కార్యదర్శులుగా పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భర్తీకి అవకాశం ఉన్న పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 ఖాళీలు 30 మా త్రమే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నియామక ప్రక్రియ చేపడితే వీటిని మాత్రమే భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తు తం 174మంది గ్రేడ్ -4 కార్యదర్శులు పనిచేస్తున్నారు. అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తే ఆ ఖా ళీలు కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. పదోన్నతులు ఇస్తేనే అవకాశం... ప్రస్తుతం పాత వరంగల్ జిల్లాలో గ్రేడ్-4 పంచా యతీ కార్యదర్శులుగా 174 మంది పనిచేస్తున్నా రు. వీరి పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తయితే గ్రేడ్-4లో మరో 100 ఖాళీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం 100కుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పదోన్నతులు, నియామకాల ప్రకియ మొత్తం జిల్లా కలెక్టర్ స్థాయిలో చేపట్టాల్సి ఉంది. అధికారులు చొరవ చూపితేనే కొత్త పోస్టులు పెరిగే అవకాకాశం ఉంటుంది. మొత్తం నాలుగు గ్రేడుల్లో... పంచాయతీ కార్యదర్శులు మొత్తం నాలుగు గ్రేడుల్లో పనిచేస్తుంటారు. గ్రేడ్ 1, 2, 3, 4గా వీరి హోదా ఉంటుంది. నియామక ప్రక్రియ మాత్రం గ్రేడ్–4లో ఉంటుంది. మిగతా హోదా పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్–4, 3 వారికి జిల్లా కలెక్టర్ పదోన్నతి కల్పించే అవకాశం ఉంటుంది. గ్రేడ్–2, 1 వారికి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. గ్రేడ్ –1 వారికి పదోన్నతి కల్పిస్తే ఈఓపీఆర్డీ హోదా పొందుతారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ స్థాయిలో అవకాశం ఉన్న 4, 3 గ్రేడుల్లో ఉమ్మడి జిల్లాలో 330 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరిలో మొదట గ్రేడ్–3 వారికి పదోన్నతి కల్పించాలి. తద్వారా ఏర్పడిన ఖాళీల్లో గ్రేడ్ –4 వారికి పదోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం గ్రేడ్–4లో ఉన్న 174లో ఏంత మంది పదోన్నతి పొందుతారన్న విషయం స్పష్టమవుతుంది. వారి పదోన్నతి ద్వారా ఏర్పడిన గ్రేడ్ –4 ఖాళీలు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్స్సీ) ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. 2013లో చివరగా భర్తీ.. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియ 2013లో చేపట్టారు. ఆ సమయంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, మెడికల్ ఇన్వాల్యూడేషన్ తదితర కేటగిరీల్లో కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి 25 శాతం అదనపు మార్కులు కలిపి సుమారు 130 పోస్టులు భర్తీ చేశారు. తర్వాత కొద్ది రోజులకు సాధారణ నోటిఫికేషన్ ద్వారా మరో 113 పోస్టులను భర్తీ చేశారు. మొత్తం 200కుపైగా పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా పంచాయతీ కార్యర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్త పంచాయతీలపై స్పష్టత కరువు పంచాయతీ కార్యదర్శుల ఖాళీల భర్తీని ఏ ప్రాతిపదికన చేపట్టినా కొత్త గ్రామ పంచాయతీల విషయంలో మరింత స్పష్ట రావాల్సి ఉంటుంది. ఆగస్టు ఒకటి నుంచి కొత్త గ్రామ పంచాతీయలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించినా సాంకేతికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాలేదు. గ్రామ పంచాయతీల ఏర్పాటు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆయా పంచాయతీల జనాభాను బట్టి పంచాయతీ కార్యదర్శుల పోస్టులు గుర్తిస్తారు. ఆ పోస్టులను పీఆర్ శాఖ, ఆర్థిక శాఖలు ఆమోదించి ఉత్తర్వులు వెలువరిస్తే..వాటిలో గ్రేడ్ –4 కార్యదర్శుల పోస్టులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భర్తీకి అవకాశం ఉంటుంది. కార్యదర్శుల భర్తీకి సత్వరం చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం కొత్త పంచాయతీల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 962 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 701 పంచాయతీలకు మాత్రమే పంచాయతీ కార్యదర్శి పోస్టులు మంజూరై ఉన్నాయి. మిగతా 261పంచాయతీలకు కార్యదర్శులు లేరు. ఈ పంచాయతీలు ఇన్చార్జిల పాలనలో ఉంటున్నాయి. 701 మంజూరు పోస్టులకు గాను ప్రసుతం 476 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిలో గ్రేడ్–1లో 49 మంది, గ్రేడ్–2లో 47 మంది, గ్రేడ్–3లో 156 మంది, గ్రేడ్–4లో 174 మంది పనిచేస్తున్నారు. వీరితోపాటు ఇతర శాఖల నుంచి పంచాయతీ కార్యదర్శులుగా వచ్చిన వారు 50 మంది ఉన్నా రు. మొత్తం 476 మంది పంచాయతీ కార్యదర్శులుగా వివిధ గ్రేడ్లలో పనిచేస్తున్నారు. గ్రేడ్–4లో 174 మంది పనిచేస్తుండగా.. వారిలో వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాలో గ్రేడ్–4 ఖాళీలకన్నా ఎక్కువ మంది కార్యదర్శులు ఉన్నారు. వీరందరూ గ్రేడ్–1,2,3 వారి స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆ మూడు జిల్లాలో గ్రేడ్–4 శాంక్షన్ పోస్టుల కన్నా పనిచేస్తున్న కార్యదర్శుల సంఖ్య ఎక్కువగా ఉంది. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం గ్రేడ్–4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భూపాలపల్లిలో గ్రేడ్ –4 పోస్టులు మొత్తం 95 ఉండగా 54 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్‌లో గ్రేడ్–4 పోస్టులు 55కాగా 21మంది మాత్రమే గ్రేడ్–4 స్థాయి కార్యదర్శులు ఉన్నారు. ఈ జిల్లాలో కూడా 34పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయడంతోపాటు ప్రతి పంచాయతీకి కార్యదర్శిని కేటాయిస్తే ఉమ్మడి జిల్లాకు ఇప్పటివరకు కార్యదర్శులు లేని 261 పోస్టులు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 30 పోస్టులు భర్తీకి అవకాశం ఉంటుంది. కొత్త జీపీలకు కార్యదర్శులను ఇస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఆగమార్గం
ఈ ఫొటోలో కనిపిస్తున్న కొత్త సీసీ రోడ్డు తాంసి మండలకేంద్రంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనం సమీపంలో నిర్మించింది. నాలుగు రోజుల కిందటే ఈ రోడ్డు వేశారు. రూ.5లక్షల అంచనా వ్యయంతో 175 మీటర్ల పొడవున నిర్మించారు. రోడ్డు మన్నికగా ఉండాలంటే రోజూ కనీసం ఉదయం, సాయంత్రమైనా వాటర్ క్యూరింగ్ చేయాల్సింది. ఇందు కోసం రోడ్డుపై ఎర్రమట్టితో కట్టలైతే వేశారు. కానీ అందులో నీళ్లు నింపిన దాఖలాలు కనబడటం లేదు. తూతూమంత్రంగా క్యూరింగ్ చేస్తున్నారు. ఏదో రోడ్డు వేశాం.. పని కానిచ్చామన్న రీతిలో వ్యవహారం సాగిందనేది ఈ రోడ్డు చూస్తేనే అర్థమవుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఇలాంటివి వందలాది రోడ్లు వేయనైతే వేశారు.. సరైన క్యూరింగ్ జరగకపోవ డంతో కొన్నేళ్ల పాటు మన్నికగా ఉండాల్సిన రోడ్డు మూన్నాళ్ల ముచ్చటయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సాక్షి,ఆదిలాబాద్ : బజార్హత్నూర్ మండలంలో ప్రస్తుతం 13 గ్రామపంచాయతీలు, వీటికింద 64 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ మండలానికి రూ.83లక్షలతో 43 రోడ్లు మంజూరయ్యాయి. మార్చి 31 వరకు కేవలం రూ.12.55 లక్షలతో బజార్హత్నూర్, జాతర్ల, గులాబ్‌తాండ గ్రామాల్లో మూడు రోడ్లు మాత్రమే అధికారులు గ్రౌండింగ్ చేశారు. గడువు ముగియడంతో ఇప్పుడు ఆ రోడ్లు వేసేది అనుమానమే. ఆ నిధులు వెనక్కి మళ్లే అవకాశం లేకపోలేదు. అధికారులు మాత్రం మండలంలో తీవ్ర నీటి సమస్య కారణంగా పనులను గ్రౌండింగ్ చేయలేకపోయామని చెబుతుండటం నమ్మాలో.. నమ్మరాదోనన్న పరిస్థితి. రోడ్లు మంజూరైనప్పటికీ మాన్కాపూర్, చిన్మితండా, అనంతపూర్, చిన్నహత్నూర్లో గ్రౌండింగ్ చేయని కారణంగా ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మించలేని పరిస్థితి. ఎన్నో ఏళ్ల కిందట ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు వేయగా, అవి పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. మళ్లీ సీసీ రోడ్డు మంజూరైందన్న ఆనందం ముచ్చటగానే మిగిలింది. అదేవిధంగా మండలంలోని ఆర్కాయి, చింతకర్ర గ్రామాలకు సీసీ రోడ్లు లేవు. అయినప్పటికి ఎన్ఆర్ఈజీఎస్లో ఈ గ్రామాలను పరిగణలోకి తీసుకోకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ఇది ప్రణాళిక లోపమా, మరేమిటి. జిల్లాలోని అనేక మండలాల్లోని గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. నిధులను వినియోగించుకోవడంలో పాలకులు, అధికారుల వైఫల్యమే ఈ పరిస్థితి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు ఆగమాగంగా సాగుతున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే ఉపాధి హామీ కింద ఈ రోడ్లను మంజూరు చేయడం, మార్చి 31లోగా పూర్తి చేయాలనే గడువు విధించడం, ఈజీఎస్ నిధులకు తోడు కొంతమొత్తం ఇతరత్రా నిధులు కలిపి ఈ పనులు చేపట్టాలని నిబంధన ఉండటం, ఇలా అనేక కారణాలతో ఏటా గడువు ముగిసేముందు హడావిడి కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. వారం రోజులుగా రోడ్ల పనులను ఆదరబాదరగా చేపడుతున్నారు. రోడ్డు వేశాం.. పనైపోయిందన్న రీతిలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా సైడ్‌బర్మ్ వేయకపోవడంతో ఆ రోడ్డు అంచులు కోల్పోయే దుస్థితి ఉంది. వాటర్ క్యూరింగ్ సరిగా చేయకపోవడంతో సిమెంట్ రోడ్డు పగుళ్లుతేలి మూన్నాళ్ల ముచ్చటగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మించాల్సిన సీసీ రోడ్ల నిర్మాణంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పలువురు నేతలు, నాయకులు తాము నివసించే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో దుస్థితి.. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామపంచాయతీలు ఉండగా, ఈ పంచాయతీల్లో 2,412 వార్డులు ఉన్నాయి. అనేక వార్డుల్లో సరైన రోడ్లు లేక గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల మండలాల్లోని అనేక గ్రామాల్లో రోడ్ల దుస్థితి కండ్లకు కడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏటా సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరవుతున్నా ప్రణాళికబద్ధంగా సాగడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని పలుమార్లు ఆదేశించారు. మరి ఆ ప్రతిపాదనలు అధికారులు సరైన కార్యాచరణ లేకుండానే రూపొందించారన్న అనుమానాలు లేకపోలేదు. అనేక గ్రామాల్లో రోడ్లు లేకపోయినా వాటిని అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం, అదేవిధంగా గడువు ముగిసే సమయం దగ్గరికి వచ్చినప్పుడే పనులు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. కొన్ని మండలాల్లో ఎక్కువ, మరికొన్ని మండలాల్లో తక్కువ, ఎక్కడబడితే అక్కడ రోడ్లు.. ఇలా ఈ ఎన్ఆర్ఈజీఎస్ రోడ్ల నిర్మాణంలో పరిస్థితి కనిపిస్తుంది. ఏటా మంజూరైన పనుల్లో సగం పనులే గ్రౌండింగ్ కావడం, మిగతా పనులు ల్యాప్స్ అయి నిధులు వెనక్కి మళ్లడం పరిపాటిగా మారింది. లేబర్ కంపోనెంటే కారణమా.. ఎన్ఆర్జీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులు కేటాయిస్తోంది. మిగతా 10శాతం నిధులను ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధుల నుంచి అయినా, ఎంపీలు ఎంపీ ల్యాడ్ ద్వారా అయినా, లేనిపక్షంలో గ్రామ పంచాయతీ నుంచే అయినా భరించిన పక్షంలోనే గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించే పరిస్థితి ఉంటుంది. వివిధ రాజకీయ కోణాల కారణంగా ఈ నిధుల మంజూరుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందుకు రాకపోవడం, గ్రామ పంచాయతీలు నిధుల లేమి కారణంగా అంతమొత్తంలో భరించలేమని చెప్పడంతో పనుల మంజూరులో ఆలస్యం జరుగుతుందన్న అపవాదు ఉంది. కాగా 90 శాతం ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరవ్వడంతో చేపట్టే ప్రతి రోడ్డు పనిలో 60శాతం లేబర్ కంపోనెంట్, 40 శాతం మెటీరియల్ కంపోనెంట్ తప్పనిసరి. అయితే మెటీరియల్ కంపోనెంటే ఈ సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో అధికంగా ఉండడంతో అధికారులు లేబర్ కంపోనెంట్‌ను అడ్డదారిలో సృష్టించడం ద్వారా ఈ రోడ్ల పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. లేబర్ కంపోనెంట్ విషయంలోనే సమస్య కారణంగా పూర్తిస్థాయిలో నిధులను వినియోగించుకోలేని దుస్థితి కనిపిస్తుందన్న విమర్శలు లేకపోలేదు. ఫిబ్రవరిలో ఈ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రావడం, అది కూడా నెలన్నర లోపల మార్చి 31లోగా పూర్తి చేయాలని చెప్పడంతో పంచాయతీల్లో ఏటా ఈ పనుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. ప్రధానంగా సర్పంచ్‌లు గ్రామ పంచాయతీలో తీర్మాణం చేసి ఈ పనులు నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టర్లకు అప్పగించడం జరుగుతుంది. అయితే చేసేది చిన్న పని అయినా బిల్లులు రావడంలో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఈ రోడ్ల నిర్మాణంపై పెట్టిన పెట్టుబడికి బయట నుంచి అప్పుగా తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీ పెరిగిపోవడంతో పనులపై ఆసక్తి చూపడంలేదన్న అభిప్రాయం లేకపోలేదు. నిబంధనల మేరకు పనులు చేపట్టాలని అధికారులు ఒత్తిడి చేయడం, పని చేపట్టాలంటే అటూ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు ఎంతోకొంత ముట్టజెప్పడం, అధికారులకు తప్పనిసరిగా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు మంజూరు అయ్యే పరిస్థితి ఉండడం, పనులు చేపట్టిన బిల్లులు ఎప్పడు వస్తాయో తెలియని పరిస్థితి కారణంగా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి కనబర్చడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిల్లుల మంజూరులో అధికారులకు మూడు నుంచి 5శాతం పర్సంటేజీ రూపంలో ఇస్తేనే ముందుకు సాగే పరిస్థితి ఉందన్న అభిప్రాయం కాంట్రాక్టర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఇలా అనేక కారణాలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వృథాప్రాయమవుతున్నాయి. జూన్‌లో మిగతా పనులు చేపడతాం గడువులోగా గ్రౌండింగ్ అయిన సీసీ రోడ్డు పనులను పూర్తి చేయడం జరుగుతుంది. ప్రధానంగా పలు మండలాల్లో ఇసుక దొరకని పరిస్థితి ఉంది. వేసవి కావడంతో వాటర్ క్యూరింగ్‌లో నీటి సమస్య ఏర్పడుతుంది. దీంతో సీసీ రోడ్లు వేయడానికి ఇబ్బంది ఎదురవుతుంది. సీసీ రోడ్ల నిర్మాణంలో లేబర్కంపోనెంట్ను జనరేట్ చేయాల్సి ఉంటుంది. మంజూరై గ్రౌండింగ్ కాని పనులకు సంబంధించి జూన్‌లో మళ్లీ చేపట్టడం జరుగుతుంది. నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదు. – మారుతి, పంచాయతీ రాజ్ ఈఈ, ఆదిలాబాద్ -
పల్లెల్లో ఎన్నికల వేడి
సాక్షి, గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కొత్త గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేస్తూ సర్పంచ్ల ఎన్నికల విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో అన్ని పార్టీల నాయకులు గ్రామాలబాట పట్టారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడమే కాకుండా సర్పంచ్, ఉపసర్పంచ్‌కు కలిపి ఉమ్మడిగా చెక్‌పవర్ కల్పించనున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తచట్టం ద్వారా నిధుల ఖర్చులో మరింత పారదర్శకత పెరగనుంది. జిల్లాలో నూతనంగా ప్రతిపాదనలు పంపిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఇప్పటివరకు 195 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం మరో 60గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీల సంఖ్య 255కు చేరింది. నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నాలుగు మున్సిపాలిటీలు ప్రభుత్వం తాజాగా గద్వాల మున్సిపాలిటీలో జమ్మిచేడు, వెంకంపేట గ్రామాలను విలీనం చేశారు. ఆలంపూర్, ఇమాంపూర్ గ్రామాలను వీలీనం చేసి నూతన మున్సిపాలిటీగా అలంపూర్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వడ్డేపల్లి, పైపాడు గ్రామాలను కలిపి వడ్డేపల్లి చిన్న మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు వల్ల గ్రామాల్లో సర్పంచ్‌స్థానాలు పెరగడంతో పాటు, పాలన మరింత చేరువ కానుంది. అదేవిధంగా నూతనంగా చిన్న మున్సిపాలిటీలుగా ఏర్పటైన అలంపూర్, వడ్డేపల్లి భవిష్యత్‌లో మరింత అభివృద్ధి కానున్నాయి. సర్పంచ్, ఉపసర్పంచ్లకే చెక్ పవర్ నిధుల వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఉంది. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిపినా వారిద్దరూ సంతకం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఈ విధానంతో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ సర్పంచ్‌లు నిర్వహించలేకపోయేవారు. కొన్ని సందర్భాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయలోపం వల్ల నిధుల విడుదలలో సంక్షోభం ఏర్పడేది. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకే చెక్‌పవర్‌ను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలుచేస్తున్నారు. సర్పంచ్ తప్పుచేస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలే తరువాయి.. ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. సర్పంచ్ల ఎన్నిక విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో ఇక ఎన్నికలు నిర్వహించడమే తరువాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీలు గ్రామాల్లో ఇప్పటికే గెలుపు గుర్రాలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల జాబితాను పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, బ్యా లెట్ బాక్స్‌లు, పోలింగ్ కేంద్రాలు ఈ విధంగా గ్రామపంచాయతీలు, జనాభాకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో ఇప్పటికే గద్వాల మున్సిపాలిటీ, అయిజ నగర పంచాయతీలో ఓటర్ల జాబితాను సవరిస్తున్న అధికారులు, గ్రామ పంచాయతీలలోనూ ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2,03,734మంది, 2,02,988 మహిళలు, మొత్తం 4,06,750 మంది ఓటర్లు ఉన్నారు. -
నేడే పంచాయతీ ఉప ఎన్నికలు
జిల్లాపరిషత్ : జిల్లాలో నిర్వహిస్తున్న పంచాయతీ ఉప పోరులో భాగంగా 3 సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 3 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని డీపీవో కృష్ణమూర్తి తెలిపారు. జిల్లాలో వివిధ కారణాల వల్ల ఆకస్మికంగా ఏర్పడిన 1 ఎంపీటీసీ, 3 సర్పంచ్, 38 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బిచ్కుంద మండలం ఎల్లారం సర్పంచ్ స్థానానికి ఇద్దరు, నవీపేట్ మండలం బినోల సర్పంచ్ స్థానానికి ముగ్గురు, మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా ఎన్నికల్లో వరుసగా 507, 2059, 928 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 38 వార్డుస్థానాలకు గాను 32 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడు వార్డుసభ్యుల స్థానాలకు నామినేషన్లు రాలేవు. మరో మూడు వార్డు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో 7వ వార్డుకు ఇద్దరు, లింగంపేట్ మండలంలోని భవానీపేట్‌లో 7వ వార్డుకు ఇద్దరు, ఎడపల్లి మండలంలోని పోచారంలో 7వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానానికి.. కాగా సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జెడ్పీ సీఈవో మోహన్‌లాల్ తెలిపారు. ముషీర్‌నగర్, కొటాల్‌పల్లిలో రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశామని, 1,224 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 8 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, 10న కౌంటింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో సెలవును ప్రకటించామని తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాటు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనవచ్చని సూచించారు. -
ఎక్కడి పనులు అక్కడే
రేపటినుంచే ఏడుపాయల జాతర అంతా అస్తవ్యస్తం గుంతలమయంగా రోడ్లు.. సా..గుతున్న స్నానఘాట్లు మొద్దునిద్రలో అధికారులు కలెక్టర్ ఆదేశించినా చలనంలేని వైనం పాపన్నపేట, న్యూస్‌లైన్: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది ఏడుపాయల జాతర పరిస్థితి. జాతర ముహూర్తం దగ్గర పడుతున్నా అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. 15 రోజుల ముందే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినా.. తాజాగా కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించినా జాతర పనులు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారుల పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ఏడుపాయల కమాన్, ఆర్అండ్బీ రోడ్డు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఏడుపాయల ఆలయం వరకు సింగిల్ రోడ్డు ఉంది. ఇది పూర్తిగా శిథిలం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతరకు వేలాది వాహనాలు, లక్షలాది భక్తులు తరలి రానుండటంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న గోతులను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ. 50 వేలు కేటాయించారు. గురువారం నుంచే జాతర ప్రారంభం అవుతున్నా ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇరుపక్కల చెట్లతో అనేక వంకలు తిరిగిన ఈ రోడ్డుపై సాధారణ సమయాల్లోనే ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. సాయంత్రం వరకూ విద్యుత్ శాఖ అధికారులు స్తంభాల పక్కన గల చెట్లనునరికేస్తూనే ఉన్నారు. విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతుండటంతో జాతరలో తాగునీటి సరఫరా ఆగిపోయింది. కనీసం టాయిలెట్లకు నీరురాక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానఘాట్ల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఘనపురం ఆనకట్ట వద్ద విడుదల చేసిన నీరు వేగంగా వచ్చే అవకాశం ఉన్నందున అప్పుడే నిర్మించిన స్నానఘాట్లు ఏమేరకు తట్టుకుంటాయోనని భక్తులు వాపోతున్నారు. ఘనపురం ఆనకట్ట అవతల చిన్నఘనాపూర్ వైపు రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని, భక్తులు ఆరోపిస్తున్నారు. కాగా పంచాయతీ సిబ్బంది ఇంకా విధుల్లో చేరక పోవడంతో ఏడుపాయల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పేరుకు పోయాయి. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఏడుపాయలకు చేరుకుని ఇబ్బందుల పడుతున్నారు. జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించినా పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పీఆర్ డిప్యూటీ ఈఈ నర్సింలు మాట్లాడుతూ ట్రాక్టర్లు దొరకక రోడ్డు పనులు పూర్తి కాలేదని, త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ఇన్సులేటర్లు పగిలిపోవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. -
డిప్యూటీ సీఎం ఇలాకాలో..కీలక పోస్టులు ఖాళీ!
మునిపల్లి, న్యూస్‌లైన్: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజక వర్గంలోని మునిపల్లి మండలంలో కీలకమైన శాఖలకు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. ఏళ్లతరబడి ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు సాఫీగా సాగక మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎంపీడీఓ సరోజిని రెండు నెలల క్రితం రిటైర్డ్ కావడంతో అప్పటి నుంచి రాయికోడ్ ఎంపీడీఓ వామన్‌రావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈయన సోమ, శుక్రవారాలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటున్నా రు. మిగతా రోజుల్లో రాకపోవడంతో ఆయన చాంబర్ మూసి ఉంటుంది. పంచాయతీ రాజ్ ఏఈ మాణయ్య ఉద్యోగ విరమణ చేయడంతో ఈ పోస్టు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. ఈఓపీఆర్డీ గంగాధర్ ఎనిమిది నెలల క్రితం బదిలీ కాగా ఇప్పటివరకు ఆయన స్థానం భర్తీ కాలేదు. ఎంఈఓ చంద్రమౌళి తొమ్మిది నెలల క్రితం ఉద్యోగ విరమణ గావించడంతో ఓ హెచ్ఎంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. మునిపల్లి పీహెచ్సీలో పనిచేసే డాక్టర్ పూజ సుమారు తొమ్మిది నెలల క్రితం నిజామాబాద్ కు బదిలీ అయ్యారు. అప్పటినుంచి న్యాల్కల్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇక్కడి బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తున్నారు. 25 పంచాయతీలకు గాను కార్యదర్శులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో టైపిస్ట్, ఆఫీస్ సబార్టినేట్, వాచ్‌మన్ పోస్టులు కూడా ఏళ్లతరబడి ఖాళీగానే ఉన్నాయి. కీలక శాఖల్లో ఇన్చార్జి అధికారులు ఉండడంతో వారు పని ఒత్తిడికి లోనవుతున్నారు. సదరు అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం రాజనర్సింహతోపాటు ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించాలని వారు కోరుతున్నారు. -
ఫోర్జరీ కేసుపై సమగ్ర దర్యాప్తు
చింతలపూడి, న్యూస్‌లైన్ : చింతలపూడిలో వెలుగు చూసిన ఫోర్జరీ కేసుపై సమగ్ర దర్యాప్తు చే యనున్నట్లు ఏలూరు ఆర్డీవో కె.నాగేశ్వరరావు తెలిపారు. చింతలపూడి మండలం యర్రంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎస్కే లాల్ అహ్మద్ రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాలు, పాస్‌బుక్కులు, టైటిల్ డీడ్లు తయారుచేసి అమ్ముకుంటున్న కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టేందుకు గురువారం చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆర్డీవో ఎస్సై బి.మోహన్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఇంట్లో లభించిన రెవెన్యూ రికార్డులు, నకిలీ స్టాంపులు, నకిలీ పాస్ పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇది జిల్లాలోనే పెద్ద ఫోర్జరీ కేసని, రెవెన్యూ శాఖ ప్రతిష్టకు సంబంధించిందన్నారు. జిల్లా అధికారులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. నిందితునికి సహకరించిన వ్యక్తులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. లాల్ అహ్మద్ నుంచి లబ్ధి పొందినవారు వెంటనే నకిలీ పత్రాలు అందజేస్తే వారిపై క్రిమినల్ కేసులు ఉండవని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర సమ్మె ముగిసిన తర్వాత నకిలీ పత్రాలపై గ్రామాల్లో బహిరంగ విచారణ చేపడతామని, అప్పుడు బయటపడితే కేసులు తప్పవని ఆర్డీవో నాగేశ్వర రావు హెచ్చరించారు.