పర్యాటకులను అలరించే ప్రకృతి అందాలకు నిలయం కిన్నెరసాని. నెమళ్లు, దుప్పులు, బాతులు.. ఇలా పలు రకాల పక్షులు, వన్యప్రాణులతో పాటు రిజర్వాయర్‌లో బోటు షికారు చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే దీన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దాలని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆహ్లాదం పెంచాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కూడా మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం పర్యాటకులకు శాపంగా మారింది.
పాల్వంచరూరల్: కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు నిత్యం వందలాది మంది ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు, వివిధ రకాల పక్షులు వారిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశాయి. కానీ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అభివృద్ధికి ఆటంకంగా మారింది. మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్ల క్రితమే కేటాయింపు..
కిన్నెరసాని పర్యాటక అభివృద్ధికి 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకో టూరిజం అభివృద్ధి కింద రూ.7.53 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కొత్తగూడెంలో టూరిజం హోటల్, కిన్నెరసానిలో అద్దాలమేడ, పది కాటేజీల పునర్నిర్మాణం, ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. పనులను దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ 9 కాటేజీలకు స్లాబ్‌లు వేశారు. రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న అద్దాల మేడకు ఇంకా స్లాబ్ వేయలేదు. ఈ పనులన్నీ గత మూడేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. నిర్దేశిత గడువు పూర్తయి కూడా ఏడాది దాటింది. ఇంకా ఎంత కాలానికి నిర్మాణ పనులు పూర్తిచేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో శిథిలమైన కాటేజీలు, అద్దాలమేడ స్థానంలో కొత్తగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయా అని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫుడ్‌కోర్టు సైతం అసంపూర్తిగానే మిగిలింది.
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్..
గత ఏడాది రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌తోపాటు అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కిన్నెరసానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అంసతృప్తి, ఆశ్చర్యానికి లోనయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అయితే ఆ ఆదేశాలను కాంట్రాక్టర్ పట్టించుకున్న పాపాన పోలేదు. 2018 డిసెంబర్ వస్తున్నా పనులు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆదేశిస్తే పనుల్లో వేగం పెంచకపోగా.. దీపావళి పండగ తర్వాత ఇప్పటివరకు పూర్తిగా నిలిపివేశారు. ఇక అద్దాలమేడ, తొమ్మిది కాటేజీలు, ఫుడ్‌కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి దొడ్డు ఇసుకను వినియోగిస్తున్నారని పర్యాటకులు అంటున్నారు.
డిసెంబర్ నెలాఖరు నాటికి గడువు విధించాం
కిన్నెరసాని, కొత్తగూడెంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. కిన్నెరసానిలో అద్దాలమేడ రెండు అంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేయాల్సి ఉంది. పది కాటేజీలకు స్లాబ్‌ల నిర్మాణం పూర్తయింది. కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్ నిర్మాణం పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రెండోసారి విధించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– శంకర్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ
Comments
Please login to add a commentAdd a comment