70ఏళ్ల భారత గణతంత్ర సుదీర్ఘ ప్రస్థానంలో సాధించిన అతిగొప్ప విజయం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఢిల్లీ పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం లక్ష్యంతో మొదలైన పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా వరకు ఉద్దేశిత లక్ష్యాలను చేరుకుంది. జనాభాలో సగంగా ఉన్న మహిళలు ఇప్పుడు 50% స్థానిక సంస్థలను పాలిస్తున్నారు. ఊరికి దూరంగా బతుకులీడ్చిన దళితులు కూడా అధికారంలో భాగస్వాములయ్యారు. అయితే, ఇలాంటి విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ.. అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ పరిష్కరించుకోగలిగితే ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా భారత్ ఆదర్శవంతమవుతుంది.
73వ రాజ్యాంగ సవరణతో..
ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయి వరకు విస్తరింపచేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చి ంది. పాలనలో పంచాయతీ ప్రతినిధులు భాగస్వాములయ్యారు. గ్రామస్థాయి పాలనలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. తమ సమస్యలను తామే గుర్తించి వాటి పరిష్కారాలను కూడా తామే నిర్ణయించుకునే అధికారం పంచాయతీ ప్రతినిధులకు దక్కింది. తద్వారా నిధుల వినియోగం, పాలనలో పారదర్శకత ఏర్పడింది. ఆ మేరకు రాష్ట్రాలు పంచాయతీలకు అవసరమైన అధికారాలు బదిలీ చేయడానికి వీలైంది. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారులతో గ్రామ పాలన సాగించేది. అధికారులకు స్థానిక సమస్యల పట్ల అవగాహన లేమి కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడేది. గ్రామాలపై అధికారుల పెత్తనం కొనసాగేది. పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు, విధుల వికేంద్రీకరణ వల్ల అవి బలమైన పాలన కేంద్రాలుగా తయారవుతాయనడంలో సందేహం లేదు.స్థానికుల అవసరాలను తీర్చగలుగుతాయి. వారికి జవాబుదారీగా ఉంటాయి.
మహిళలకు పగ్గాలు..
ప్రస్తుతం దేశంలో 2,32,332 గ్రామ పంచాయతీలు, 6000 మండల/సమితులు, 534 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు 27,75,858 మంది, మండల/సమితులకు 1,44,491 మంది, జిల్లా పరిషత్‌లకు 15,067 మంది ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. వీటిలో 75వేల పంచాయతీలు, 2వేల మండల పరిషత్‌లు 175 జిల్లా పరిషత్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ల కారణంగా పలువురు ఎస్సీ,ఎస్టీలు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికవుతున్నారు. పాలనలో భాగస్వాములవుతున్నారు. దేశ వ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ విజయవంతం అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం
స్థానిక సంస్థలు కూడా పార్లమెంటు, అసెంబ్లీల్లాగే రాజ్యాంగబద్ధ సంస్థలే. వాటిలాగే ఇవి కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి. చాలా స్థానిక సంస్థలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల పాలనాపరంగా పంచాయతీలకు నేటికీ పూర్తి స్వయంప్రతిపత్తి లభించడం లేదు. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదా సీనంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. నిధుల కేటాయింపులో రాజకీయ ఒత్తిళ్లు, కాం ట్రాక్టర్ల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రక్రి యలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోం ది. కొన్ని రాష్ట్రాలు పంచాయతీల నిధులను కూడా ఏదో వంకతో పక్కదారి పట్టిస్తున్నాయి.
సమాంతర పాలన..
పంచాయతీల అధికారాల్ని దెబ్బతీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పార్టీ తరఫున గ్రామ సభలు/కమిటీలు ఏర్పాటు చేయడం, పంచాయతీ నిధుల్ని పక్కదారి పట్టించడం చేస్తున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పంచాయతీలతో సంబంధం లేకుండా అభివృద్ధి పథకాలు అమలు పరచడం కూడా పంచాయతీ వ్యవస్థను బలహీనపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ జన్మభూమి కమిటీల ద్వారా సమాంతర పాలన సాగిస్తోంది.
మౌలిక వసతుల కొరత..
దేశవ్యాప్తంగా 2.52 లక్షల పంచాయతీలు ఉంటే, వాటిలో 60వేల పంచాయతీలకు సొంత భవనాలు కూడా లేవు. చాలా పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కూడా అరకొరగానే ఉన్నాయి. ప్రభుత్వం ఈ–గవర్నెన్స్ ప్రవేశపెట్టినా దానిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన సదుపాయాలు చాలా పంచాయతీలకు లేవు. సాంకేతిక నిపుణుల కొరత, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా పంచాయతీలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోలేక అభివృద్ధిలో వెనకబడుతున్నాయి. పేరుకు స్వయం నిర్ణయాధికారాలు ఉన్నా పరోక్షంగా ఇవి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలుగా వాటి అదుపాజ్ఞల్లోనే పని చేయాల్సి వస్తోంది. స్వయం ప్రతిపత్తి లేదు. మూడంచెల మధ్య సమన్వయం, సామరస్యం లోపిస్తోంది.
జవసత్వాలిచ్చిన సవరణ
73వ రాజ్యాంగ సరవణ పంచాయతీలకు కొత్త అధికారాలు కల్పించడమే కాక దాని స్వభావాన్ని కూడా మార్చివేసింది. అంతకు ముందు పంచాయతీలు రాజ్యాంగ సంస్థలు కావు. కేవలం అమలు కమిటీలుగానే ఉండేవి. వాటిలో రాజకీయ పార్టీలకు ఏ సంబంధం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగతంగానే పోటీ చేసేవారు. 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీల్లో రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. వాటికి స్వయం నిర్ణయాధికారం లభించింది. పంచాయతీల్లో బలహీనవర్గాలు, మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. దేశమంతటా రెండు, మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటయింది. నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట రాజస్థాన్ ప్రభుత్వం 1959లో నాగపూర్ జిల్లాలో ప్రవేశపెట్టింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. రాజస్తాన్ రెండో సీఎం బల్వంత్‌రాయ్‌ను ‘పంచాయతీ పిత’గా పేర్కొంటారు. ఆయన ఆధ్వర్యంలో వేసిన కమిటీ సిఫారసు మేరకే దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.
వైఫల్యాల్లోంచి పుట్టిన ఆలోచన
దేశాభివృద్ధి కోసం1952లో నాటి ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించింది. అయితే, ఇవి ఆశించిన ఫలితాలనివ్వలేదు. గ్రామస్థాయికి ఆ పథకాలు వెళ్లకపోవడం, పంచాయతీలు వాటిని సమర్థవంతంగా అమలు పరచలేకపోవడమే దీనికి కారణమన్న భావన వ్యక్తమయింది. పరిపాలన కేంద్రీకృతం కావడం వల్ల గ్రామ స్థాయిలో పథకాల అమలుపై పర్యవేక్షణ లోపించింది, అవినీతి పెరిగింది. జవాబుదారీ తనం లోపించింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై, అధికారులపై నమ్మకం పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడానికి, అభివృద్ధి పథకాలు గ్రామ స్థాయిలో పూర్తిగా అమలు కావడానికి అధికార వికేంద్రీకరణ అవసరమని పెద్దలు భావించారు. దాంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టుకొచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. 1990లో జనతా ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యాల అధ్యయనానికి అశోక్ మెహతా కమిటీని వేసింది. రాజీవ్ గాంధీ (1989), వీపీ సింగ్(1990), పీవీ నరసింహారావు(1991) ప్రభుత్వాలు ఈ వ్యవస్థ బలోపేతానికి పలు సవరణలు చేశాయి. వీటన్నిటి కారణంగానే.. 73వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment