ఆరోగ్య రంగంలో మన దేశం గత 70 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని చూస్తే ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడం నుంచి ప్రాణాంతక వ్యాధులెన్నింటినో మట్టుబెట్టగలిగాం. మలేరియా, క్షయ, ఆటలమ్మ, కుష్టువ్యాధి, పోలియో లాంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టగలిగాం. 1947లో 725 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, 2017 నాటికి 28,863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం.
1950–51లో ప్రతి 1000 జననాలకు 145.6 మంది శిశువులు మరణించేవారు. ప్రస్తుతం ప్రతి 1000 మందికి 34 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. 1940ల్లో ప్రతి లక్ష జననాలకు 2 వేల మాతృ మరణాలు సంభవించేవి. 1950కి వచ్చేసరికి 1,000కి తగ్గాయి. 2015 నాటికి 174 మాతృమరణాలు సంభవిస్తున్నాయి. అయితే అంతర్జాతీ యంగా చూసుకుంటే మనదేశం మాతృమరణాల్లో శ్రీలంక (30), థాయ్‌లాండ్(20), చైనా (27) లకంటే బాగా వెనుకబడి ఉంది. 1950 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల సంఖ్య 50,000. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 725. 1950లో మన దేశ ప్రజల జీవిత కాలం 32 ఏళ్లే. 2016 గణాంకాల ప్రకారం మన దేశ ప్రజల సగటు జీవన ప్రమాణం 68 ఏళ్లు.
1. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ ( ప్రతి 10,000 మందికి) 1950– 51లో 1.7 మంది ఉంటే, 1999– 2000 సంవత్సరంలో 5.5 ఉన్నారు.
2. మెడికల్ కాలేజీలు 1950–51లో 28 ఉంటే, 1999–2000 నాటికి 167 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2017 నాటికి మన దేశంలో 460 మెడికల్ కాలేజీలున్నాయి.
3. ప్రతి 10 వేల మంది జనాభాకు ఆసుపత్రి బెడ్లు 1950–51లో 3.2 ఉంటే 1999–2000లో 9.3 ఉన్నాయి.
4. వైద్యులు ప్రతి 10 వేల మందికి 1950–51లో 61.8 మంది ఉంటే, 1999–2000 ల కల్లా 535.2 మంది వైద్యులున్నారు. 2017 నాటికి దేశంలో మొత్తం 8 లక్షల మంది వైద్యులున్నారు. ప్రతి 1668 మందికీ ఒక వైద్యులున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులను అధిగమించాం!
మలేరియా: 1958లో నేషనల్ మలేరియా ఎరాడికేషన్ కార్యక్రమం తీసుకోవడం ద్వారా చాలా వరకు మలేరియాని నివారించగలిగాం.
మశూచి: 1977 తర్వాత దీన్ని అధిగమించడంలో మనం సఫలీకృతం అయ్యాం.
క్షయ: 1955 లో నేషనల్ టీబీ కంట్రోల్ కార్యక్రమాన్ని మన దేశంలో తెచ్చారు. 1977లో నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ కంట్రోల్ కార్యక్రమంలో కొద్దిగా మార్పులు చేసి పునఃప్రారంభించారు. జిల్లా టీబీ కంట్రోల్ సెంటర్లు దేశవ్యాప్తంగా 446 నెలకొల్పారు. ఆ తరువాత మన దేశంలో క్షయ వ్యాధుల సంఖ్య తగ్గింది.
కుష్టువ్యాధి: 1990–91 నాటికి క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య 20 లక్షలు. 1955లోనే కుష్టువ్యాధి నివారణకు నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రాంలో ప్రారంభించారు. కుష్టు వ్యాధి నిర్మూలనలో మనం సఫలీకృతులమయ్యాం.
ఎయిడ్స్: మన దేశంలో 1987 సంవత్సరంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ప్రారంభించాం. 1990–91లో జోనల్ స్థాయి రక్తపరీక్ష కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేశారు.
పోలియో: ఏడాదికి ఒకేరోజులో కోట్లాది మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా దాదాపు పోలియోని దేశం అధిగమించగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment