అద్భుతం.. అపూర్వం.. 69 ఏళ్లలో.. వందల సవరణలు జరిగినా మౌలిక స్వరూపం చెక్కుచెదరని రాజ్యాంగం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ఎన్నో కులాలు, మతాలు, విభిన్న భాషలు,సంప్రదాయాలున్నప్పటికీ.. అందరినీ కలుపుకుని వెళ్తూ ఘనమైన గణతంత్రంగా కొనసాగడానికి అసలైన కారణం బలమైన మన రాజ్యాంగ పునాదులే. దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవడానికి కారణం కూడా మన రాజ్యాంగం వేసిన బాటలే. రాజ్యాంగంలోని సెక్షన్లు, చాప్టర్లు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అవసరాలను తీరుస్తున్నాయి. కొత్త సమస్యలకూ పరిష్కారాలు చూపిస్తున్నాయి.అందుకే మన రాజ్యాంగం ‘ది గ్రేట్’.
ఎన్నో సమస్యలు.. ఒకే పరిష్కారం
విభిన్న భాషలు, మతాలు, సంప్రదాయాల సంగమమైన విశాల భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగానికి రూపకల్పన చేయడం ఓ అద్వితీయమైన ప్రక్రియ. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఇలాంటి రాజ్యాంగాన్ని.. నేటి పరిస్థితుల్లో రాయడం కచ్చితంగా అసాధ్యమనే చెప్పాలి. భారత్‌తోపాటు అనేకమైన ఆసియా, ఆఫ్రికా దేశాలు వలసపాలకులనుంచి విముక్తి పొందినా.. ఆయా దేశాలన్నీ ఇప్పటికీ అంతర్గత కల్లోలాలతో సతమతమవుతున్నాయి. పాకిస్తాన్ పరిస్థితిలో ఇన్నేళ్లయినా మార్పు రాకపోవడమే ఇందుకు సరైన ఉదాహరణ. భారత విభజన కూడా చాలా దుర్మార్గంగా జరిగిందనేది సుస్పష్టం. పంజాబ్, బెంగాల్‌లు రెండేసి ముక్కలుగా విడిపోయిన నేపథ్యంలో చెలరేగిన హింస చరిత్రలో చెరగని మరకలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత పలు సంస్థానాలు భారత్‌లో కలిసే సమయంలోనూ ఇబ్బందులు తప్పలేదు. కశ్మీర్‌లోయలో కొంతభాగం పాక్ అధీనంలోకి వెళ్లడం, తదనంతర సమస్యలు నేటికీ ఓ సవాల్‌గా మారాయి. ఇన్ని విచిత్రమైన, విపత్కర సమస్యలున్నప్పటికీ.. భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించారు. తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత జనతా ప్రభుత్వం, 1999 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే.. ప్రభుత్వాలేవైనా.. రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకున్నాయి. తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు అందరూ రాజ్యాంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేందుకు చర్యలు తీసుకున్నారు.
ప్రజాస్వామ్య పండగ
భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మించడానికి 1950లోనే సుకుమార్ సేన్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. పాశ్చాత్య దేశాల్లో మొదట ఆస్తులున్నవారికి, ఆ తర్వాత చాలా కాలానికి.. కార్మికులు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. భారత్‌లో మాత్రం రాజ్యాంగంలో రాసుకున్న విధంగా భాష, లింగ, కుల, మత వివక్ష లేకుండా 21 ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. ఎన్నికల కమిషన్ తన మొదటి కర్తవ్యంగా లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందిని తీసుకుని ఓటర్ల జాబితాలు రూపొందించింది. ప్రజాస్వామ్యంలో గొప్ప ప్రయోగమైన తొలి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు. భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదన్న పాశ్చాత్య దేశాల అంచనాలు తప్పని మన రాజ్యాంగం మరోసారి రుజువుచేసింది. 1952 నుంచి 2014 వరకు 16సార్లు పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ద్వారా కేంద్రంలో, రాష్ట్రాల్లో శాంతియుతంగా అధికార బదిలీ జరుగుతోంది. ఇదంతా అంబేడ్కర్ నేతృత్వంలో రూపొందించుకున్న భారత రాజ్యాంగం పుణ్యమేననడంలో సందేహం లేదు.
చెక్కు చెదరని మౌలిక స్వరూపం
69 ఏళ్లుగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. వందకు పైగా రాజ్యాంగ సవరణలు జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాలు, నిరంతర నిఘా కారణంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం నేటికీ చెక్కుచెదరలేదు. రాజ్యాంగబద్ధ పాలనతో ప్రజాస్వామ్యం కొత్త కొత్త ప్రాంతాలకు, వర్గాలలోకి చొచ్చుకుపోతోంది. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగంలోని కొన్ని లోటుపాట్లు సుపరిపాలనకు అడ్డంకిగా మారాయని ఏడు దశాబ్దాల మన అనుభవాలు చెబుతున్నాయి. 20 కోట్ల జనాభా దాటిన ఉత్తరప్రదేశ్ మొదలుకుని లక్షల జనాభా ఉన్న సిక్కిం వరకూ ఉన్న 29 రాష్ట్రాలకు ఫెడరల్ వ్యవస్థలో వాటికి ఉండాల్సినన్ని అధికారాలు లేవు. 1980ల్లోనే వామపక్షాలు, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, తెలుగుదేశం, అస్సాం గణపరిషత్ వంటి ప్రాంతీయపక్షాల డిమాండ్ల కారణంగా.. కేంద్రం–రాష్ట్రాల సంబంధాలు సమీక్షించేం దుకు పలు కమిషన్లను ఏర్పాటుచేశారు. లిబ రలైజేషన్, గ్లోబలైజేషన్ ఫలితంగా ఆర్థిక, పారి శ్రామిక రంగాల్లో రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ పెరిగిన మాట వాస్తవమేగాని విద్య, వైద్యం వంటి అనేక కీలక రంగాల్లో ఇప్పటికీ రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారం లేదు. ఈ నేపథ్యంలో నిజమైన ఫెడరల్ వ్యవస్థ కోసం జరిగే డిమాండ్ల పరీక్షను భారత రాజ్యాంగం ఎదుర్కోవలసి వస్తుంది. ఫెడరల్ వ్యవస్థ కోసం జరిగే రాజ్యాంగ సవరణ దేశ చరి త్రలో అతి పెద్ద సవరణ అయ్యే ఆస్కారం ఉంది.
ఇది రిపబ్లిక్ దేశం
భారత్‌కు రాజ్యాంగాన్ని రూపొందించ డమే లక్ష్యంగా భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 జనవరి 9న జరిగింది. మూడేళ్ల తర్వాత 1949 నవంబర్ 26న చర్చోపచర్చల తర్వాత రాజ్యాంగానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. 1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే నిజమైన స్వాతంత్య్రం భారత ప్రజలకు లభించింది. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పౌరులకు అధికారాన్ని రాజ్యాంగం అందించింది. తొలి రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దేశప్రజలకు సందేశమిస్తూ.. ‘జాతి పిత, స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న వర్గ రహిత, సహకార స్వేచ్ఛతో, సంతోషాలతో నిండిన సమాజ స్థాపనకు మనం పునరంకితమౌదాం. ఈ రోజు కేవలం పండుగ చేసుకోవడంపై కన్నా మన లక్ష్యాలకు పునరంకితం కావడానికే శ్రద్ధ చూపాలి. కర్షకులు, శ్రామికులు, కార్మికులు, ఆలోచనపరులు పూర్తి స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేలా చేసే.. గొప్ప లక్ష్యానికి కట్టుబడి ఉందాం’అని పిలుపునిచ్చారు.
ప్రయాణం మొదలైందిలా..!
రాజధాని ఢిల్లీలోని అర్విన్ స్టేడియం (ప్రస్తుత మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో 1950 జనవరి 26న ఉదయం 10.30 గంటలకు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ మువ్వన్నెల జాతీయ పతాకం ఆవిష్కరించడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 21గన్ సెల్యూట్‌తో ఈ చారిత్రక ఘట్టం మొదలైంది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఇండియాలో బ్రిటిష్ పాలన ముగిసిన 894 రోజులకు ప్రజలే ప్రభువులుగా భారత్ సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రయాణం ప్రారంభించింది. బ్రిటిష్ వలస రాజ్యం ట్యాగ్ నుంచి.. సర్వసత్తాక, లౌకిక, ప్రజాతంత్ర దేశంగా భారతదేశం రూపుదిద్దుకోవడం చాలా గొప్ప పరిణామం. 1930 నాటి సంపూర్ణ స్వరాజ్యం కావాలనే స్వప్నం.. 1950లో వాస్తవరూపం దాల్చడానికి రెండు దశాబ్దాలు పట్టింది. 1929 లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో భారత గణతంత్ర రాజ్యానికి బీజాలు పడ్డాయి. 1930 జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినంగా పాటించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment