సాక్షి, గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కొత్త గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేస్తూ సర్పంచ్‌ల ఎన్నికల విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో అన్ని పార్టీల నాయకులు గ్రామాలబాట పట్టారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడమే కాకుండా సర్పంచ్, ఉపసర్పంచ్‌కు కలిపి ఉమ్మడిగా చెక్‌పవర్ కల్పించనున్నారు.
ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తచట్టం ద్వారా నిధుల ఖర్చులో మరింత పారదర్శకత పెరగనుంది. జిల్లాలో నూతనంగా ప్రతిపాదనలు పంపిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఇప్పటివరకు 195 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం మరో 60గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీల సంఖ్య 255కు చేరింది. నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
నాలుగు మున్సిపాలిటీలు
ప్రభుత్వం తాజాగా గద్వాల మున్సిపాలిటీలో జమ్మిచేడు, వెంకంపేట గ్రామాలను విలీనం చేశారు. ఆలంపూర్, ఇమాంపూర్ గ్రామాలను వీలీనం చేసి నూతన మున్సిపాలిటీగా అలంపూర్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వడ్డేపల్లి, పైపాడు గ్రామాలను కలిపి వడ్డేపల్లి చిన్న మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు వల్ల గ్రామాల్లో సర్పంచ్‌స్థానాలు పెరగడంతో పాటు, పాలన మరింత చేరువ కానుంది. అదేవిధంగా నూతనంగా చిన్న మున్సిపాలిటీలుగా ఏర్పటైన అలంపూర్, వడ్డేపల్లి భవిష్యత్‌లో మరింత అభివృద్ధి కానున్నాయి.
సర్పంచ్, ఉపసర్పంచ్‌లకే చెక్ పవర్
నిధుల వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఉంది. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిపినా వారిద్దరూ సంతకం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఈ విధానంతో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ సర్పంచ్‌లు నిర్వహించలేకపోయేవారు. కొన్ని సందర్భాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయలోపం వల్ల నిధుల విడుదలలో సంక్షోభం ఏర్పడేది. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకే చెక్‌పవర్‌ను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలుచేస్తున్నారు. సర్పంచ్ తప్పుచేస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలే తరువాయి..
ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. సర్పంచ్‌ల ఎన్నిక విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో ఇక ఎన్నికలు నిర్వహించడమే తరువాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీలు గ్రామాల్లో ఇప్పటికే గెలుపు గుర్రాలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల జాబితాను పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, బ్యా లెట్ బాక్స్‌లు, పోలింగ్ కేంద్రాలు ఈ విధంగా గ్రామపంచాయతీలు, జనాభాకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో ఇప్పటికే గద్వాల మున్సిపాలిటీ, అయిజ నగర పంచాయతీలో ఓటర్ల జాబితాను సవరిస్తున్న అధికారులు, గ్రామ పంచాయతీలలోనూ ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2,03,734మంది, 2,02,988 మహిళలు, మొత్తం 4,06,750 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment