ఆగమార్గం | CC Road Works Are going Delay In Adilabad | Sakshi
Sakshi News home page

ఆగమార్గం

Published Mon, Apr 2 2018 6:35 AM | Last Updated on Mon, Apr 2 2018 6:35 AM

CC Road Works Are going Delay In Adilabad - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్న కొత్త సీసీ రోడ్డు తాంసి మండలకేంద్రంలోని అంబేద్కర్‌ కమ్యూనిటీ భవనం సమీపంలో నిర్మించింది. నాలుగు రోజుల కిందటే ఈ రోడ్డు వేశారు. రూ.5లక్షల అంచనా వ్యయంతో 175 మీటర్ల పొడవున నిర్మించారు. రోడ్డు మన్నికగా ఉండాలంటే రోజూ కనీసం ఉదయం, సాయంత్రమైనా వాటర్‌ క్యూరింగ్‌ చేయాల్సింది. ఇందు కోసం రోడ్డుపై ఎర్రమట్టితో కట్టలైతే వేశారు. కానీ అందులో నీళ్లు నింపిన దాఖలాలు కనబడటం లేదు. తూతూమంత్రంగా క్యూరింగ్‌ చేస్తున్నారు. ఏదో రోడ్డు వేశాం.. పని కానిచ్చామన్న రీతిలో వ్యవహారం సాగిందనేది ఈ రోడ్డు చూస్తేనే అర్థమవుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఇలాంటివి వందలాది రోడ్లు వేయనైతే వేశారు.. సరైన క్యూరింగ్‌ జరగకపోవ డంతో కొన్నేళ్ల పాటు మన్నికగా ఉండాల్సిన రోడ్డు మూన్నాళ్ల ముచ్చటయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

సాక్షి,ఆదిలాబాద్‌ : బజార్‌హత్నూర్‌ మండలంలో ప్రస్తుతం 13 గ్రామపంచాయతీలు, వీటికింద 64 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఈ మండలానికి రూ.83లక్షలతో 43 రోడ్లు మంజూరయ్యాయి. మార్చి 31 వరకు కేవలం రూ.12.55 లక్షలతో బజార్‌హత్నూర్, జాతర్ల, గులాబ్‌తాండ గ్రామాల్లో మూడు రోడ్లు మాత్రమే అధికారులు గ్రౌండింగ్‌ చేశారు. గడువు ముగియడంతో ఇప్పుడు ఆ రోడ్లు వేసేది అనుమానమే. ఆ నిధులు వెనక్కి మళ్లే అవకాశం లేకపోలేదు. అధికారులు మాత్రం మండలంలో తీవ్ర నీటి సమస్య కారణంగా పనులను గ్రౌండింగ్‌ చేయలేకపోయామని చెబుతుండటం నమ్మాలో.. నమ్మరాదోనన్న పరిస్థితి. రోడ్లు మంజూరైనప్పటికీ మాన్కాపూర్, చిన్మితండా, అనంతపూర్, చిన్నహత్నూర్‌లో గ్రౌండింగ్‌ చేయని కారణంగా ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మించలేని పరిస్థితి. ఎన్నో ఏళ్ల కిందట ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు వేయగా, అవి పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. మళ్లీ సీసీ రోడ్డు మంజూరైందన్న ఆనందం ముచ్చటగానే మిగిలింది. అదేవిధంగా మండలంలోని ఆర్కాయి, చింతకర్ర గ్రామాలకు సీసీ రోడ్లు లేవు. అయినప్పటికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఈ గ్రామాలను పరిగణలోకి తీసుకోకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ఇది ప్రణాళిక లోపమా, మరేమిటి. జిల్లాలోని అనేక మండలాల్లోని గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. నిధులను వినియోగించుకోవడంలో పాలకులు, అధికారుల వైఫల్యమే ఈ పరిస్థితి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.  

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు ఆగమాగంగా సాగుతున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే ఉపాధి హామీ కింద ఈ రోడ్లను మంజూరు చేయడం, మార్చి 31లోగా పూర్తి చేయాలనే గడువు విధించడం, ఈజీఎస్‌ నిధులకు తోడు కొంతమొత్తం ఇతరత్రా నిధులు కలిపి ఈ పనులు చేపట్టాలని నిబంధన ఉండటం, ఇలా అనేక కారణాలతో ఏటా గడువు ముగిసేముందు హడావిడి కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. వారం రోజులుగా రోడ్ల పనులను ఆదరబాదరగా చేపడుతున్నారు. రోడ్డు వేశాం.. పనైపోయిందన్న రీతిలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా సైడ్‌బర్మ్‌ వేయకపోవడంతో ఆ రోడ్డు అంచులు కోల్పోయే దుస్థితి ఉంది. వాటర్‌ క్యూరింగ్‌ సరిగా చేయకపోవడంతో సిమెంట్‌ రోడ్డు పగుళ్లుతేలి మూన్నాళ్ల ముచ్చటగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మించాల్సిన సీసీ రోడ్ల నిర్మాణంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పలువురు నేతలు, నాయకులు తాము నివసించే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

గ్రామాల్లో దుస్థితి..
జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామపంచాయతీలు ఉండగా, ఈ పంచాయతీల్లో 2,412 వార్డులు ఉన్నాయి. అనేక వార్డుల్లో సరైన రోడ్లు లేక గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల మండలాల్లోని అనేక గ్రామాల్లో రోడ్ల దుస్థితి కండ్లకు కడుతుంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఏటా సిమెంట్‌ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరవుతున్నా ప్రణాళికబద్ధంగా సాగడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని పలుమార్లు ఆదేశించారు. మరి ఆ ప్రతిపాదనలు అధికారులు సరైన కార్యాచరణ లేకుండానే రూపొందించారన్న అనుమానాలు లేకపోలేదు. అనేక గ్రామాల్లో రోడ్లు లేకపోయినా వాటిని అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం, అదేవిధంగా గడువు ముగిసే సమయం దగ్గరికి వచ్చినప్పుడే పనులు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. కొన్ని మండలాల్లో ఎక్కువ, మరికొన్ని మండలాల్లో తక్కువ, ఎక్కడబడితే అక్కడ రోడ్లు.. ఇలా ఈ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ రోడ్ల నిర్మాణంలో పరిస్థితి కనిపిస్తుంది. ఏటా మంజూరైన పనుల్లో సగం పనులే గ్రౌండింగ్‌ కావడం, మిగతా పనులు ల్యాప్స్‌ అయి నిధులు వెనక్కి మళ్లడం పరిపాటిగా మారింది.  

లేబర్‌ కంపోనెంటే కారణమా..
ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులు కేటాయిస్తోంది. మిగతా 10శాతం నిధులను ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధుల నుంచి అయినా, ఎంపీలు ఎంపీ ల్యాడ్‌ ద్వారా అయినా, లేనిపక్షంలో గ్రామ పంచాయతీ నుంచే అయినా భరించిన పక్షంలోనే గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించే పరిస్థితి ఉంటుంది. వివిధ రాజకీయ కోణాల కారణంగా ఈ నిధుల మంజూరుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందుకు రాకపోవడం, గ్రామ పంచాయతీలు నిధుల లేమి కారణంగా అంతమొత్తంలో భరించలేమని చెప్పడంతో పనుల మంజూరులో ఆలస్యం జరుగుతుందన్న అపవాదు ఉంది. కాగా 90 శాతం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద నిధులు మంజూరవ్వడంతో చేపట్టే ప్రతి రోడ్డు పనిలో 60శాతం లేబర్‌ కంపోనెంట్, 40 శాతం మెటీరియల్‌ కంపోనెంట్‌ తప్పనిసరి. అయితే మెటీరియల్‌ కంపోనెంటే ఈ సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో అధికంగా ఉండడంతో అధికారులు లేబర్‌ కంపోనెంట్‌ను అడ్డదారిలో సృష్టించడం ద్వారా ఈ రోడ్ల పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. లేబర్‌ కంపోనెంట్‌ విషయంలోనే సమస్య కారణంగా పూర్తిస్థాయిలో నిధులను వినియోగించుకోలేని దుస్థితి కనిపిస్తుందన్న విమర్శలు లేకపోలేదు. ఫిబ్రవరిలో ఈ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రావడం, అది కూడా నెలన్నర లోపల మార్చి 31లోగా పూర్తి చేయాలని చెప్పడంతో పంచాయతీల్లో ఏటా ఈ పనుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. ప్రధానంగా సర్పంచ్‌లు గ్రామ పంచాయతీలో తీర్మాణం చేసి ఈ పనులు నామినేషన్‌ పద్ధతిపై కాంట్రాక్టర్లకు అప్పగించడం జరుగుతుంది. అయితే చేసేది చిన్న పని అయినా బిల్లులు రావడంలో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు  ఈ రోడ్ల నిర్మాణంపై పెట్టిన పెట్టుబడికి బయట నుంచి అప్పుగా తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీ పెరిగిపోవడంతో పనులపై ఆసక్తి చూపడంలేదన్న అభిప్రాయం లేకపోలేదు. నిబంధనల మేరకు పనులు చేపట్టాలని అధికారులు ఒత్తిడి చేయడం, పని చేపట్టాలంటే అటూ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు ఎంతోకొంత ముట్టజెప్పడం, అధికారులకు తప్పనిసరిగా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు మంజూరు అయ్యే పరిస్థితి ఉండడం, పనులు చేపట్టిన బిల్లులు ఎప్పడు వస్తాయో తెలియని పరిస్థితి కారణంగా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి కనబర్చడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిల్లుల మంజూరులో అధికారులకు మూడు నుంచి 5శాతం పర్సంటేజీ రూపంలో ఇస్తేనే ముందుకు సాగే పరిస్థితి ఉందన్న అభిప్రాయం కాంట్రాక్టర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఇలా అనేక కారణాలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు వృథాప్రాయమవుతున్నాయి.  

జూన్‌లో మిగతా పనులు చేపడతాం
గడువులోగా గ్రౌండింగ్‌ అయిన సీసీ రోడ్డు పనులను పూర్తి చేయడం జరుగుతుంది. ప్రధానంగా పలు మండలాల్లో ఇసుక దొరకని పరిస్థితి ఉంది. వేసవి కావడంతో వాటర్‌ క్యూరింగ్‌లో నీటి సమస్య ఏర్పడుతుంది. దీంతో సీసీ రోడ్లు వేయడానికి ఇబ్బంది ఎదురవుతుంది. సీసీ రోడ్ల నిర్మాణంలో లేబర్‌కంపోనెంట్‌ను జనరేట్‌ చేయాల్సి ఉంటుంది. మంజూరై గ్రౌండింగ్‌ కాని పనులకు సంబంధించి జూన్‌లో మళ్లీ చేపట్టడం జరుగుతుంది. నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదు.              – మారుతి,
పంచాయతీ రాజ్‌ ఈఈ, ఆదిలాబాద్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement