శంషాబాద్ రూరల్: జాతీయ రహదారి, గ్రామ రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని ముంచింతల్ శివారులో ని శ్రీరామనగరంలో ఇటీవల 12 రోజుల పాటు జరిగిన సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయా రోడ్డు మార్గాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
వివిధ గ్రామాల్లోనూ..
బెంగళూరు జాతీయ రహదారితో పాటు గొల్లూరు, ముచ్చింతల్, బుర్జుగడ్డతండా, పెద్దషాపూర్‌తండా, పీ–వన్ మార్గాల్లో ఉత్సవ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీ నేతలు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసి వారం దాటినా ఇప్పటిదాకా వాటిని తొలగించడంలేదు. కటౌట్లు ఎప్పుడు విరిగి పడతాయోనని వాహనదారులు, స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తొలగింపులో నిర్లక్ష్యం..
రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగింపులో అటు ఉత్సవ నిర్వాహకులు..ఇటు పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కటౌట్ల ఏర్పాటుతో ఉత్సవాల సమయంలో సందర్శకులకు కొంత వరకు అటు వెళ్లే మార్గాలను సూచనలకు ఉపయోగపడ్డాయి. కానీ పూర్తయినా వెంటనే వాటిని తొలగించే బాధ్యత పంచాయతీలపై ఉన్నా..వారు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు.
వాహనదారులకు ఇబ్బంది..
బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన కటౌటు విరిగింది. ఇది ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలియడం లేదు. వీటితో పాటు చాలా చోట్ల ఉన్న కటౌట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment