village roads
-
ప్రమాదకరంగా కటౌట్లు..!
శంషాబాద్ రూరల్: జాతీయ రహదారి, గ్రామ రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని ముంచింతల్ శివారులో ని శ్రీరామనగరంలో ఇటీవల 12 రోజుల పాటు జరిగిన సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయా రోడ్డు మార్గాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లోనూ.. బెంగళూరు జాతీయ రహదారితో పాటు గొల్లూరు, ముచ్చింతల్, బుర్జుగడ్డతండా, పెద్దషాపూర్‌తండా, పీ–వన్ మార్గాల్లో ఉత్సవ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీ నేతలు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసి వారం దాటినా ఇప్పటిదాకా వాటిని తొలగించడంలేదు. కటౌట్లు ఎప్పుడు విరిగి పడతాయోనని వాహనదారులు, స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలగింపులో నిర్లక్ష్యం.. రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగింపులో అటు ఉత్సవ నిర్వాహకులు..ఇటు పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కటౌట్ల ఏర్పాటుతో ఉత్సవాల సమయంలో సందర్శకులకు కొంత వరకు అటు వెళ్లే మార్గాలను సూచనలకు ఉపయోగపడ్డాయి. కానీ పూర్తయినా వెంటనే వాటిని తొలగించే బాధ్యత పంచాయతీలపై ఉన్నా..వారు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది.. బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన కటౌటు విరిగింది. ఇది ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలియడం లేదు. వీటితో పాటు చాలా చోట్ల ఉన్న కటౌట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. -
పేరులో భాగ్యం.. తీరులో దౌర్భాగ్యం
సాక్షి, లక్ష్మీపురం(గుంటూరు): పేరులో భాగ్యం ఉన్నా.. తీరులో మాత్రం దౌర్భగ్యంగా ఉంది. నగరంలోని భాగ్యనగర్ ప్రాంతంలో రోజు రోజుకు పారిశుద్ధ్య సమస్యలతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు పారి«శుద్ధ్య సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. స్థానిక మారుతీనగర్ ప్రాంతంలో నుంచి భాగ్యనగర్ మహాప్రస్థానం మీదుగా స్వర్ణాంధ్రనగర్, తురకపాలెం వైపుగా వెళ్లే దారి మురుగు, చెత్తతో నిండిపోయి ఉంది. ఇటుగా వాహనదారులు ప్రయాణించాలంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయేనని ఆందోళన చెందుతున్నారు. తవ్వారు వదిలేశారు భాగ్యనగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు ఇటివల కాలంలో యూజీడి పనులు కోసం గుంతలు తవ్వి పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉండే వారు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అంటున్నారు. అయితే పనులు పూర్తి అయిన తరువాత యథావిధిగా ఉంచాల్సిన రోడ్డును వదిలేసి వెళ్లి పోయారు. దీంతో నిత్యం ఈ ప్రదేశంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోడ్డు పైకి రావాలంటే ఆందోళన చెందుతున్నారు. నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు వస్తున్నాయి పేరుకు భాగ్యనగర్ తమ ప్రాంతంలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఊరు మధ్యలో ఉన్న ఊరు చివరలో ఉన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. భాగ్యనగర్ ప్రాంతం నుంచి తురకపాలెం వెళ్లేందుకు నిత్యం భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీనికి తోడు పేరుకు పోయిన చెత్తతో ఇబ్బందులు పడుతున్నాం. – విజయలక్ష్మి, స్థానికురాలు రోడ్డు బురదమయం మహాప్రస్థానం నుంచి భాగ్యనగర్ ప్రాంతంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్డంతా బురదమయంగా మారుతుంది. దీనికితోడు చెత్త కుప్పలు, భరించలేని దుర్వాసనతో స్థానికంగా విషజ్వరాల పాలవుతున్నాము.నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -జోసఫ్, స్థానికుడు -
ఆగమార్గం
ఈ ఫొటోలో కనిపిస్తున్న కొత్త సీసీ రోడ్డు తాంసి మండలకేంద్రంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనం సమీపంలో నిర్మించింది. నాలుగు రోజుల కిందటే ఈ రోడ్డు వేశారు. రూ.5లక్షల అంచనా వ్యయంతో 175 మీటర్ల పొడవున నిర్మించారు. రోడ్డు మన్నికగా ఉండాలంటే రోజూ కనీసం ఉదయం, సాయంత్రమైనా వాటర్ క్యూరింగ్ చేయాల్సింది. ఇందు కోసం రోడ్డుపై ఎర్రమట్టితో కట్టలైతే వేశారు. కానీ అందులో నీళ్లు నింపిన దాఖలాలు కనబడటం లేదు. తూతూమంత్రంగా క్యూరింగ్ చేస్తున్నారు. ఏదో రోడ్డు వేశాం.. పని కానిచ్చామన్న రీతిలో వ్యవహారం సాగిందనేది ఈ రోడ్డు చూస్తేనే అర్థమవుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఇలాంటివి వందలాది రోడ్లు వేయనైతే వేశారు.. సరైన క్యూరింగ్ జరగకపోవ డంతో కొన్నేళ్ల పాటు మన్నికగా ఉండాల్సిన రోడ్డు మూన్నాళ్ల ముచ్చటయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సాక్షి,ఆదిలాబాద్ : బజార్హత్నూర్ మండలంలో ప్రస్తుతం 13 గ్రామపంచాయతీలు, వీటికింద 64 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ మండలానికి రూ.83లక్షలతో 43 రోడ్లు మంజూరయ్యాయి. మార్చి 31 వరకు కేవలం రూ.12.55 లక్షలతో బజార్హత్నూర్, జాతర్ల, గులాబ్‌తాండ గ్రామాల్లో మూడు రోడ్లు మాత్రమే అధికారులు గ్రౌండింగ్ చేశారు. గడువు ముగియడంతో ఇప్పుడు ఆ రోడ్లు వేసేది అనుమానమే. ఆ నిధులు వెనక్కి మళ్లే అవకాశం లేకపోలేదు. అధికారులు మాత్రం మండలంలో తీవ్ర నీటి సమస్య కారణంగా పనులను గ్రౌండింగ్ చేయలేకపోయామని చెబుతుండటం నమ్మాలో.. నమ్మరాదోనన్న పరిస్థితి. రోడ్లు మంజూరైనప్పటికీ మాన్కాపూర్, చిన్మితండా, అనంతపూర్, చిన్నహత్నూర్లో గ్రౌండింగ్ చేయని కారణంగా ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మించలేని పరిస్థితి. ఎన్నో ఏళ్ల కిందట ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు వేయగా, అవి పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. మళ్లీ సీసీ రోడ్డు మంజూరైందన్న ఆనందం ముచ్చటగానే మిగిలింది. అదేవిధంగా మండలంలోని ఆర్కాయి, చింతకర్ర గ్రామాలకు సీసీ రోడ్లు లేవు. అయినప్పటికి ఎన్ఆర్ఈజీఎస్లో ఈ గ్రామాలను పరిగణలోకి తీసుకోకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ఇది ప్రణాళిక లోపమా, మరేమిటి. జిల్లాలోని అనేక మండలాల్లోని గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. నిధులను వినియోగించుకోవడంలో పాలకులు, అధికారుల వైఫల్యమే ఈ పరిస్థితి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు ఆగమాగంగా సాగుతున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే ఉపాధి హామీ కింద ఈ రోడ్లను మంజూరు చేయడం, మార్చి 31లోగా పూర్తి చేయాలనే గడువు విధించడం, ఈజీఎస్ నిధులకు తోడు కొంతమొత్తం ఇతరత్రా నిధులు కలిపి ఈ పనులు చేపట్టాలని నిబంధన ఉండటం, ఇలా అనేక కారణాలతో ఏటా గడువు ముగిసేముందు హడావిడి కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. వారం రోజులుగా రోడ్ల పనులను ఆదరబాదరగా చేపడుతున్నారు. రోడ్డు వేశాం.. పనైపోయిందన్న రీతిలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా సైడ్‌బర్మ్ వేయకపోవడంతో ఆ రోడ్డు అంచులు కోల్పోయే దుస్థితి ఉంది. వాటర్ క్యూరింగ్ సరిగా చేయకపోవడంతో సిమెంట్ రోడ్డు పగుళ్లుతేలి మూన్నాళ్ల ముచ్చటగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మించాల్సిన సీసీ రోడ్ల నిర్మాణంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పలువురు నేతలు, నాయకులు తాము నివసించే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో దుస్థితి.. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామపంచాయతీలు ఉండగా, ఈ పంచాయతీల్లో 2,412 వార్డులు ఉన్నాయి. అనేక వార్డుల్లో సరైన రోడ్లు లేక గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల మండలాల్లోని అనేక గ్రామాల్లో రోడ్ల దుస్థితి కండ్లకు కడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏటా సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరవుతున్నా ప్రణాళికబద్ధంగా సాగడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని పలుమార్లు ఆదేశించారు. మరి ఆ ప్రతిపాదనలు అధికారులు సరైన కార్యాచరణ లేకుండానే రూపొందించారన్న అనుమానాలు లేకపోలేదు. అనేక గ్రామాల్లో రోడ్లు లేకపోయినా వాటిని అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం, అదేవిధంగా గడువు ముగిసే సమయం దగ్గరికి వచ్చినప్పుడే పనులు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. కొన్ని మండలాల్లో ఎక్కువ, మరికొన్ని మండలాల్లో తక్కువ, ఎక్కడబడితే అక్కడ రోడ్లు.. ఇలా ఈ ఎన్ఆర్ఈజీఎస్ రోడ్ల నిర్మాణంలో పరిస్థితి కనిపిస్తుంది. ఏటా మంజూరైన పనుల్లో సగం పనులే గ్రౌండింగ్ కావడం, మిగతా పనులు ల్యాప్స్ అయి నిధులు వెనక్కి మళ్లడం పరిపాటిగా మారింది. లేబర్ కంపోనెంటే కారణమా.. ఎన్ఆర్జీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులు కేటాయిస్తోంది. మిగతా 10శాతం నిధులను ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధుల నుంచి అయినా, ఎంపీలు ఎంపీ ల్యాడ్ ద్వారా అయినా, లేనిపక్షంలో గ్రామ పంచాయతీ నుంచే అయినా భరించిన పక్షంలోనే గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించే పరిస్థితి ఉంటుంది. వివిధ రాజకీయ కోణాల కారణంగా ఈ నిధుల మంజూరుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందుకు రాకపోవడం, గ్రామ పంచాయతీలు నిధుల లేమి కారణంగా అంతమొత్తంలో భరించలేమని చెప్పడంతో పనుల మంజూరులో ఆలస్యం జరుగుతుందన్న అపవాదు ఉంది. కాగా 90 శాతం ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరవ్వడంతో చేపట్టే ప్రతి రోడ్డు పనిలో 60శాతం లేబర్ కంపోనెంట్, 40 శాతం మెటీరియల్ కంపోనెంట్ తప్పనిసరి. అయితే మెటీరియల్ కంపోనెంటే ఈ సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో అధికంగా ఉండడంతో అధికారులు లేబర్ కంపోనెంట్‌ను అడ్డదారిలో సృష్టించడం ద్వారా ఈ రోడ్ల పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. లేబర్ కంపోనెంట్ విషయంలోనే సమస్య కారణంగా పూర్తిస్థాయిలో నిధులను వినియోగించుకోలేని దుస్థితి కనిపిస్తుందన్న విమర్శలు లేకపోలేదు. ఫిబ్రవరిలో ఈ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రావడం, అది కూడా నెలన్నర లోపల మార్చి 31లోగా పూర్తి చేయాలని చెప్పడంతో పంచాయతీల్లో ఏటా ఈ పనుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. ప్రధానంగా సర్పంచ్‌లు గ్రామ పంచాయతీలో తీర్మాణం చేసి ఈ పనులు నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టర్లకు అప్పగించడం జరుగుతుంది. అయితే చేసేది చిన్న పని అయినా బిల్లులు రావడంలో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఈ రోడ్ల నిర్మాణంపై పెట్టిన పెట్టుబడికి బయట నుంచి అప్పుగా తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీ పెరిగిపోవడంతో పనులపై ఆసక్తి చూపడంలేదన్న అభిప్రాయం లేకపోలేదు. నిబంధనల మేరకు పనులు చేపట్టాలని అధికారులు ఒత్తిడి చేయడం, పని చేపట్టాలంటే అటూ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు ఎంతోకొంత ముట్టజెప్పడం, అధికారులకు తప్పనిసరిగా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు మంజూరు అయ్యే పరిస్థితి ఉండడం, పనులు చేపట్టిన బిల్లులు ఎప్పడు వస్తాయో తెలియని పరిస్థితి కారణంగా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి కనబర్చడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిల్లుల మంజూరులో అధికారులకు మూడు నుంచి 5శాతం పర్సంటేజీ రూపంలో ఇస్తేనే ముందుకు సాగే పరిస్థితి ఉందన్న అభిప్రాయం కాంట్రాక్టర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఇలా అనేక కారణాలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వృథాప్రాయమవుతున్నాయి. జూన్‌లో మిగతా పనులు చేపడతాం గడువులోగా గ్రౌండింగ్ అయిన సీసీ రోడ్డు పనులను పూర్తి చేయడం జరుగుతుంది. ప్రధానంగా పలు మండలాల్లో ఇసుక దొరకని పరిస్థితి ఉంది. వేసవి కావడంతో వాటర్ క్యూరింగ్‌లో నీటి సమస్య ఏర్పడుతుంది. దీంతో సీసీ రోడ్లు వేయడానికి ఇబ్బంది ఎదురవుతుంది. సీసీ రోడ్ల నిర్మాణంలో లేబర్కంపోనెంట్ను జనరేట్ చేయాల్సి ఉంటుంది. మంజూరై గ్రౌండింగ్ కాని పనులకు సంబంధించి జూన్‌లో మళ్లీ చేపట్టడం జరుగుతుంది. నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదు. – మారుతి, పంచాయతీ రాజ్ ఈఈ, ఆదిలాబాద్ -
రోడ్లు అధ్వానం
తిర్యాణి : మండలంలోని గడలపల్లి పంచాయతీలోని డోంగర్‌గాం గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామం దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఇరవై కుటుంబాలు ఉన్నా ఈ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేక గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. పంచాయతీకి రావాలంటే కాలినడకే దిక్కు గడలపల్లి గ్రామ పంచాయతీ కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గడలపల్లి నుంచి డోంగర్‌గాం గ్రామానికి వెళ్లే దారిలో మధ్యలో ఉన్న వాగు వరకు మట్టి రోడ్డే దిక్కు. ప్రతినిత్యం గడలపల్లికి రాని పరిస్థితి అని కాలినడకన గాని ఎడ్లబండిని ఆశ్రయించాల్సిందేనని గ్రామస్తులు వాపోతున్నారు. రేషన్ సరుకులను గడలపల్లి నుంచి నెత్తిపైనే మోసుకువస్తున్నామని చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం రోడ్డు సౌకర్యం కల్పించడానికి మొరం పోశారు. అది పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో ఎలాంటి వాహనాలు గ్రామానికి రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో తప్పని తిప్పలు అత్యవసర సమయంలో బాధితులను ఆస్పత్రికి తరలించాలంటే నానా తంటాలు పడుతున్నామని వాపోతున్నారు. పిల్లలను బడికి పంపాలన్నా ఇబ్బందే. గ్రామంలో పాఠశాల లేదు. తప్పని పరిస్థితుల్లో పిల్లలను ఆశ్రమ పాఠశాలల్లోకి పంపిస్తున్నామని చెబుతున్నారు. ఆపత్కాలంలో అంబులెన్స్ కూడా రాని దుస్థితి. వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామ సమస్యలు గుర్తించాలని కోరుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలి గ్రామానికి రోడ్డు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. తాతల కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నా ఏ అధికారి గాని నాయకుడు గాని పట్టించుM øవడం లేదు. గ్రామం దగ్గర గుట్ట వద్ద మట్టి తీసి రోడ్డు వేస్తే గ్రామానికి ఆటోలన్నా వస్తాయి. – వెలది, బాదిరావు చర్యలు తీసుకోవాలి గ్రామానికి రోడ్డు లేక బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాం. రహదారి ఉంటే గ్రామనికి అన్ని సౌకర్యాలు వచ్చేవి. గ్రామంలో ఒక్కరికీ కూడా పక్కా ఇళ్లు లేదు. రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – గంగారాం ప్రతిపాదనలు పంపించాం గ్రామానికి రోడ్డు వేయాలని అనేకసార్లు ప్రతిపాదనలు పంపించాం. గ్రామజ్యోతి ప్రణాళికలలో కూడా ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు. నిధులు మంజూౖరు అయితే గ్రామానికి రోడ్డు వసతి కల్పించడం, వాగుపై వంతెన కూడా∙నిర్మాణం జరిగే అవకాశం ఉంది. – ఆత్రం లక్ష్మణ్, సర్పంచ్, గడలపల్లి -
అధ్వానంగా గ్రామీణ రహదారులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి గ్రామీణ రహదారులు ఛిద్రమయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలమయంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేనంత అధ్వానంగా తయారయ్యాయి. పైగా రాష్ట్రంలో మట్టిరోడ్లే అధికంగా ఉండటంతో వాటి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఆ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నా.. స్పందన మాత్రం శూన్యం. రూ.400 కోట్లకు పైగా ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసేలా సీఎంను కోరతామని పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డి స్వయంగా చెప్పి పక్షం రోజులు దాటినా, ఆ అంశంపై పట్టించుకునేవారే కరువయ్యారు. రోడ్ల నిర్వహణకు బడ్జెట్లో రూ.149 కోట్లు కేటాయించినా, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా విడుదల చేయలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అసలు పంచాయతీరాజ్ శాఖకు కేటాయించిన నిధులే నామమాత్రంగా ఉండగా, వాటి విడుదలకు ఆర్థికశాఖ ఆమోదం తెలపడంలేదని వెల్లడించాయి. వర్షాలతో అధ్వానంగా మారిన రహదారుల మరమ్మతుల కోసం మరో రూ.300 కోట్లు కావాలని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 వేలకు పైగా కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రకృతి విపత్తుల శాఖకు అందిన నివేదికలో పేర్కొన్నారు. భారీ వర్షాలతో ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బీటీ రహదారులు పూర్తి గుంతలమయంగా మారడంతో వీటిపై వెళ్లడానికి వాహన చోదకులు భయపడుతున్నారు. గ్రామాలను అనుసంధానం చేసే రహదారుల పరిస్థితి ఇలా ఉండగా, గ్రామాల్లో అంతర్గత రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్టు అధికారవర్గాలు వివరించాయి. ఎక్కవ భాగం మట్టి రోడ్లు కావడంతో అవన్నీ బురదమయంగా మారాయని, బురద తొలగించడానికి అవసరమైన నిధులు కూడా లేక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం పద్దు కింద రెండేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు భారీస్థాయిలో డబ్బు ఖర్చు చేసిన నేపథ్యంలో జేబులో నుంచి నిధులు తీసి ఖర్చుపెట్టే స్థితిలో లేరు. అంతేకాకుండా పంచాయతీ నిధుల ఖర్చుకు సంబంధించి చెక్‌పై సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శి సంతకం కూడా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో.. ఇకపై సర్పంచ్‌లు ముందస్తు నిధుల వ్యయానికి మొగ్గు చూపే అవకాశం తక్కువని అంటున్నారు.