అధ్వానంగా గ్రామీణ రహదారులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి గ్రామీణ రహదారులు ఛిద్రమయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలమయంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేనంత అధ్వానంగా తయారయ్యాయి. పైగా రాష్ట్రంలో మట్టిరోడ్లే అధికంగా ఉండటంతో వాటి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఆ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నా.. స్పందన మాత్రం శూన్యం. రూ.400 కోట్లకు పైగా ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసేలా సీఎంను కోరతామని పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డి స్వయంగా చెప్పి పక్షం రోజులు దాటినా, ఆ అంశంపై పట్టించుకునేవారే కరువయ్యారు.
రోడ్ల నిర్వహణకు బడ్జెట్‌లో రూ.149 కోట్లు కేటాయించినా, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా విడుదల చేయలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అసలు పంచాయతీరాజ్ శాఖకు కేటాయించిన నిధులే నామమాత్రంగా ఉండగా, వాటి విడుదలకు ఆర్థికశాఖ ఆమోదం తెలపడంలేదని వెల్లడించాయి. వర్షాలతో అధ్వానంగా మారిన రహదారుల మరమ్మతుల కోసం మరో రూ.300 కోట్లు కావాలని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 వేలకు పైగా కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రకృతి విపత్తుల శాఖకు అందిన నివేదికలో పేర్కొన్నారు. భారీ వర్షాలతో ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
బీటీ రహదారులు పూర్తి గుంతలమయంగా మారడంతో వీటిపై వెళ్లడానికి వాహన చోదకులు భయపడుతున్నారు. గ్రామాలను అనుసంధానం చేసే రహదారుల పరిస్థితి ఇలా ఉండగా, గ్రామాల్లో అంతర్గత రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్టు అధికారవర్గాలు వివరించాయి. ఎక్కవ భాగం మట్టి రోడ్లు కావడంతో అవన్నీ బురదమయంగా మారాయని, బురద తొలగించడానికి అవసరమైన నిధులు కూడా లేక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం పద్దు కింద రెండేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు భారీస్థాయిలో డబ్బు ఖర్చు చేసిన నేపథ్యంలో జేబులో నుంచి నిధులు తీసి ఖర్చుపెట్టే స్థితిలో లేరు. అంతేకాకుండా పంచాయతీ నిధుల ఖర్చుకు సంబంధించి చెక్‌పై సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శి సంతకం కూడా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో.. ఇకపై సర్పంచ్‌లు ముందస్తు నిధుల వ్యయానికి మొగ్గు చూపే అవకాశం తక్కువని అంటున్నారు.