‘పంచాయతీ’ జేబులకు కత్తెర
గ్రామ పంచాయతీల నిధులను తమ హస్తగతం చేసుకోవడానికి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ వేస్తోంది. కేంద్రం ద్వారా మంజూరైన నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించుకునేందుకు యత్నిస్తోంది. అంగీకరించని సర్పంచ్‌ల ‘చెక్‌పవర్’ రద్దు చేస్తామంటోంది. రాష్ట్రంలో సగానికిపైగా గ్రామపంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న నేపథ్యంలో వాటి నిధుల ఖర్చును పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఈ ఎత్తుగడ వేస్తోంది.
మీ సొమ్ము... మాకివ్వండి
* లేదంటే... సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు
* పంచాయతీలకు ప్రభుత్వం హుకుం
* రూ. 500 కోట్లు హస్తగతం చేసుకునేందుకు మౌఖిక ఆదేశాలు
* 73వ రాజ్యాంగ సవరణకు రాష్ట్ర సర్కార్ తూట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమే ఇన్నాళ్లూ చూశాం. విచిత్రంగా చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా మీ ఊళ్లో రోడ్లు వేస్తాం, గ్రామ పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన నిధులను మాకు బదిలీ చేయాలంటూ ఆదేశిస్తోంది.
స్వచ్ఛందంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు రాని గ్రామ సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేస్తామంటూ స్వయంగా ఉన్నతాధికారుల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తోంది. రోడ్ల నిర్మాణం కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు రూ.1,774 కోట్లు మంజూరు చేసింది. వాటిలో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడానికి టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 500- 600కు పైగా గ్రామ పంచాయతీల నుంచి అలా మంజూరైన నిధులను ప్రభుత్వం గుంజేసుకుంది. కేంద్రం పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా ఇప్పటికే విద్యుత్ బకాయిల పేరుతో వందల కోట్లను లాగేసుకుంది.
విపక్ష సర్పంచ్‌లు ఉన్నందునే..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించిన కారణంగా కేంద్రం రెండేళ్లుగా గ్రామాలకు నిలిపివేసిన నిధులన్నింటినీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ. 1,774 కోట్లను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారున్న నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో నిధుల ఖర్చు పూర్తిగా తమ చేతుల్లో తీసుకోవడానికి చంద్రబాబు సర్కారు ఈ ఎత్తుగడ వేసింది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాల్సిన పనులను, అదే గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారితో చేయించడానికి సిద్ధమవుతోంది.
లింకులు పెట్టి ఉన్న పథకానికీ మంగళం
పంచాయతీ నిధులను తమ హస్తగతం చేసుకునేందుకు గ్రామాల్లో వంద శాతం ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు తదితర నిర్మాణాలు చేపట్టే కార్యక్రమానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడేసింది. ‘ఉపాధి’ పథకంలో కేవలం కూలీలతో చేపట్టే పనులే కాకుండా వందశాతం ఆ పథకం నిధులతో గతేడాది వరకు గ్రామాల్లో సిమెంటు రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టారు.
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ విధానానికి చంద్రబాబు సర్కారు స్వస్తిపలికి భవిష్యత్తులో గ్రామ పంచాయతీలు సగం నిధులు ఇవ్వడానికి ముందుకొస్తేనే మిగిలిన సగం నిధులు ఉపాధి పథకం ద్వారా ఆయా గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి అనుమతి తెలపాలంటూ ప్రభుత్వం జూన్ 18న జీవో నంబరు 58 జారీ చేసింది. వాస్తవంగా, ఆర్థిక సంఘం పేరుతో కేంద్రం గ్రామాలకు ఇచ్చే నిధుల ఖర్చుతోపాటు, 90శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు జరిగే ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు కేవలం పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలి. జీవో 58 ప్రకారం.. పై రెండు పథకాల ద్వారా పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను 50-50 శాతం కలిపి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కొత్త ఎత్తుగడ వేసింది.
నిధులు మళ్లించాలంటూ ఒత్తిడి
పంచాయతీలు 50 శాతం నిధులివ్వడానికి ముందుకొస్తే ప్రభుత్వం మరో 50 శాతం నిధులిచ్చి గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తామంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొదట గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకున్నాయి. రాష్ట్రంలో 12,918 గ్రామాలు ఉండగా, అందులో దాదాపు 8వేల గ్రామాలు తీర్మానాలను ప్రభుత్వానికి అందజేశాయి. మిగిలిన గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకోవడం కోసం ఒక పక్క అధికారులు ఒత్తిడి తీసుకొస్తూనే.. మరో పక్క ఇప్పటికే తీర్మానం చేసిన గ్రామ సర్పంచ్‌లు తక్షణమే కేంద్రమిచ్చిన నిధులను రోడ్ల నిర్మాణం కోసం తమకు మళ్లించాలంటూ ఒత్తిడి మొదలుపెట్టారు. దీనిపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
73వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోందంటే...
♦ రాజ్యాంగ సవరణ మేరకు గ్రామ పంచాయతీలకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించారు. గ్రామ పంచాయతీలకు పన్ను రూపేణా వచ్చే ఆదాయంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నిధులు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.
♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపేణా గ్రామాలకు కేటాయించిన నిధులు పంచాయతీల సాధారణ నిధి (జనరల్ ఫండ్)కి జమవుతాయి. ఈ నిధులు ఖర్చు పెట్టుకోవడంలో అధికారం పూర్తిగా ఆ గ్రామాల పంచాయతీలకే ఉంటుంది.
♦ ఈ నిధుల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోరాదు.
♦ అత్యవసర సందర్భాల్లోనూ పంచాయతీలతోనే ఖర్చు చేయించాలి. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. కానీ, నిధులను తన అధీనంలోకి తీసుకోకూడదు.
♦ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 29 అధికారాలను గ్రామ పంచాయతీలకే పూర్తిగా బదిలీ చేయాలి.