ఖమ్మం జడ్పీసెంటర్: పంచాయతీల్లో మళ్లీ చెక్‌పవర్ లొల్లి మొదలైంది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్‌ను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అగ్గి రాజుకుంది. ఈ విషయంలో సర్పంచ్‌లు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహాలో జాయింట్ చెక్‌పవర్‌ను ఇవ్వడంతో అప్పట్లో సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఇప్పుడు అదే తరహాలో సర్పంచ్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో నిర్వహించే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగంలో సర్పంచ్‌తో పాటు కార్యదర్శుల సంతకం తీసుకోవటం ఏమిటని పలువురు ప్రెసిడెంట్లు ప్రశ్నిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 671 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 147 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఇటీవల మరో 48 మందిని నియమించారు. ఈ 195 పంచాయతీలు మినహా మిగిలినవాటికి కార్యదర్శులు లేరు. అటువంటప్పుడు జాయింట్ చెక్‌పవర్ ఇస్తే పరిస్థితి ఏంటని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గతంలో ఉన్న జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేశారు..ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటని అంటున్నారు. ‘ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకే సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇచ్చాము’ అని ప్రభుత్వం వాదిస్తోంది. సర్కారు వాదనతో సర్పంచ్‌లు ఏకీభవించడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండానే దుర్వినియో గం అవుతాయనడంలో అర్థం లేదని వాదిస్తున్నారు.
ఇద్దరి సంతకంతోనే నిధులు
ఈ జీవో ప్రకారం సర్పంచ్, కార్యదర్శి ఇద్దరూ సంతకం చేస్తేనే ఏ నిధులైనా విడుదలవుతాయి. గ్రామపంచాయతీల అభివృద్ధి నిమిత్తం అంతర్గత రహదారులు, మరమ్మతు పనులు, పారిశుధ్యం, వీధి దీపాలు, పంచాయతీ భవనాలు, 13వ ఆర్థికసంఘం నిధులు, బీఆర్‌జీ, ఆర్‌జీపీఎస్‌ఏ తదితర నిధులు వస్తాయి. ఈ నిధుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా సర్పంచ్, కార్యదర్శులిద్దరి సంతకం కావాలి. గతంలో జనరల్ ఫండ్ నుంచి గ్రామ మౌలిక అవసరాల కోసం ఖర్చు చేసే అధికారం సర్పంచ్‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు జనరల్ ఫండ్ డ్రా చేయాలన్నా కార్యదర్శి సంతకం తప్పనిసరి.
కార్యదర్శులపై ‘అదనపు’ భారం
జిల్లాలో 671 పంచాయతీలు ఉండగా 195 మంది కార్యదర్శులే ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులను 34 మంది అర్హులతో భర్తీ చేసే అవకాశం ఉంది. అయినా ఇంకా పలు పంచాయతీలకు సెక్రటరీల కొరత ఉంటుంది. సర్పంచ్ కు అవసరమైనప్పుడు కార్యదర్శి అందుబాటులో ఉండని సమస్య తలెత్తే అవకాశం ఉంది. గతంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జాయింట్ చెక్‌పవర్ ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌లు, కార్యదర్శులకు కలిపి ఇచ్చారు. అధికారాలను బదలాయించాలన్న డిమాండ్ సర్పంచ్‌ల నుంచి వినిపిస్తుండగా ప్రభుత్వం ఉన్న అధికారాల్లో కోత విధించడంపై సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.
సర్పంచ్‌ల మంచికే:రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి
జాయింట్ చెక్ పవర్ వల్ల సర్పంచ్‌లకే ప్రయోజనం. ప్రతి పనిలో, నిధుల ఖర్చులో సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకు బాధ్యత ఉంటుంది. ప్రతి పైస ఖర్చు కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీని వల్ల అడిట్ ఇబ్బందులు ఉండవు. జవాబుదారితనం పెరుగుతుంది. సర్పంచ్‌లకు పూర్తి వెసులుబాటు ఉంటుంది.
సర్పంచ్‌లను అవమానించడమే: కొర్రా రాములు, సోములగూడెం సర్పంచ్, పాల్వంచ
సర్పంచ్‌లు, సెక్రటరీలకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వడం సర్పంచ్‌లను అవమానించడమే. గతంలో సర్పంచ్‌లు పోరాడి తెచ్చుకున్న జీవోను సీఎం కేసీఆర్ రద్దు చేయడం దారుణం. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరుకాలేదు. అప్పుడే దుర్వినియోగం మాటెత్తడం సరికాదు.
అభివృద్ది పనులకు విఘాతమే: సరస్వతి, తోగ్గూడెం సర్పంచ్, పాల్వంచ
గ్రామ పంచాయితీలకు సెక్రటరీలు సరిపడా లేరు. ఒక్కో సెక్రటరీ మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీనివల్ల వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. వారు అందుబాటులో లేకపోతే అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. కాబట్టి సర్పంచ్‌లకే చెక్‌పవర్ ఇవ్వాలి.
మళ్లీ చెక్‌పవర్ ‘పంచాయితీ’
Published Tue, Dec 9 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement