బాలాపూర్ గ్రామ పంచాయతీ భవనం
జైనథ్: నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీల్లో నూతనంగా కొలువుదీరిన సర్పంచులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చెక్ పవర్‌ను జారీ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జాయింట్ చెక్‌పవర్ అమలులోకి రానుంది. దీంతో గ్రామాల్లో ఎన్నో రోజుల నుం చి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి మార్గం సుగమమైంది.
సమస్యలతో సతమతం..
గ్రామాల్లో పాలకవర్గం ఫిబ్రవరిలో కొలువుదీరింది. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, చెక్ పవర్ లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. కనీసం మురికి కాలువలు తీయడం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేని స్థితిలో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2018 చివర్లో జిల్లాకు ఎఫ్‌ఎఫ్‌సీ నిధులు విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీల వారీగా ఖాతాల్లో జమ కావడంతో అప్పటి పాలక వర్గాలు 60 శాతం నిధులు ఖర్చు చేశాయి. 2019 ఫిబ్రవరిలో కొత్త సర్పంచులు ఎన్నికయ్యారు. కానీ నిధులు ఉన్నప్పటికీ కూడా చెక్‌పవర్ లేకపోవడంతో నిధులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. మళ్లీ 2019 మార్చిలో ఎఫ్‌ఎఫ్‌సీ మరోవిడత కింద 14కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు కూడా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమఅయ్యాయి. కానీ చెక్‌పవర్ లేకపోవడం ఎఫ్‌ఎఫ్‌సీ నిధులు ఖాతాల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో నిధులను ఉపయోగించుకోవచ్చు.
జాయింట్ చెక్ పవర్‌పై అసంతృప్తి..
సర్పంచులతో పాటు ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే అప్పట్లో చెక్‌పవర్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచులు సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే శనివారం హఠాత్తుగా జాయింట్ చెక్‌పవర్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం వార్డు మెంబర్‌తో గెలిచిన వ్యక్తికి సర్పంచ్‌తో సమానంగా చెక్‌పవర్ కల్పించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప సర్పంచులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
పర్యవేక్షణకే కార్యదర్శులు..
కార్యదర్శుల స్థానంలో ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ ఇవ్వడంతో కార్యదర్శుల పాత్ర పర్యవేక్షణకే పరిమితం కానుంది. కార్యదర్శికి ఏ మాత్రం చెప్పకుండా సర్పంచ్, ఉపసర్పంచ్‌లు నిధులను డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో జవాబుదారీతనం, పారదర్శకత లోపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగి, అధికారులకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉండదని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చెక్ పవర్ కల్పించడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
నాలుగు నెలలుగా గ్రామాల్లో పనులు చేయలేకపోతున్నాం. ఉన్న నిధులతో వీధిదీపాలు, తాగునీరు, పలు వసతులు క ల్పించాం. ప్రస్తుతం చెక్ పవర్ ఇవ్వడంతో గ్రామ పంచాయతీలు నిధులు ఉపయోగించుకునేందుకు అవకాశం లభించింది. ఎట్టకేలకు ప్రభుత్వం చెక్‌పవర్ జారీ చేయడం సంతోషంగా ఉంది. – ఎడ్మల పోతరెడ్డి, సర్పంచ్, పూసాయి
Comments
Please login to add a commentAdd a comment